పుత్తడి కన్నా షేర్లు మిన్న!
- ఆకర్షణీయమైన పెట్టుబడిగా ఈక్విటీలు
- సెబీ చైర్మన్ యూకే సిన్హా...
ముంబై: పుత్తడితో పోల్చుకుంటే షేర్లే అధిక రాబడులనిచ్చాయని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. 15-20 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పుత్తడిలో పెట్టుబడులు 5-6 శాతం వార్షిక వృద్ధినే ఇచ్చాయని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. షేర్లలో పెట్టుబడులు 15 శాతం వార్షిక వృద్ధిని ఇచ్చాయని వివరించారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భారత వృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని వివరించారు. షేర్లలో పెట్టిన పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. పుత్తడి ధరల్లో పతనం, దీర్ఘకాలం పాటు రియల్టీ మార్కెట్ ఎదుగూ బొదుగూ లేకపోవడం వల్ల షేర్లు ఆకర్షణీయంగా మారాయని, కుటుంబాల పొదుపుల్లో అధిక భాగం ఈక్విటీ మార్కెట్లోకి రావడం మొదలైందని వివరించారు.
ప్రస్తుతానికి పుత్తడి ధరలు ఆశావహంగా లేవని, అందుకని ప్రజలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని, దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్టాక్ మార్కెట్ మంచి రాబడులనిచ్చిందని, ఇదే ఈ మార్కెట్ అందమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయని, భారత్‌లో నాలుగేళ్ల కనిష్టానికి, అంతర్జాతీయ మార్కెట్లో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయని చెప్పారు. స్టాక్ మార్కెట్ ఏడాది కాలంలో 2,000పాయింట్లు పెరిగిందని తెలిపారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఆరు నెలల్లో మాత్రం స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైందని వివరించారు. గత ఏడాది స్టాక్ మార్కెట్ 30 శాతం రాబడులిచ్చిందని వివరించారు.