వినయ్ వయసు 42 ఏళ్లు. సొంతింటికి తరవాత ప్లాన్ చేద్దాంలే అని ఊరుకున్నాడు. కానీ ఓ రోజు చక్కని ఇల్లు చాలా తక్కువ ధరకు అమ్మకానికి వచ్చినట్టు స్నేహితుల ద్వారా తెలిసింది. కొనేందుకు డబ్బులు రెడీగా లేవు. అయితే, ఈక్విటీలు ఇతర సాధనాల్లో అతడు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటిని తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు అందులో ఏవి అమ్మేయాలా? అన్నది అతడి సందేహం.
రఘురామ్ వేసవి ఎండల్ని తట్టుకోలేక రూ.38,000 ధరకు ఏసీ కొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ, దీనికి ముందు నుంచి ప్రణాళిక వేసుకోలేదు. అప్పటికప్పుడు వచ్చిన అవసరం. ఏం చేయాలి..?
ఇక్కడ రెండు వ్యవహారాల్లోనూ గమనించాల్సిన విషయం ఒకటుంది. వేటికవి భిన్నమే. కానీ రెండూ రెగ్యులర్ బడ్జెట్‌కు మించిన అవసరాలు. చాలామందికి నెలవారీ బడ్జెట్‌పై ఒక అంచనా... ఒక ప్రణాళిక ఉంటాయి. మరి ఇలాంటి ఊహించని అవసరాలు వచ్చిపడితే..? నిజానికి వీటిని తీర్చుకోవటానికి పలు మార్గాలున్నాయి.
నెలవారీ వాయిదాలు చెల్లించగలిగితే రుణం తీసుకుని సొంతం చేసుకోవచ్చు. వడ్డీ చెల్లించడం ఇష్టం లేకపోతే తమ పెట్టుబడి సాధనాల్లో కొన్నింటిని విక్రయించొచ్చు. ఒకవేళ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలన్నదే నిర్ణయమైతే స్వల్పకాలిక అవసరాల కోసం చేస్తున్న వాటిని పరిశీలించాలనేది నిపుణుల మాట. ఓ లక్ష్యం కోసం, దీర్ఘకాలిక దృష్టితో చేస్తున్న పెట్టుబడులు మొదటి చాయిస్ కాకూడదని ఫిన్‌కార్ట్ వ్యవస్థాపకుడు తన్వీర్ ఆలమ్ సూచించారు.
చాలకపోతే అప్పుడు మరింత ముందుకు
బ్యాంకు ఖాతాల్లోని మిగులు బ్యాలెన్స్, అత్యవసర నిధితోనూ తీరనంత పెద్ద అవసరాలయితే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సి ఉంటుంది. అవే మీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, షేర్లు. వీటిని విక్రయించేసి అవసరాలు తీర్చుకోవడం సరైనదే. మీకు లార్జ్ పోర్ట్‌ఫోలియో ఉంటే అందులో అవసరమైనంత వెనక్కి తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.5,00,000 అవసరమైందనుకోండి. నిస్సం కోచంగా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విక్రయించడం ద్వారా అవసరాలు అధిగమించొచ్చు.
అయితే ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకునే ముందు అవి ఏడాదిలోపు పెట్టుబడులయితే వాటిపై ఎగ్జిట్‌లోడ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే పన్ను పరమైన అంశాలు. ఏడాది దాటిన పెట్టుబడులు అయితే పన్ను భారం కాస్తంత తగ్గుతుంది. ఇది కూడా సందర్భాన్ని బట్టే ఉంటుంది. ఉదాహరణకు వినయ్ చౌకగా వస్తున్న ఇల్లు కొనాలనుకుంటున్నాడు. అతడి విషయానికొస్తే ఎగ్జిట్‌లోడ్, పన్ను వంటి అంశాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే అతడు కొంటున్నది చౌకగా.
అలాగే, వినయ్ విషయంలో జీవిత బీమా పాలసీలు కూడా అక్కరకు వస్తాయి. ప్రాపర్టీపై బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకోవచ్చు. జీవిత బీమా ఎండోమెంట్ పాలసీపై రుణం సులభంగానే లభిస్తుంది. పాలసీకి సరెండర్ వ్యాల్యూ అని ఉంటుంది. దీని ఆధారంగా ఎంత రుణం లభిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ రుణాలపై సాధారణంగా 10% వడ్డీ ఉంటుంది. ఒకవేళ ఎల్‌ఐసీ నుంచే రుణం తీసుకుంటే వడ్డీ 9 శాతమే. పాలసీపై రుణం తీసుకునేట్టు అయితే దానిపై హక్కులను ఎల్‌ఐసీకి బదలాయిస్తున్నట్టు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.
అయితే, పాలసీని రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదని సూచిస్తున్నారు నిపుణులు. ఎండోమెంట్ పాలసీని సాధారణంగా ఏదో ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం తీసుకుని ఉంటారు. మధ్యలో వచ్చే ఆకస్మిక అవసరాల కోసం పాలసీని రద్దు చేయడం ద్వారా వాటిని కోల్పోవాల్సి వస్తుంది. దీనికి బదులు పాలసీపై రుణం పొందడం మంచి ఆలోచన. ఇక హెచ్‌డీఎఫ్‌సీ ప్రాపర్టీ విలువలో 60 శాతాన్ని రుణంగా ఇస్తోంది. వడ్డీ రేటు 9.7 శాతం నుంచి 10.5 శాతం మధ్య ఉంది.
ముందు ఏది ఎంచుకోవాలి...?
అవసరం రాగానే ఎవరైనా ముందు చూడాల్సింది బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌వైపే. ఎందుకంటే బ్యాంకులు ఖాతాల్లోని బ్యాలెన్స్‌పై ఇచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణ తరుగు స్థాయిలోనే ఉంటుంది. ఒక్కోసారి అంతకంటే తక్కువే. కనుక ఏ మాత్రం రాబడి లేని బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను తొలుత వినియోగించుకోవటం మంచిది. నెలవారీ బడ్జెట్ అవసరాల కోసం ఉద్దేశించినవి కాకుండా ఖాతాల్లోని మిగులు నిల్వలకే ఇది వర్తిస్తుంది.
ఆ తర్వాత చూడాల్సింది అత్యవసర నిధి వైపు. సాధారణంగా ఇది ఉద్యోగం కోల్పోతే తిరిగి మరో ఉద్యోగం సంపాదించుకునే వరకు కుటుంబ పోషణ కోసం ఉద్దేశించినది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న అవసరాల కోసం వినియోగించుకోవడం సరైదనే. పై ఉదాహరణలో రఘురామ్ ఏసీ కొనుగోలుకు అత్యవసర నిధి వైపు చూడొచ్చు. ప్రణాళిక పరిధిలో లేకుండా వచ్చే అవసరాలకు అత్యవసర నిధి తొలి ఆప్షన్‌గా చూడొచ్చని ‘లాడర్7.కామ్’ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ చెప్పారు.
అత్యవసర నిధి అన్నది సాధారణంగా ఓ వ్యక్తి మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలను తీర్చేంత ఉండాలి. అయితే, ఉద్యోగం కోల్పోయే రిస్క్ ఎక్కువగా ఉండేవారు (ఉద్యోగ భద్రత లేమి), ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండేవారు కనీసం తొమ్మిది నెలల నుంచి ఏడాది పాటు అవసరాలను తీర్చేంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఈ నిధిని ఆకస్మికంగా ఎదురయ్యే అవసరాలకు వినియోగించుకోవచ్చు.
దీనివల్ల అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అత్యవసర నిధిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రాబడులు కూడా అందుకోవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే ముందు ఎగ్జిట్ చార్జీలు, పన్ను పరమైన నిబంధనలు, పథకం పనితీరును చూడటం మర్చిపోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment