
ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (సిఫ్)ను ప్రవేశపెట్టడం గమనార్హం.
అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్‌లో 25 శాతం మేర డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్‌ను సెబీ వర్గీకరించింది.
ఇదీ చదవండి: ఏఐకి కంపెనీల జై
ప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిఫ్‌లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ను సిఫ్‌కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది.