
మిరే అస్సెట్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్
ఈక్విటీలు ఎప్పుడూ అస్థిరతలతో చలిస్తుంటాయి. కొంత కాలం పాటు ర్యాలీ చేసి, కొంత కాలం దిద్దుబాటుకు గురవుతుంటాయి. భారత్ వేగంగా వృద్ధి చెందుతూ, అభివృద్ధి చెందిన దేశం కావాలన్న ఆకాంక్షలతో అడుగులు వేస్తోంది. కనుక దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడులకే ఎక్కువ అవకాశాలున్నాయి.
ఇన్వెస్టర్లు ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లో, అది కూడా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు పొందే అవకాశాలుంటాయన్నది నిపుణుల సూచన. ఈ రెండు విభాగాల్లో పెట్టుబడికి వీలు కల్పిస్తున్నదే మిరే అస్సెట్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్. కనీసం 10 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులను పరిశీలించొచ్చు.
రాబడులు
ఈ పథకం గడిచిన ఏడాదిలో ఒక శాతం నష్టాన్నిచ్చింది. ఇటీవలి కాలంలో స్టాక్స్ గణనీయంగా దిద్దుబాటుకు గురి కావడం చూస్తున్నాం. దీని ఫలితమే ఏడాది కాలంలో రాబడి కాస్తా నష్టంగా మారిపోవడం. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 12 శాతానికి పైనే వార్షిక రాబడి ఈ పథకంలో ఇన్వెస్టర్లకు లభించింది. అదే ఐదేళ్లలో ఏటా 17 శాతం పెట్టుబడులపై రాబడి తెచ్చి పెట్టింది. ఏడేళ్లలోనూ 14.63 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈ పథకం గతంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ పేరుతో పనిచేసింది. 2010 జూలైలో పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఇప్పటి వరకు వార్షిక రాబడి 19 శాతంగా ఉండడం గమనార్హం.

పెట్టుబడుల విధానం
పేరులో ఉన్నట్టుగా ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కంపెనీల భవిష్యత్ వృద్ధి సామర్థ్యాలపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది. భవిష్యత్‌లో దిగ్గజాలుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీలను ముందుగానే ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది. ఈ పథకం సాధారణంగా 35 - 65 శాతం మధ్య లార్జ్‌క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 100 అగ్రగామి కంపెనీలు) కేటాయిస్తుంటుంది.
మిడ్‌క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250వరకు ఉన్నవి) కేటాయింపులు 35–65 శాతం మధ్య నిర్వహిస్తుంటుంది. భవిష్యత్ బ్లూచిప్ కంపెనీల్లో ముందే పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. బోటమ్‌అప్, వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానాలను అనుసరించి స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. అధిక నాణ్యమైన కంపెనీల్లో సహేతుక ధరల వద్దే పెట్టుబడులు పెడుతుంది. ఈ పథకం మొదలైన నాటి నుంచి నీలేష్ సురానా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.36,514 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.31 శాతాన్ని ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 103 స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌లో 63 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 34 శాతానికి పైనే ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 2.49 శాతం కేటాయింపులు చేసింది. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 13.71 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 13 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment