
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్‌ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌వైజరీ బాడీ (ఆర్‌ఏఏఎస్‌బీ) లేదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌వైజరీ బాడీ (ఐఏఏఎస్‌బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.
ఆర్‌ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది.
పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. "రీసెర్చ్ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్‌ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment