పోర్ట్‌ఫోలియో ఇలా అయితే బెటర్‌! | Sakshi Special About Equities Portfolio Investments | Sakshi
Sakshi News home page

పోర్ట్‌ఫోలియో ఇలా అయితే బెటర్‌!

Published Mon, May 17 2021 4:31 AM | Last Updated on Mon, May 17 2021 4:36 AM

Sakshi Special About Equities Portfolio Investments

కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించి ఇప్పటికే ఒక మాసం ముగిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించాయి. ప్రధాన సూచీలు 70 శాతం ర్యాలీ చేయగా.. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 సూచీలో 200కు పైగా స్టాక్స్‌ రెట్టింపునకు పైగా పెరిగాయి.  మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లోనూ అదే మాదిరి లాభాలు ఆశించడం అత్యాశే అవుతుంది. పెట్టుబడులంటే ఒక్క లాభాలే కాదు. మీ పెట్టుబడికి రక్షణ కూడా అవసరం.

ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైనా అధిగమించే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్‌ తన పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళికకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, ఈక్విటీల్లో అధిక రాబడులను చూసి లేదా బిట్‌కాయిన్‌ పరుగులు చూసి భారీగా రిస్క్‌ తీసుకోవడం మంచిది కాదంటున్నారు. ఈక్విటీలతో పాటు ఇతరత్రా సాధనాలకు ఇన్వెస్టర్లు ఏ మేరకు పెట్టుబడులను కేటాయించుకోవాలన్న అంశంపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి...

ఎకానమీ పుంజుకుంటుంది
ప్రతీ ఇన్వెస్టర్‌ జీవితంలో ఏ దశలో ఉన్నారు.. లక్ష్యాలు, వాటికి ఎంత వ్యవధి ఉందనే అంశాల ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక అవరోధాలు ఏర్పడినప్పటికీ  2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుంది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి చక్రంలోకి భారత్‌ ప్రవేశించనుంది. కంపెనీలు బలమైన లాభాల ఆర్జనకు ఇది వీలు కల్పిస్తుంది. మార్కెట్లు మంచి పనితీరు చూపించేందుకు మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభాలు పెరగనున్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఈక్విటీలు సా«ధారణం కంటే ఎక్కువే రాబడులను ఇస్తాయి. కరోనా సెకండ్‌వేవ్‌ సవాళ్లు విసురుతున్నప్పటికీ, వాటిని భారత్‌ తట్టుకోగలదన్న విశ్వాసం ఉంది.
– నీరజ్‌ కుమార్‌ ఫ్యూచర్‌
జనరాలి ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

ఇండెక్స్‌ ఫండ్స్‌ /ఈటీఎఫ్‌లు మెరుగైనవి..
2020 మార్చిలో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఏడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్‌ 78 శాతం ర్యాలీ చేసింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఈక్విటీల పరిమాణం పెరిగి ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి సంపదను సమకూర్చుకునేందుకు సరైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఎంతో అవసరం. పెట్టుబడుల లక్ష్యాలకు ఇది కీలకం. ఆయా అంశాలను పరిశీలిస్తే...
► ఈక్విటీలు: మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఇండెక్స్‌ ఫండ్స్‌ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ వ్యయాలకే మార్కెట్‌ ఆధారిత రాబడులను అందుకోవచ్చు.  
► స్థిరాదాయం: స్థిరమైన, మంచి వృద్ధికి అవకాశం ఉన్న ఎన్‌సీడీలు ఇప్పటికీ ఉన్నాయి. మార్కెట్‌ అస్థిరతలను తట్టుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులకు హెడ్జింగ్‌ కోసం ఈ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు.  
► అంతర్జాతీయ ఈక్విటీలు: దేశీయ మార్కెట్లలో ఉండే అస్థిరతలకు హెడ్జ్‌ (రక్షణగా)గా అంతర్జాతీయ ఈక్విటీలు ఉపయోగపడతాయి. అంతేకాదు బలమైన వృద్ధి అవకాశాలున్న అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది.  
► బంగారం: ఈక్విటీ     మార్కెట్ల తీరు ప్రతికూలంగా మారిన సందర్భాల్లో బంగారం పథకాల్లో పెట్టుబడులు.. స్థిరత్వాన్నిస్తాయి.
పెట్టుబడుల కేటాయింపులు..  

► ఈక్విటీలు: 70 శాతం (నేరుగా స్టాక్స్‌లో 40 శాతం, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు 20 శాతం, ఈఎస్‌జీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు 10 శాతం)
► ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌: 15 శాతం (డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు 10 శాతం, ఏఏఏ రేటెడ్‌ కార్పొరేట్‌ ఎన్‌సీడీలకు 5 శాతం). డెట్‌ ఫండ్స్‌లో అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ లేదా లో డ్యురేషన్‌ ఫండ్‌ లేదా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ లేదా డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
► అంతర్జాతీయ ఈక్విటీలు: 10 శాతం (ఇంటర్నేషనల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు 5 శాతం, ఇంటర్నేషనల్‌ ఈటీఎఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు 5 శాతం)
► బంగారం: 5 శాతం (గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా సార్వభౌమ బంగారం బాండ్లు)
– దినేష్‌ రోహిరా, 5నాన్స్‌ డాట్‌కామ్‌ సీఈవో

ఇక ముందూ ఈక్విటీల ర్యాలీ
2021–22లో అంతర్జాతీయంగా అధిక ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ఇది ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి, ప్రధానంగా భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది. దేశీయ ఈక్విటీలకు 50–60 శాతం మధ్య, అంతర్జాతీయ ఈక్విటీలకు 20–30 శాతం మధ్య కేటాయించుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. వ్యాల్యూ స్టాక్స్‌పై దృష్టి సారించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది కాలంలో ఇవి మంచి పనితీరు చూపిస్తాయి. బంగారం, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలకు 10 శాతం చొప్పున కేటాయించుకోవాలి. నిపుణుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి.

కేటాయింపులు..  
► బంగారం, ఫిక్స్‌డ్‌ఇన్‌కమ్‌: 10 శాతం
► అంతర్జాతీయ ఈక్విటీలు: 20–30% దేశీయ ఈక్విటీలు: 50–60%

– దివమ్‌ శర్మ, గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్‌

60/40 ఫార్ములా..
ఇన్వెస్టర్‌ వ్యక్తిగత రిస్క్‌ సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. సాధారణంగా 60/40 సూత్రాన్ని మేము సూచిస్తుంటాం. అంటే 60 శాతం కేటాయింపులు ఈక్విటీలకు, మిగిలిన 40 శాతం స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు, బంగారం కలయికగా ఉండాలి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు భారీ ర్యాలీ చేసినప్పటికీ 2021–22లోనూ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడులను ఇస్తాయని భావిస్తున్నాం. తక్కువ వడ్డీ రేట్లు, సరిపడా ద్రవ్యలభ్యత, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం, కార్పొరేట్‌ లాభాలు పుంజుకోవడం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగుతుంది. వచ్చే రెండేళ్లపాటు ఈక్విటీలు రెండంకెల రాబడులను ఇస్తాయన్నది అంచనా. కార్పొరేట్‌ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు కొన్ని  సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని దేశం అధిగమించడానికి తగిన అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇది ఈక్విటీలకు సానుకూల అంశం.

కేటాయింపులు
► ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌: 40 శాతం (ఇందులో బంగారం, వడ్డీ ఆదాయాన్నిచ్చేవి, స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు ఉండాలి)
► ఈక్విటీలు: 60 శాతం కేటాయించుకోవాలి.  

– గౌరవ్‌దువా, షేర్‌ఖాన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement