రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడం, అమెరికా సెనేట్ భారీ ప్యాకేజీకి ఆమోదం తెలపడం, ముడిచమురు ధరలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,100 పాయింట్లపైకి ఎగబాకాయి. జీవిత కాల కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకోవడం కలసివచ్చింది. సెన్సెక్స్ 743 పాయింట్లు పెరిగి 31,380 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 206 పాయింట్ల పెరిగి 9,187 పాయింట్ల వద్ద ముగిశాయి.
892 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, మన మార్కెట్ లాభాల్లో ఆరంభమైంది. తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారిపోయింది. ఫేస్‌బుక్ డీల్ జోరుతో కొనుగోళ్లు జోరుగా సాగడంతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత లాభాలు స్థిరంగా కొనసాగాయి. ఒక దశలో 58 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, మరో దశలో 834 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 892 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
పెద్ద షేర్లపై పెరిగిన నమ్మకం...
రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ భారీగా పెట్టుబడులు పెట్టనుండటంతో లార్జ్ క్యాప్ షేర్లపై ఇన్వెస్టర్ల నమ్మకం మరింతగా పెరిగిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ అనలిస్ట్ ఎస్. రంగనా«థన్ పేర్కొన్నారు. 48,400 కోట్ల డాలర్ల ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోదం తెలపడం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించిందని వివరించారు. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో వృద్ధి జోష్ పెంచడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. జపాన్ మినహా మిగిలిన ఆసియా స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1–2 శాతం లాభాల్లో ముగిశాయి.
రిలయన్స్ రయ్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 10 శాతం లాభంతో రూ.1,363 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 743 పాయింట్ల లాభంలో దాదాపు సగం వాటా(383 పాయింట్లు) ఈ షేర్‌దే ఉండటం విశేషం. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.80,711 కోట్లు ఎగసి రూ.8,64,268 కోట్లకు ఎగబాకింది. రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా ఈ షేరు జోరుగా పెరిగింది. టెక్నాలజీ రంగంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ రుణ భారం రూ.1.53 లక్షల కోట్లుగా ఉంది. ఈ నిధులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ భారం భారీగా తగ్గనున్నది. వచ్చే ఏడాది మార్చికల్లా రుణ రహిత కంపెనీగా అవతరించాలన్న రిలయన్స్ కంపెనీ లక్ష్యం సాకారం కావడానికి ఫేస్‌బుక్ డీల్ తోడ్పడనున్నది.
► స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ రూ.2.16 లక్షల కోట్లు పెరిగి రూ.122.58 లక్షల కోట్లకు చేరింది.
► సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్ మినహా మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి.
► దాదాపు 30కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్, బజాజ్ హెల్త్‌కేర్, రుచి సోయా, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లెమన్ ట్రీ హోటల్స్, క్వెస్ కార్పొ, ఆర్‌బీఎల్ బ్యాంక్... తదితర 80కి పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి.
► 300కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అమర రాజా బ్యాటరీస్, జుబిలంట్ ఫుడ్ వర్క్స్, ఫ్యూచర్ రిటైల్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా ఐడీఎఫ్‌సీ, సుజ్లాన్ ఎనర్జీ, శోభ, వెంకీస్, ఐడీఎఫ్‌సీ తదితర 200 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి.
► అరబిందో ఫార్మా షేర్ జోరు కొనసాగుతోంది. మంగళవారం 20 శాతం ఎగసిన ఈ షేర్ బుధవారం ఇంట్రాడేలో మరో 6 శాతం లాభపడి రూ.684ను తాకింది. చివరకు 1.3 శాతం నష్టంతో రూ.643 వద్ద ముగిసింది. గత నెల 23న రూ.294గా ఉన్న ఈ షేర్ నెల రోజుల్లోనే 119 శాతం లాభపడటం విశేషం.
ఫేస్‌బుక్ డీల్ జోష్
Published Thu, Apr 23 2020 5:48 AM | Last Updated on Thu, Apr 23 2020 5:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment