ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా ర్యాలీ చేసిన తర్వాత దిద్దుబాటుకు గురికావడం సహజం. అమ్మకాల ఒత్తిడికి పడిపోయినా.. కనిష్ట ధరల వద్ద కొనుగోళ్లు మార్కెట్లను ఎప్పుడూ ఆదుకుంటుంటాయి. దీంతో బలంగా తిరిగి ముందుకు ర్యాలీ చేస్తుంటాయి. మార్కెట్ కరెక్షన్లలో కాస్తంత అయినా తమ పెట్టుబడులకు కుదుపుల నుంచి రక్షణ ఉండాలని భావించే వారు, అదే సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై అధిక రాబడులు ఆశించే వారు ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
పెట్టుబడుల విధానం..
ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. పెట్టుబడుల్లో గరిష్టంగా 35 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు పడినాకానీ.. పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోకుండా డెట్ విభాగం ఆదుకుంటుంది. షేర్ల ధరలు గణనీయంగా పడిపోతుంటే రిటైల్ ఇన్వెస్టర్లు భావోద్వేగాలకు గురికావడం సహజంగా చూస్తుంటాం. దీంతో నష్టాలకు కూడా విక్రయించేస్తుంటారు. అదే మాదిరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్‌ఏవీల క్షీణతను చూసి విక్రయించే తప్పిదం చేయకూడదు. అందుకనే భావోద్వేగాలపై నియంత్రణ లేని వారు, రిస్క్ అంతగా వద్దనుకునేవారికి హైబ్రిడ్ ఫథకాలు అనుకూలంగా ఉంటాయి.
ఎందుకంటే కొంత భాగం పెట్టుబడులు డెట్ సాధనాల్లో ఉంటాయి కనుక.. ఈక్విటీ కరెక్షన్లలోనూ ఎన్‌ఏవీ పెద్దగా పడిపోవడం జరగదు. ఈ పథకం ఈక్విటీల్లో గరిష్టంగా 65 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీల్లో అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్ రూపంలో ఈ విధంగా రెండు రకాల ప్రయోజనాలను పొందొచ్చు. ఈ విభాగంలో ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం మంచి రాబడులతో మెరుగైన స్థానంలో ఉంది. గతంలో ఈ పథకం ప్రిన్సిపల్ బ్యాలన్స్‌డ్ ఫండ్‌గా కొనసాగేది.
రాబడులు
ఈ పథకం పనితీరు అన్ని కాలాల్లోనూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 48 శాతం రాబడులను అందించింది. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకున్నా వార్షిక రాబడులు 13.36 శాతం చొప్పున ఉన్నాయి. అదే విధంగా ఐదేళ్లలో 13.51%, ఏడేళ్లలో 12.77 శాతం, పదేళ్లలో 14.85 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. డెట్‌తో కూడిన పథకం దీర్ఘకాలంలో సగటున 12 శాతంపైనే రాబడులను అందించడం అన్నది మంచి విషయమే.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.1,120 కోట్లున్నాయి. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ పథకం పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. 2017 బుల్ మార్కెట్, 2018 బేర్ మార్కెట్ సమయాల్లో ఈ పథకం ఈక్విటీల్లో పెట్టబడులను 65–68 శాతం మధ్య కొనసాగించింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 75 శాతం ఈక్విటీల్లోనే ఉన్నాయి. డెట్ పెట్టుబడులు 20 శాతంగా ఉంటే, మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. మొత్తం 60 స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ 24 శాతం పెట్టుబడులను వీటికే కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ, ఇంధనం, ఆటోమొబైల్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment