ముంబై: ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) వేయడంతో బీమా పథకాలు, ముఖ్యంగా యూనిట్ ఆధారిత బీమా పథకాల(యులిప్)కు ఆకర్షణ పెరుగుతుందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బడ్జెట్‌లో ఎల్‌టీసీజీని తిరిగి ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1న ప్రకటించిన వెంటనే మార్కెట్లు భారీగా పతనమై కోలుకోగా, మరుసటి రోజు మళ్లీ భారీ క్షీణత(2.3 శాతం)ను నమోదు చేసిన విషయం విదితమే.
ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఒక ఏడాదిలో దీర్ఘకాలిక లాభం రూ.లక్ష మించితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ చేసే డివిడెండ్లపైనా కేంద్రం 10 శాతం పన్ను విధించింది. ‘‘తాజా ప్రతిపాదన నేపథ్యంలో జీవిత బీమా పాలసీలు ముఖ్యంగా యులిప్‌లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నాం’’అని మోర్గాన్‌స్టాన్లీ తన వారంతపు నివేదికలో వివరించింది.
ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం జీవిత బీమా పథకాల నుంచి అందే ఆదాయంపై పన్ను లేదన్న విషయాన్ని నివేదికలో గుర్తు చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం చూస్తున్నామని, ప్రస్తుత వివరాలు కచ్చితమే అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వంటి ప్రైవేటు కంపెనీలకు లాభం కలుగుతుందని పేర్కొంది. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీతోపాటు డివిడెండ్ పంపిణీపైనా పన్ను వేయడం ఈ రంగంలోకి పెట్టుబడుల రాకకు కొంత మేర అడ్డంకి కాగలదని నిపుణులు సైతం భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment