Insurance schemes
-
మీ బ్యాంక్ అకౌంట్లో రూ. 456 ఉండేలా చూసుకోండి! లేదంటే..
మన దేశంలో చాలా మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే బీమా పథకాలను వినియోగించుకుంటున్నారు. దేశ ప్రజలందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలన్న సదుద్దేశ్యంతో కేంద్రం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనే పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలకు వినియోగించుకునే వారు ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలి ఉంటుంది. కొంతమంది వినియోగదారులు ఈ స్కీమ్ కింద అమౌంట్ చెల్లించడానికి వారి బ్యాంక్ అకౌంట్ లింక్ యాడ్ చేసి ఉంటారు. కావున దీని ద్వారా సమయానికి అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. అయితే ఆ సమయానికి ఖాతాలో సరైన అమౌంట్ ఉండేలా చూసుకోవాలి. ఈ స్కీమ్స్ ఉపయోగించుకునే వారు మే 31 లోపు తప్పకుండా ఖాతలో రూ. 456 ఉండేలా చూసుకోవాలి. పీఎమ్‌జేజేబీవై అనేది వన్ ఇయర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు చేరవచ్చు. పాలసీ తీసుకున్న వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల వరకు భీమా లభిస్తుంది. ఈ కవరేజ్ జూన్ 1 నుంచి మే 31 స్కీమ్ కవరేజ్ లభిస్తుంది. ఇక ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ప్రమాదవ శాత్తు పాలసీదారుడు చనిపోతే వారి కుటుంబాలకు నిర్దిష్ట అమౌంట్ వస్తుంది. ఒక వేళా ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా పాలసీ డబ్బులు లభిస్తాయి. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్‌లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ) బ్యాంకులు మే 25 నుంచి మే 31 వరకు ప్రతి ఏడాది ఈ పాలసీ డబ్బులను కట్ చేసుకుంటూ ఉంటుంది. కావున ఈ రెండు స్కీమ్స్ కలుపుకుని బ్యాంక్ నుంచి రూ. 456 కట్ చేసుకుంటారు. కాబట్టి మే 31 నాటికి తప్పకుండా ఖాతాలో రూ. 456 ఉండేట్లు చూసుకోవాలి. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. అయితే కేంద్రం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని పెంచడం కూడా జరిగింది. గతంలో పీఎంజేజేబీ స్కీమ్ కోసం ప్రీమియం రూ. 330 మాత్రమే ఉండేది, అది ఇప్పుడు రూ. 436 కి పెరిగింది. అదే సమయంలో పీఎంఎస్బీ ప్రీమియం రూ. 12 నుంచి రూ. 20 కి పెంచారు. ఈ కొత్త ధరలు 2022 జూన్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. -
బీమా రంగం.. 80సీ పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: బీమా పథకాలను మరింత మందికి చేరువ చేయడానికి వీలుగా పరిశ్రమ కీలకమైన సూచనలను కేంద్రానికి తెలియజేసింది. సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియంకు ప్రత్యేకంగా రూ.లక్ష పరిమితిని ఏర్పాటు చేయాలని కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా అమలవుతోందని, ఇవి మరింత అందుబాటు ధరలకు దిగిరావడానికి 5 శాతం శ్లాబులోకి మార్చాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. 2022–23 బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు చోటు కల్పించాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ప్రజలను ప్రోత్సహించేందుకు సెక్షన్ 80సీ కింద అదనంగా రూ.లక్ష పన్ను మినహాయింపు పరిమితిని బీమా ప్రీమియం చెల్లింపులకు కల్పించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ సీఎఫ్‌వో తరుణ్ రస్తోగి తెలిపారు. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పన్ను మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్టు ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ సుబ్రజిత్ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. అప్పుడు కస్టమర్ల డబ్బులు దీర్ఘకాల సాధనాల్లోకి వెళతాయన్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం ‘‘సెక్షన్ 80సీ ఇప్పుడు ఎన్నో సాధనాలతో కలసి ఉంది. పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనీసం టర్మ్ పాలసీలకు అయినా ప్రత్యేక సెక్షన్ పేరుతో మినహాయింపు కల్పించాలి. అది దేశ ప్రజలకు బీమా రక్షణ పరంగా ఉన్న అంతరాన్ని కొంత పూడ్చడానికి సాయపడుతుంది’’ అని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే చెప్పారు. ‘‘జీవిత బీమా అన్నది సామాజిక భద్రత కల్పించే సాధనం. కనుక సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మినహాయింపును పెంచాలి’’అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్స్ హెడ్ చిన్మయ్ బదే పేర్కొన్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధించి బీమా రంగం నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నివేదిక ప్రకారం జీడీపీలో బీమా వ్యాప్తి రేటు 4.2 శాతంగా ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సగటు 7.4 శాతంగా ఉండడం గమనార్హం. 2021 మార్చి నాటికి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు 1 శాతంగానే ఉంది. ఇది కూడా నిత్యావసరమే.. కరోనా మహమ్మారి కల్పించిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడినట్టు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రూపమ్ ఆస్తానా తెలిపారు. ‘‘హెల్త్ ప్లాన్లపై జీఎస్టీ రేటును గణనీయంగా తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీంతో హెల్త్ ప్లాన్లను, అదనపు రైడర్లను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది’’అని ఆస్తానా చెప్పారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘెల్ స్పందిస్తూ.. బీమా ప్లాన్ కొనుగోలులో ప్రీమియం ముఖ్య పాత్ర పోషిస్తుందని, తగినంత కవరేజీని ఎంపిక చేసుకుంటే దానిపై 18 శాతం జీఎస్టీ రేటు వల్ల భారం పెరిగిపోతున్నట్టు తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిత్యావసర వస్తువు మాదిరిగా పరిగణించాలని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఈవో స్నానయ్ ఘోష్ కోరారు. అధిక వైద్య ఖర్చుల నేపథ్యంలో సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాలని నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో, ఎండీ కృష్ణన్ రామచంద్రన్ సూచించారు. -
బీమా పథకాలు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆపదలో విలవిల్లాడే పేద కుటుంబాలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 4 రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలుచేసే బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్లకు (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్ బీమా, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లింపు, వైఎస్సార్ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడమే కాకుండా క్లెయిమ్ సొమ్మును సంబంధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే వలంటీర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది. బీమా క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ బీమా పథకం అమల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. బీమా పరిహార ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడం ద్వారా మరణించిన లేదా బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్న తరహాలోనే ఈ బీమా పథకాల పరిహారం కూడా అందించనుంది. ఈ క్లెయిమ్‌ల పరిష్కారం విషయమై జాయింట్ కలెక్టర్ 15 రోజులకోసారి జిల్లా, మండల, పట్టణ స్థానికసంస్థల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి కలెక్టర్‌కు నివేదికను ఇవ్వాలని, కలెక్టర్ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సమీక్షించనుంది. 4 బీమా పథకాలు.. ►పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి.. 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలను పరిహారంగా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా 5 లక్షల రూపాయలను బీమా ద్వారా పరిహారం చెల్లిస్తుంది. ►వ్యవసాయ కారణాలతో రైతులు, కౌలు రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ కింద రూ.7 లక్షల పరిహారం చెల్లించాలి. ►చేపలవేట సమయంలో 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి. ►వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కింద గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మరణిస్తే ప్రభుత్వం నిర్ధారించిన పరిహారాన్ని చెల్లించాలి. -
బీమా కంపెనీలకే లాభాల ‘పంట’
సాక్షి, హైదరాబాద్: పంటల బీమా పథకాల ద్వారా రైతులు బాగుపడుతున్నారా... లేదంటే బీమా కంపెనీలు బాగుపడుతున్నాయా... అంటే కంపెనీలే బాగుపడుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదికే అందుకు నిలువెత్తు సాక్ష్యం. 2016–17 ఖరీఫ్, రబీల్లో కంపెనీలకు రైతులవాటా, రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించిన వాటా కలిపి మొత్తం ప్రీమియం సొమ్ము రూ.22,345 కోట్లు. కానీ, బీమా కంపెనీలు ఆ ఏడాది రైతులకు చెల్లించిన పరిహారం రూ.16,279 కోట్లు మాత్రమే. అంటే, ఆ ఒక్క ఏడాదిలోనే బీమా కంపెనీలు రూ.6,066 కోట్ల లాభం పొందాయి. 2017–18 ఖరీఫ్‌లో రైతుల, ప్రభుత్వం వాటా కలిపి బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం రూ.19,767 కోట్లు, కాగా కంపెనీలు రైతులకు చెల్లించిన పరిహారం రూ.16,967 కోట్లే. ఒక్క ఖరీఫ్ సీజన్లో కంపెనీల లాభం రూ.2,799 కోట్లు అన్నమాట. ఈ 3 సీజన్లలో బీమా కంపెనీలు రైతులు, ప్రభుత్వం నుంచి వసూలు చేసిన ప్రీమియం సొమ్ము రూ.42,112 కోట్లు కాగా, రైతులకు ఆ కంపెనీలు చెల్లించిన ప్రీమియం రూ.33,247 కోట్లు మాత్రమే. ఆయా కంపెనీలు చేసిన దోపిడీ రూ.8,865 కోట్లు కావడం గమనార్హం. ఒకవైపు అప్పులు పెరిగి దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు కంపెనీలు వారి ప్రీమియంతో కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి... ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్ బీవై), పునర్నిర్మిత వాతావరణ ఆధారిత పంటల బీమా(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 2 పథకాలను 2016–17 నుంచి అమలు చేస్తోంది. అంతకుముందు కేంద్రమే మరోపేరుతో పంటల బీమా పథకాలను అమలుచేసింది. అంతకుముందు ప్రభుత్వ బీమా కంపెనీయే పంటలబీమాను అమలు చేయగా, ఈ 2 పథకాలను ప్రవేశపెట్టాక ప్రైవేటుబీమా కంపెనీలకూ చోటు కల్పించారు. మొత్తంగా రాష్ట్రంలోనూ గత కొన్నేళ్లుగా కంపెనీ లే భారీ లాభాలు గడించాయి. కొన్నేళ్లు 2 రెట్లయితే, ఒకసారైతే ఏకంగా 3 రెట్లు లాభాలు గడిం చడం గమనార్హం. లాభాలు గణనీయంగా ఉన్నా బీమాకంపెనీలు ఏడాదికేడాదికి ప్రీమియం రేట్లను భారీగా పెంచుతున్నాయి. 2013–14లో రాష్ట్రంలో రైతులు, ప్రభుత్వం కలిపి పంటల ప్రీమియంగా రూ.137.60 కోట్లు చెల్లిస్తే, రైతు లకు క్లెయిమ్స్ కింద అందింది రూ. 56.39 కోట్లే. ఆ ఏడాది 8.52 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే 1.18 లక్షలమంది రైతులే లబ్ధిపొందారు. 2014–15 వ్యవసాయ సీజన్లో 10 లక్షలమంది రైతులు రూ.145.97 కోట్లు ప్రీమియం చెల్లిస్తే, 1.80 లక్షలమంది రైతులు రూ. 78.86 కోట్ల పరిహారం మాత్రమే అందుకున్నారు. 2015–16 లో 7.73 లక్షలమంది రైతులు రూ.145.71 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, రూ.441.79 కోట్లు పరిహారంగా వచ్చిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 2016–17 లో 9.75 లక్షలమంది రైతులు రూ. 294.29 కోట్లు చెల్లిస్తే, 2.35 లక్షలమంది రైతులకు రూ. 178.49 కోట్లు పరిహారం గా దక్కాయి. కంపెనీలు మాత్రం నానా కొర్రీలు పెడుతూ పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నాయి. 2014–15 వ్యవసాయ సీజన్లో 10 లక్షలమంది రైతులు రూ. 145.97 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, 1.80 లక్షల మంది రైతులకు రూ.78.86 కోట్ల పరిహారం అందింది. -
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో..
సాక్షి, రాజన్న సిరిసిల్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవాం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకం కింద సిరిసిల్ల జిల్లాలో రూ. 100 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే యాసంగికి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి రైతులకు రూ. 5లక్షల భీమా పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
ఇన్వెస్టర్లు యులిప్‌ల బాట పట్టొచ్చు
ముంబై: ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) వేయడంతో బీమా పథకాలు, ముఖ్యంగా యూనిట్ ఆధారిత బీమా పథకాల(యులిప్)కు ఆకర్షణ పెరుగుతుందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బడ్జెట్లో ఎల్‌టీసీజీని తిరిగి ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1న ప్రకటించిన వెంటనే మార్కెట్లు భారీగా పతనమై కోలుకోగా, మరుసటి రోజు మళ్లీ భారీ క్షీణత(2.3 శాతం)ను నమోదు చేసిన విషయం విదితమే. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఒక ఏడాదిలో దీర్ఘకాలిక లాభం రూ.లక్ష మించితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ చేసే డివిడెండ్లపైనా కేంద్రం 10 శాతం పన్ను విధించింది. ‘‘తాజా ప్రతిపాదన నేపథ్యంలో జీవిత బీమా పాలసీలు ముఖ్యంగా యులిప్‌లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నాం’’అని మోర్గాన్‌స్టాన్లీ తన వారంతపు నివేదికలో వివరించింది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం జీవిత బీమా పథకాల నుంచి అందే ఆదాయంపై పన్ను లేదన్న విషయాన్ని నివేదికలో గుర్తు చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం చూస్తున్నామని, ప్రస్తుత వివరాలు కచ్చితమే అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటి ప్రైవేటు కంపెనీలకు లాభం కలుగుతుందని పేర్కొంది. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీతోపాటు డివిడెండ్ పంపిణీపైనా పన్ను వేయడం ఈ రంగంలోకి పెట్టుబడుల రాకకు కొంత మేర అడ్డంకి కాగలదని నిపుణులు సైతం భావిస్తున్నారు. -
నిరుపేదలకు బీమా ధీమా..
రామచంద్రపురం : కుటుంబ యజమాని ఆకస్మికంగా మృతి చెందితే ఆ కుటుంబంలోనివారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు వివిధ బీమా పథకాలు అమలవుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. ఆమ్ ఆద్మీ బీమా యోజన అర్హతలు : గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన యజమాని మాత్రమే ఈ పథకానికి అర్హుడు. వయస్సు 18 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రయోజనాలు : సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకూ, ఐటీఐ చదువుతున్నవారికి నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం ఇస్తారు. ప్రీమియం : ఈ పథకంలో చేరినవారు ఏడాదికి రూ.320 ప్రీమియం చెల్లించాలి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.160 చెల్లిస్తాయి. పాలసీదారుడు రూ.15 సేవా రుసుము చెల్లిస్తే చాలు. అన్న అభయహస్తం అరవయ్యేళ్లు నిండిన తరువాత బ్యాంకు రుణం పొందే అర్హత కోల్పోయి, సంఘంలో సభ్యత్వ విరమణ పొంది సంపాదించే శక్తి లేని కుటుంబానికి భరోసా ఇచ్చే పథకం ఇది. దీనిని 2009 నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్న అభయహస్తంగా పేరు మార్చారు. 2009-10 నుంచి అభయహస్తం పథకంలో నమోదైన స్వయంసహాయ సంఘాల్లో అర్హులైన మహిళలకు జనశ్రీ బీమా యోజన(జేబీవై)లో ప్రయోజనం కల్పిస్తారు. అర్హతలు : సంఘ సభ్యురాలై ఉండాలి. బియ్యం కార్డు ఉండి 18-59 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నారు అర్హులు. ప్రయోజనాలు : 60 సంవత్సరాలు పైబడినవారికి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,200 వరకూ పింఛను మంజూరు చేస్తారు. సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణం సంభవిస్తే రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు ఇస్తారు. ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న వారికి నెలకు రూ.100 చొప్పున ఉపకార వేతనం ప్రతి ఆరు నెలలకు అందిస్తారు. ప్రీమియం : నమోదైన ప్రతి సభ్యురాలు సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా సభ్యురాలి ఖాతాకు జమ చేస్తుంది. ఈ రెండు మొత్తాలను సభ్యురాలి పింఛను ఖాతాకు జమ చేస్తారు. సభ్యురాలు ఏటా రూ.20 సేవా రుసుముగా చెల్లించాలి. జనశ్రీ బీమా యోజన మహిళా స్వయంసహాయ సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ సభ్యుల భర్తలకు జనశ్రీ బీమా యోజన అమలు చేస్తున్నారు. అర్హతలు : 18 నుంచి 58 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రయోజనాలు : సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500, పూర్తి అంగవైకల్యానికి రూ.75 వేలు చెల్లిస్తారు. ప్రీమియం : పాలసీదారు రూ.150 ప్రీమియం, రూ.15 సేవా రుసుము చెల్లించాలి. -
పింఛను కావాలా..?
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే... పింఛనుతో కూడిన భరోసా! ఈ పెన్షన్ ఉంటుందనే ప్రభుత్వోద్యోగం కోసం ఏళ్లపాటు ఎడతెగని ప్రయత్నాలు చేసేవారు. మరిప్పుడు..? ఉద్యోగస్తులు మాత్రమే కాదు. ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు. అది కూడా 58 ఏళ్లో, 60 ఏళ్లో దాటాక... అదికూడా రిటైరయ్యాక మాత్రమే కాదు. 45 ఏళ్లు దాటాక కూడా కావాలంటే పెన్షన్ తీసుకోవటానికి కొన్ని పథకాలున్నాయి. కాస్త ప్లానింగ్ ఉండి.. మొదటి నుంచీ పొదుపు పాటిస్తే... రిటైర్మెంట్ వయసు దాటాక జీతం కన్నా ఎక్కువ పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అందుకు ఏఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి? వాటి నిబంధనలేంటి? రాబడులెలా ఉంటాయి? అనే వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... ఈపీఎఫ్, పీపీఎఫ్‌లతో పాటు పలు మార్గాలు ♦ పన్ను మినహాయింపులతో ఆకర్షణీయంగా ఎన్పీఎస్ ♦ బీమా పథకాలు, మ్యూచ్‌వల్ ఫండ్స్తోనూ పెన్షన్ ♦ మునుపటిలానే ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపులు పెన్షన్ కోసం దేశంలో అందుబాటులో చాలా పథకాలున్నప్పటికీ...90 శాతం మందికి పైగా ఎంచుకుంటున్నవి మాత్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లే. ఇవికాక బీమా పథకాలు, మ్యూచువల్ పెన్షన్ ఫండ్స్ కూడా పెన్షన్ అందిస్తుంటాయి. కానీ వీటిలో పెట్టుబడి పెట్టడానికి, వీటిపై వచ్చే రాబడులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కొన్ని పథకాల్లో వెనక్కి తీసుకునే మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తే, కొన్ని పథకాలు పన్ను లేని ఆదాయాన్నిస్తాయి. ⇒ ఈపీఎఫ్, పీపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై ఎలాంటి పన్నూ లేదు. ⇒ బీమా పింఛను పథకాల నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ⇒ ఎన్పీఎస్ నుంచి తీసుకునే మొత్తంపై మొన్నటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈపీఎఫ్‌పై అసలు పన్ను లేకపోవడం, ఎన్పీఎస్కు పూర్తిగా పన్ను చెల్లించాల్సి రావటంతో... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్నటి బడ్జెట్లో ఎన్పీఎస్ నుంచి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మరోవంక ఈపీఎఫ్‌కు కూడా మొత్తానికి మినహాయింపును తీసేసి 40%కే మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈపీఎఫ్‌లో పాత నిబంధనలే.. ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ అంటే తెలుసు. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ విధిగా పీఎఫ్ పథకాన్ని అమలు చేయాలి. దీని ప్రకారం జీతంలో ( బేసిక్ శాలరీ + డీఏ) 12 శాతాన్ని ఉద్యోగి చెల్లిస్తే... మరో 12 శాతాన్ని సంస్థ జమచేయాలి. సంస్థ జమచేసే మొత్తంలో 8.3 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలోకి వెళుతుంది. మిగిలిన మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. అయితే 2014 వరకూ పీఎఫ్ ఖాతాలో చేరడానికి గరిష్ఠ జీతం పరిమితి రూ.6,500గా ఉండేది. దీనికన్నా జీతం ఎక్కువ ఉన్నా సరే... చట్టప్రకారం ఈ మొత్తంలో 12 శాతాన్ని (అంటే రూ.780) పీఎఫ్ ఖాతాకు జమ చేస్తే చాలు. కాకపోతే 2014 సెప్టెంబర్‌లో ఈ పరిమితిని రూ.15,000కు పెంచారు. దీన్లో 12 శాతం... అంటే రూ.1,800 కనీసం జమ చేయాలి. ఇంకా ఎక్కువ జీతం ఉన్న పక్షంలో... ఉద్యోగి, సంస్థ ఇష్టపూర్వకంగా మరింత మొత్తాన్ని కూడా ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయొచ్చు. ఇలా కేటాయించిన అదనపు మొత్తంపై కూడా ఇదే వడ్డీ రేటు, పన్ను రాయితీలు లభిస్తాయి. దీన్లో వలంటరీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అయితే వరసగా ఐదేళ్ల పాటు పనిచేసిన వారికి మాత్రమే పెన్షన్ లభిస్తుంది. ⇒ పీఎఫ్‌లో ప్రస్తుతం నెలకు జమ చేయాల్సిన కనీస మొత్తం రూ.1800 + 1800 ⇒ 2015-16 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీని ఇస్తున్నారు. ⇒ ఈపీఎఫ్‌కు జమచేసే మొత్తానికి కూడా ఏటా పన్ను మినహాయింపు ఉంటుంది. ⇒ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈపీఎఫ్ నుంచి... అత్యవసర సందర్భాల్లో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, రుణం చెల్లింపులు, ఇంటి రిపేర్లకు, పిల్లల చదువు, పెళ్ళి, వైద్య ఖర్చులు, ప్రకృతివైపరీత్యాల వలన నష్టాలు సంభవించినప్పుడు... నిబంధనలు అనుసరించి ఈపీఎఫ్ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఇలా వెనక్కి తీసుకునే మొత్తంపై ఇకపై కూడా మునుపటిలానే పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్ ద్వారా వచ్చే నెలవారీ పింఛను చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్‌లో జమ చేసిన నిధితో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేసి... మరింత పెన్షన్ పొందవచ్చు. అందరికీ అందుబాటులో... పీపీఎఫ్ ⇒ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్... ఉద్యోగస్తులే కాక ఎవరైనా పీపీఎఫ్‌లో ఖాతా తెరవవచ్చు. ⇒ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కాలపరిమితి 15 ఏళ్లు. ⇒ పెట్టుబడిపై ఏటా పన్ను మినహాయింపులుంటాయి; మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ఫ్రీనే. ⇒ పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ⇒ పిల్లల పేరిట కూడా ఖాతా తెరవొచ్చు. 15 ఏళ్లు దాటాక మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు కూడా. ⇒ ఏడేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుంచి వెనక్కి తీసుకోలేము. ⇒ ఏడేళ్ళ తర్వాత ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. ప్రసుత్త వడ్డీ 8.7 శాతం. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకమే కాని పెన్షన్ అందించేది కాదు. పీపీఎఫ్ అకౌంట్ కాలపరిమితి తర్వాత వచ్చే మెచ్యూర్టీ మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. మరింత ఆకర్షణీయంగా ఎన్పీఎస్ సామాజిక భద్రతలో భాగంగా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 2004లో న్యూ పెన్షన్ సిస్టమ్‌ను (ఎన్పీఎస్) ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. గతేడాది బడ్జెట్లో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద అదనంగా రూ.50,000 పన్ను రాయితీనిచ్చారు. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను మినహాయింపులకు అదనం. ఇప్పటిదాకా ఈ పథకం నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై వారి వ్యక్తిగత ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వచ్చేది. వచ్చే ఏడాది నుంచి ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతం వరకు ఎలాంటి పన్ను ఉండదని తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ⇒ 18-55 సంవత్సరాల మధ్య ఈ పథకంలో చేరవచ్చు. ⇒ ఇది కూడా ఫండ్ పథకాల మాదిరే పనిచేస్తుంది. ⇒ దీనికి జమయ్యే మొత్తాన్ని ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ⇒ ఎన్పీఎస్ ఫండ్స్‌ను ఎస్బీఐ, ఐసీఐసీఐ, యూటీఐ, రిలయన్స్, ఐడీఎఫ్సీ, కోటక్ మహీంద్రాలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఈ ఫండ్స్ మూడు రకాలు. అధిక రిస్క్ ఉండే ఈక్విటీ ఫండ్‌లో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ⇒ రిస్క్ సామర్థ్యం ఆధారంగా నచ్చిన ఫండ్ మేనేజర్‌ను, ఫండ్‌ను మీరే ఎంచుకోవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.6,000. దీన్ని నాలుగు దఫాల్లో చెల్లించవచ్చు. కనీస వాయిదా రూ.500. ⇒ ఇందులో టైర్-1, టైర్-2 ఖాతాలుంటాయి. టైర్-1లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని 60 ఏళ్లు దాటాకే తీసుకోవాలి. ⇒ 60 ఏళ్ల తరవాత వచ్చే మొత్తంలో కనీసం 80% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ⇒ టైర్-2లో అవసరమైనప్పుడు కనీసం 2వేలు ఉంచి మిగిలిన మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. ⇒ ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు, 60 ఏళ్లు దాటాక పెన్షన్ పొందవచ్చు. బీమాతోనూ పింఛన్ పొందొచ్చు.. బీమా కంపెనీలు అందిస్తున్న పెన్షన్ పథకాల్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. మొదటివి సాంప్రదాయ పెన్షన్ పథకాలు; రెండో రకం యూనిట్ ఆథారిత బీమా పథకాలు. సాంప్రదాయ పెన్షన్ పథకాలు స్థిరమైన రాబడినిస్తాయి. అదే యులిప్స్ పథకాల రాబడులైతే స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. ⇒ ఈ 2 పథకాల్లోనూ పాలసీ వ్యవధి మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. ⇒ రిటైరయ్యాక ఎంచుకున్న కాలానికి పెన్షన్‌ను అందిస్తాయి. ⇒ మెచ్యూరిటీ మొత్తంలో గరిష్టంగా 25-33% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. ⇒ 33% వరకూ పన్నుండదు. ⇒ మిగిలినదాంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. ⇒ మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటిలో మోర్టాలిటీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు తక్కువ. ⇒ చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటితే యాన్యుటీ ప్లాన్‌కు అనుమతిస్తున్నాయి. అంటే 45 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చన్న మాట. ⇒ పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ⇒ పెన్షన్‌గా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మిగిలిన పథకాలతో పోలిస్తే బీమా పెన్షన్ పథకాల రాబడి చాలా తక్కువ. కేవలం 6-7 శాతం రాబడులు మాత్రమే అందిస్తాయి. బీమా రక్షణతో పాటు పెన్షన్ కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు. యాన్యుటీ అంటే... పైన పేర్కొన్నవన్నీ పెన్షన్ పథకాలే. కానీ ఇవి నిజంగా పెన్షన్ ఇవ్వవు. పింఛన్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి పనికొస్తాయి. ఇలా సమకూర్చుకున్న నిధిని యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా పింఛను పొందొచ్చు. పెన్షన్ పథకం తీసుకున్న దగ్గరే యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాలన్న నిబంధనేమీ లేదు. పెన్షన్ పాలసీ గడువు ముగిశాక మీకు నచ్చిన కంపెనీకి చెందిన యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. చేతికి ఎంత పెన్షన్ వస్తుందనే విషయం మీరు ఎంత కాలానికి పెన్షన్ కావాలనుకుంటున్నారు? మీ తదనంతరం మీపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్ కావాలనుకుంటున్నారా? అన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయ్... ⇒ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే కేవలం నాలుగు పెన్షన్ ఫండ్లే అందుబాటులో ఉన్నాయి. ⇒ పదేళ్లుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. ⇒ ఈ మధ్య రిలయన్స్ సంస్థ రిటైర్మెంట్ ఫండ్‌ను, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టాయి. ⇒ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫండ్ విభాగంలోకి వస్తాయి. ఈక్విటీల్లో 40 శాతం, డెట్ పథకాల్లో 60 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ⇒ ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి. ⇒ వీటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. ⇒ వీటి లాకిన్ పిరియడ్ మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది. గడిచిన పదేళ్లలో ఈ ఫండ్స్ 9 నుంచి 10 శాతం వార్షిక సగటు రాబడుల్ని అందించాయి. ఎన్‌పీఎస్‌తో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చులు ఎక్కువ. ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. కానీ వీటి నుంచి వెనక్కి తీసుకున్న మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనాలన్న నిబంధన ఏమీ లేదు. అలాగే ఇవి అందించే రాబడులపై ఎటువంటి పన్ను భారం ఉండదు. -
బీమా.. ధీమా!
చివరగా కీలకమైన మరో అంశం...! అనుకోని సంఘటన జరిగి పిల్లలు ఒంటరి అయినా మీ ఆశయం నెరవేరాలి. ఈ విషయంలోనే ఇతర సేవింగ్ పథకాలతో పోలిస్తే పిల్లల చదువుకు బీమా పథకాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. తద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కుటుంబసభ్యులు మీ ఆశయాన్ని సులభంగా చేరుకోగలరు. -
మీది అక్కరకొచ్చే పాలసీయేనా?
- బీమా పథకాలతో జాగ్రత్త - చాలా అంశాలు చూశాకే - పాలసీ తీసుకోవాలి మనలో చాలామంది పక్కవాళ్ళు తీసుకున్నారని అవసరం లేని బీమా పథకాలు తీసుకొని చేతులు కాల్చుకుంటారు. 2007-08లో స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు యులిప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్లు భారీగా పడిపోయాక వాటిని సరెండర్ చేసి భారీ నష్టాలను మూటకట్టుకున్న సంఘటనలు ఇంకా మనకళ్ళెదుట కదులుతూనే ఉన్నాయి. అలాగే ఎంత బీమా రక్షణ ఉండాలన్న దానిపై కూడా సరైన అవగాహన ఉండదు. బీమా పాలసీ తీసుకునేముందు వీటిపై సరైన స్పష్టత లేకపోతే అవి అక్కరకు రాని పథకాలుగానే మిగిలిపోతాయి. రక్షణా?.. ఇన్వెస్ట్‌మెంటా? ఏ అవసరం కోసం బీమా పాలసీని తీసుకుంటున్నారన్న దానిపై ముందుగా ఒక స్పష్టత ఉండాలి. మరణానంతరం కుటుంబానికి ఆర్థిక రక్షణ కావాలనుకునే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అనువైనవి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కేవలం క్లెయిమ్‌లే ఉంటాయి. మెచ్యూరిటీ అనేది ఉండదు. దీంతో ఈ పాలసీల ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందవచ్చు. సాధారణంగా మీ వార్షిక ఆదాయానికి 8-10 రెట్లు అధిక మొత్తానికి బీమా రక్షణ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా బీమా పథకాలను ఎంచుకుంటే సంప్రదాయ ఎండోమెంట్, యులిప్ పథకాలకేసి చూడవచ్చు. గ్యారంటీ ఉండదు ఇన్వెస్ట్మెంట్ కోసం యులిప్స్ ఎంచుకునే వారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. 2010లో నిబంధనలు మార్చాక యులిప్స్‌లో చార్జీలు తగ్గి ఆకర్షణీయంగా మారాయి. ఇదే సమయంలో లాకిన్ ిపీరియడ్ను మూడు నుంచి ఐదేళ్లకు పెంచారు. అంటే స్వల్ప కాలిక అవసరాలకు ఈ పథకం సరిపోదు అన్న విషయం గుర్తు పెట్టుకోండి. వీటిని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకోసం ఉపయోగించుకోవచ్చు. యులిప్స్‌లో నిర్వహణ వ్యయం తక్కువే అయినప్పటికీ వీటి రాబడిపై ఎటుంటి హామీ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా వీటి రాబడిలో కూడా మార్పు ఉంటుంది. అందుకనే తక్కువ రిస్క్ సామర్థ్యం ఉండి, ఒడిదుడుకులను తట్టుకోలేని వారు యులిప్స్కి దూరంగా ఉండండి. కొనసాగించగలరా?.. బీమా అనేది దీర్ఘకాలిక ఒప్పందం. ఒకేసారి ప్రీమియం కట్టేస్తే సరిపోదు. పాలసీ కాలపరిమితి మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పాలసీ తీసుకునే ముందే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులెదురైనా ప్రీమియం కట్టగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్నది ముందే పరిశీలించుకోవాలి. మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంత మొత్తానికి పాల సీ తీసుకోవాలి? ప్రీమియం ఎన్ని విడతలుగా చెల్లించాలి? అన్న విషయాలపై ముందుగానే అవగాహనకు రండి. చెక్ చేసుకోండి.. అన్ని వేళలా ఏజెంట్లు చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి చూసుకోండి. కొంతమంది ఏజెంట్లు కమీషన్ల కోసం మీ లక్ష్యాలకు సరిపోని పాలసీలను అంటగట్టే ప్రమాదం ఉంది. అందుకనే పాలసీ తీసుకునే ముందు ఒకసారి డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత... అది మీ ఆర్థిక అవసరాలకు సరిపోతుందన్న నమ్మకం ఏర్పడిన తర్వాతనే తీసుకోండి. -
కుటుంబానికి ధీమా.. జీవిత బీమా
జీవిత బీమా పాలసీలను ఇతర ఆర్థిక సాధనాలతో పోలుస్తూ తరచుగా పేపర్లలోనూ, మ్యాగజైన్లలోనూ మనకు కథనాలు కనిపిస్తుంటాయి. బీమా పాలసీ తీసుకునేందుకు పెట్టే పెట్టుబడిపై ఎంత వస్తుంది, అదే ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందీ లాంటి అంశాలను కూడా కొన్ని కథనాల్లో విశ్లేషిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో బీమా పాలసీల ప్రధానోద్దేశాన్ని విస్మరిస్తుంటారు. పాలసీదారు ఉన్నా లేకపోయినా.. వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా భరోసా కల్పించేది బీమా పాలసీ అన్నది తెలుసుకోరు. మనం ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు పడకూడదని మనం జీవితాంతం శ్రమిస్తుంటాం. మనం ఉన్నా లేకున్నా వారు ఇబ్బందిపడకుండా సాధ్యమైనంత నిధిని వారికి అందించాలని తాపత్రయపడతాం. కనుక, పాలసీదారు లేకపోయినా.. రుణ బకాయిలు మొదలుకుని ఇతరత్రా వ్యయాల దాకా ఏదీ కూడా భారం కాకుండా కుటుంబసభ్యులను ఆదుకోగలిగే శక్తిమంతమైన సాధనాలు జీవిత బీమా పాలసీలు. కనుక, వీటిపై ఇన్వెస్ట్ చేసే ప్రతి పైసా ఎంతో ఉపయోగకరమైనదే. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే జీవిత బీమా పాలసీలకోసం వెచ్చించేది కచ్చితంగా వివేకవంతమైన పెట్టుబడే. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే బీమా పాలసీల ప్రీమియంలు ప్రస్తుతం గణనీయంగా తగ్గాయి. అందుబాటు ప్రీమియంలతో పాలసీలు లభిస్తున్నాయి. సంప్రదాయ బీమా పథకాలు మరింత అధిక డెత్ కవరేజీ ఇచ్చేలా ఈ మధ్యే నిబంధనలు కూడా మారాయి. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా సరైన పథకాన్ని ఎంచుకోగలిగితే నిశ్చింతగా రిటైర్ అయ్యేందుకు, కుటుంబానికి ఆర్థికపరమైన భరోసానిచ్చేందుకు బీమా పాలసీలు తోడ్పడగలవు. అదనపు ధీమా కోసం వివిధ రకాల రైడర్లు కూడా కావాలంటే వీటికి జతగా తీసుకోవచ్చు. -
భవితకు చక్కని ప్లానింగ్..
పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రతి తల్లిదండ్రుల ముందుండే అతిపెద్ద లక్ష్యం. చక్కగా ప్రణాళికాబద్ధంగా వెళితే ఇలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. పిల్లల ఆర్థిక ప్రణాళిక కోసం తల్లిదండ్రులు అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ... పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి బంగారు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. వారిని జీవితంలో ఉన్నత శిఖరాల్లో నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. పిల్లల్లో ఉంటే సృజనాత్మక శక్తిని గ్రహించి వారిని ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి శిల్పిలాగా కృషి చేస్తారంటే అతిశయోక్తి కాదేమో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వారి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. దీనికి అనుగుణంగానే ఆర్థిక ప్రణాళికలను కూడా రచించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్న వారు వారి ఫ్యామిలీ బడ్జెట్లో చిన్నారుల కోసం ప్రతీ నెలా కొంత కేటాయించే విధంగా చూసుకోవాలి. చదువు, విదేశాల్లో ఉన్నత విద్య, పెళ్ళి వంటి ప్రధాన అవసరాలే కాకుండా వ్యాపారం ప్రారంభించడానికి కొంత మూల ధనం సమకూర్చడం తదితర అనేక అవసరాలు ఉంటాయి. వీటన్నింటికీ నగదు భారీగానే అవసరం అవుతుంది. ఈ కలల లక్ష్యాలను చేరుకోవడానికి బీమా కంపెనీలు వివిధ పథకాలను అందిస్తున్నాయి. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే... పిల్లల లక్ష్యాలు ఆగకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి బీమా పథకాలు అక్కరకు వస్తాయి. కాబట్టి పిల్లల కోసం చేసుకునే ప్లానింగ్‌లో బీమా తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు కోసం నిర్దేశించిన బీమా పథకాలు దీర్ఘకాలానికి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి వీటిల్లో క్రమం తప్పకుండా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. పెరుగుతున్న విద్యావ్యయం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు ఈ బీమా పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. పిల్లల కోసం బీమా పథకాలను తీసుకునేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి... పిల్లల కోసం చేసే ఆర్థిక ప్రణాళికల్లో జాప్యం వద్దు. ఎంత తొందరగా మొదలు పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. చాలా బీమా పథకాల్లో మెచ్యూర్టీ లేదా క్రమానుగత చెల్లింపులు పిల్లల వయసు 18 ఏళ్ళు రాగానే మొదలవుతాయి. కాబట్టి ఈ దీర్ఘకాలిక పథకాలను ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఒకవేళ ఏ పథకం తీసుకోవాలో అర్థం కాకపోతే గుర్తింపు పొందిన ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదించి మీ అవసరాలకు అనువైన పథకాన్ని ఎంచుకోండి. ప్రధాన పాలసీకి అనుబంధంగా ప్రీమియం వైవర్ అనే రైడర్‌ను అందిస్తుంటాయి. పిల్లల పథకాలతో పాటు తప్పకుండా తీసుకోవాల్సిన రైడర్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రీమియం చెల్లించే పాలసీదారుడు మరణిస్తే... భవిష్యత్తు ప్రీమియంలు కట్టనవసరం లేకుండా పాలసీ కొనసాగడానికి ఈ రైడర్ దోహదం చేస్తుంది. అంటే పాలసీదారుడు మరణించినా... ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్థిక భారం లేకుండానే లక్ష్యాలను చేరుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు అధిక లాభాలను ఇచ్చే శక్తి ఉండటంతో యులిప్స్ పథకాలను తీసుకోవచ్చు. అత్యధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే గ్రోత్ ఫండ్‌ను ఎంచుకొని లక్ష్యాన్ని చేరుతున్నప్పుడు వచ్చిన లాభాలను కాపాడుకోవడానికి ఈ మొత్తాన్ని క్రమానుగతంగా డెట్ పథకాల్లోకి మార్చుకోండి. లేకపోతే అటు వృద్ధికి అవకాశం ఉంటూ, ఇటు అసలుకు ఢోకా లేకుండా ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పథకాలను ఎంచుకోండి. వీటితో పాటు ప్రీమియం చెల్లించే వ్యక్తికి తగినంత బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. పన్ను ప్రయోజనాలపరంగా చూసినా బీమా పథకాలు రెండిందాల ప్రయోజనాన్ని కలిగిస్తాయి. చెల్లిస్తున్న ప్రీమియంపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనంతోపాటు, సెక్షన్ 10 (10డీ) ప్రకారం మెచ్యూర్టీ ద్వారా అందుకునే మొత్తాన్ని కూడా పన్ను భారం లేని ఆదాయంగా పరిగణిస్తారు. పాలసీ తీసుకునే ముందు అందులో పొందుపర్చిన నిబంధనలు, ఆ పథకం మీ అవసరాలకు తగినట్లుగా ఉందా లేదా అన్న విషయాలను ఒకసారి పరిశీలించాలి. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బీమా పథకాలతో పోల్చి చూసి మేలైనదాన్ని ఎంచుకోండి. -
రక్షణా...రాబడా?
పసిపాప దగ్గర్నుంచి పదవీ విరమణ చేసే వ్యక్తుల వరకు అనేక రకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందుబాటులో ఉన్న వివిధ బీమా పథకాలు, అవి అందించే ప్రయోజనాలు, ఎవరికి అనువుగా ఉంటాయన్న విషయాలపై అవగాహన పెంచేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. బీమా పాలసీలపై నిపుణుల అభిప్రాయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఆపద సమయంలో ఆర్థికంగా తోడ్పాటునిచ్చే సాధనంగానే బీమాను చూడాలన్నది కొందరి వాదన. బీమా అంటే బహుళ ప్రయోజనకరమైన ఇన్వెస్ట్మెంట్ సాధనమని, ఆర్థిక రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చని మరి కొందరు అంటారు. ఒక విధంగా చూస్తే ఈ రెండు వాదనలూ సబబే. అందుకే బీమా కంపెనీలు కూడా ఇరు వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా పథకాలను విడుదల చేస్తున్నాయి. అందించే ప్రయోజనాలను బట్టి బీమా పథకాలను ఏడు రకాలుగా విభజించొచ్చు. ఇప్పుడు వీటి గురించి విడివిడిగా తెలుసుకుందాం. ఎండోమెంట్ ప్లాన్ బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎండోమెంట్ పథకాలు అనువుగా ఉంటాయి. పిల్లల చదువు, పెళ్లి, సొంతింటి నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను ఎండోమెంట్ పథకాల ద్వారా చేరుకోవచ్చు. ఈ పథకాలు నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిసిన తర్వాత మెచ్యూర్టీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటి రాబడి తక్కువగానే ఉంటుంది. ఎండోమెంట్ పాలసీల వార్షిక సగటు రాబడి 5-6 శాతంగా ఉంది. వీటిపై ఉండే పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రాబడి 10 శాతం దాటుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. కట్టిన ప్రీమియంపై పన్ను ప్రయోజనాలతో పాటు, మోచ్యూర్టీ కింద వచ్చే లాభంపై కూడా ఎటువంటి పన్ను ఉండదని, అదే బ్యాంకు డిపాజిట్లలో అయితే వడ్డీపై ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. సాధారణంగా ఎండోమెంట్ పాలసీలు 10, 15, 20, 30 ఏళ్ళ కాలపరిమితుల్లో లభిస్తుంటాయి. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయంతో పాటు బీమా రక్షణ కావాలనుకునే వారికి ఎండోమెంట్ పాలసీలు అనువుగా ఉంటాయి. మనీ బ్యాక్ ప్లాన్ ఇవి ఎండోమెంట్ పాలసీ లక్షణాలనే కలిగి ఉన్నప్పటికీ వీటి పేరులో ఉన్నట్లుగానే మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇస్తుంటాయి. ప్రతీ మూడేళ్లకు ఒకసారి లేదా ఐదేళ్లకు ఒకసారి చొప్పున ఇలా నగదును వెనక్కి ఇస్తుంటాయి. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి మధ్యమధ్యలో నగదు కావాలనుకునే వారికి మనీ బ్యాక్ పథకాలు అనువుగా ఉంటాయి. మధ్యమధ్యలో కొంత మొత్తం చొప్పున ముందే నగదు తీసుకుంటారు కాబట్టి ఈ మేరకు మెచ్యూర్టీ సమయంలో అందుకునే మొత్తం తగ్గుతుంది. అంతే కాకుండా సాధారణ ఎండోమెంట్ పాలసీల కంటే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనీ బ్యాక్ పాలసీలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణుల సూచన. హోల్‌లైఫ్ పాలసీలు ఇప్పుడు అనేక బీమా కంపెనీలు హోల్‌లైఫ్ పేరిట జీవిత కాలం లేదా 100 ఏళ్ళ వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవితకాలం బీమా రక్షణ లభిస్తుంది. వీటిని చిన్న వయస్సులోనే తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే జీవిత కాలం బీమా రక్షణ పొందవచ్చు. యులిప్స్... రిస్క్ చేయగల సామర్థ్యం ఉండి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడికై స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్) రూపొందించారు. వీటి పనితీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. యులిప్స్‌లో బీమా రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు అదనం. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు. అందువల్ల వీటి రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు. ఐదేళ్ల లాకిన్ పిరియడ్ అయిపోయిన వెంటనే వైదొలగకుండా కనీసం 10 ఏళ్లైనా వేచి చూస్తేనే యులిప్స్ ప్రయోజనాలను పొందగలం అంటున్నారు బీమా నిపుణులు. యులిప్స్‌లో ఉండే అధిక చార్జీలను ఐఆర్డీఏ తగ్గించడంతో ఇప్పుడివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను అందించడంలో ఈక్విటీలు ముందుంటాయి కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు యులిప్‌లు అనువుగా ఉంటాయి. పెన్షన్ ప్లాన్స్ పదవీ విరమణ తర్వాత పెన్షన్ కావాలనుకునే వారు ఈ రిటైర్మెంట్ పథకాలను ఆశ్రయించాలి. రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఎండోమెంట్, యులిప్స్‌లో ఒక పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు సాధారణంగా అన్ని బీమా పథకాలు 55 నుంచి 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. ఈ విధంగా సమకూరిన మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతీ నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ పొందచ్చు. సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్కు కేటాయించడం మొదలు పెడితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. హెల్త్ పాలసీలు ఇప్పుడు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేం కాబట్టి అందరూ వైద్య బీమా తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌కు కూడా టర్మ్ పాలసీల మాదిరిగా క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీ ఉండదు. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
పొదుపు ఇంట.. కొత్త జంట
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి... పొదుపు, పెట్టుబడులు గురించి భార్యాభర్తలిద్దరూ కలిసి చర్చించుకోవడమే కాదు, వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల దగ్గరి నుంచి, పొదుపు పథకాల వివరాలు, బీమా పథకాలు, బ్రోకరేజ్ అకౌంట్స్, ఇతర పెట్టుబడి సాధనాల వివరాలన్నీ ఇద్దరికీ తెలిసి ఉండాలి. వీటన్నిటికంటే ముందు పొదుపు ఎలా చేయాలి? దీనికి అనుసరించాల్సిన మార్గంపై ఇద్దరూ చర్చించుకొని, ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. లక్ష్యం ఉండాలి సొంతిల్లు కట్టుకోవాలనో, కారు కొనుక్కోవాలనో... ఇలా అనేక లక్ష్యాలుంటాయి. వీటిలో కొన్ని తొందరగా చేరుకునేవి ఉంటే మరికొన్ని దీర్ఘకాలానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే నవ దంపతులు ముందుగా చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏంటి? వాటిని ఎలా చేరుకోవాలన్నదానిపై ఉమ్మడిగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇద్దరి అలవాట్లు, వాటికి కేటాయించే మొత్తం, ఇంటి అవసరాలకు అయ్యే వ్యయాలు వంటివి పోను లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత మొత్తం కేటాయిస్తారన్న దానిపై ముందుగా లెక్క తయారు చేసుకోవాలి. ఇందులో ఉన్న ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికప్పుడు ఇద్దరూ సంప్రతించుకోవాలి. క్రమం తప్పకుండా.. ఒక్కసారి మీ ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత వస్తే వాటికి ఎంత మొత్తం కేటాయించాలన్నది సులభంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలి. ప్రతి నెలా బిల్లులు ఎలా చెల్లిస్తామో అదే విధం గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. పొదుపును ఆలస్యంగా మొదలు పెడితే ఇవే లక్ష్యాల కోసం ప్రతినెలా పెద్ద మొత్తం కేటాయించాల్సి వస్తుంది. ప్రారంభంలోనే మొదలు పెడితే చిన్న మొత్తాలతోనే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. రుణాలకు దూరంగా... సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి. ఇప్పటికే ఏమైనా రుణాలుంటే, ఉమ్మడి నిధిని నుంచి వాటిని తీర్చేసే అవకాశాలుంటే పరిశీలించండి. పెళ్ళి అవసరాల కోసం చేసిన అప్పులను తొందరగా వదిలించుకుంటే పొదుపునకు కేటాయించే మొత్తం పెరుగుతుంది. దీంతో లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. రుణాలను ఎంత తొందరగా తీరిస్తే ఆ మేరకు ఇన్వెస్ట్మెంట్ కేటాయింపులు పెరుగుతాయి. అత్యవసర నిధి: జీవితంలో ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో తెలియదు. ఉద్యోగం పోవడం, ఆరోగ్యం, ఇంటి రిపేర్లు వంటి అనుకోని ఖర్చులు, అవసరాలు వచ్చిపడుతుంటాయి. ఇలా అత్యవసరం వచ్చే వాటికోసం ప్రత్యేకంగా ఒక నిధిని కేటాయించుకోవాలి. మూడు నుంచి ఆరు నెలలకు అవసరమయ్యే ఇంటి ఖర్చులు, బిల్లు అవసరాలకు సరిపోయేలా ఈ అత్యవసర నిధిని సమకూర్చుకుంటే చాలు. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ సాధనం ఎలా ఉండాలంటే డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఉండాలి. రిటైర్మెంట్.. ఆర్థిక లక్ష్యాల్లో అన్నిటికంటే ముఖ్యమైంది రిటైర్మెంట్. దీని కోసం ఎంత త్వరగా పొదుపు మొదలు పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఇలా తొందరగా ప్రారంభించడం వలన పొదుపు చేయడానికి ఎక్కువ కాలం దొరకడమే కాకుండా దానిపై వచ్చే రాబడులు చక్రవడ్డీ రూపంలో మరింత అధిక రాబడినిస్తాయి. మీ నష్టభయం, కాలపరిమితి, లక్ష్యం ఆధారంగా తగిన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. కేవలం రిటైర్మెంట్ కోసం కాకుండా... నవ దంపతులకు తొలిసారి పిల్లలు పుట్టడం, వారికి వేడుకలు నిర్వహించడం వంటి అనేక ఖర్చులుంటాయి. వీటన్నిటికీ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. బీమా మరవొద్దు... ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఒకెత్తు అయితే.. పెళ్లయిన తర్వాత పెరిగే బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా బీమా రక్షణ తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మీరు నిర్మించుకున్న కలల సామ్రాజ్యం కొనసాగించడానికి బీమా అక్కరకు వస్తుంది. సమీక్ష తప్పనిసరి ప్రతీ నెలా చేతికి ఎంతొస్తోంది? ఎంత ఖర్చవుతోంది? అన్న విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అలాగే ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి సాధనాల పనితీరు వాటి రాబడులు ఎలాగున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు కొనసాగిస్తున్న వాటితో లక్ష్యాలను చేరుకోగలమా లేక ఏమైనా మార్పులు చేయాలా అన్నది పరిశీలించండి. ఆర్థిక ప్రణాళిక, లక్ష్యాలను చేరుకోవడంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉంటుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న అవరోధాలను సమష్టిగా ఎదుర్కొంటూ వెళితే.. ఆనందమయమైన జీవితం మీదే అవుతుంది. - ప్రశాంత్ త్రిపాఠి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మ్యాక్స్ లైఫ్ -
గ్రామీణ ప్రాంతాలకూ బీమా పథకాలు విస్తరింపజేయాలి
డెంకణీకోట,(హొసూరు, కెలమంగలం), న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాలకూ బీమా పథకాలు విస్తరింపజేసి, అక్కడి ప్రజలకు బీమా కల్పించాలని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కే.రోశయ్య సూచించారు. యునెటైడ్ ఇండియా ఇన్సురెన్స్, రాశీ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా స్వయం సహాయక గ్రూపులకు ఏర్పాటుచేసిన మదర్ థెరిసా బీమా పథకాన్ని శనివారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆటల మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులైన 10 వేల మంది మహిళలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. బీమా పథకం కార్డులను మహిళలకు గవర్నర్ అందజేశారు.ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి పలు పథకాలు ప్రవేశపెట్టాయని, వీటిని సద్వినియోగం చేసుకు మహిళలు స్వావలంబన సాధించాలని సూచించారు. దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 75 జిల్లాల్లో బీమా పథకం అమలు జరుగుతోందని, ఈ పథకం దేశంలోని ప్రతి ఒక్కరికి వర్తించేలా చూడాలని కోరారు. ఆపదల్లో బీమా ఆదుకుంటుందన్నారు. యూనెటైడ్ ఇన్సురెన్స్ సంస్థలాగా ఇతర బీమా సంస్థలు కూడా ఇలాంటి ఉచిత బీమా పథకాలను ప్రవేశపెడితే అందరికి బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. క్రిష్ణగిరి జిల్లాలో రాశీ గ్రూప్ సంస్థలు 10 వేల మందికి ఉచితంగా బీమా కల్పించడాన్ని గవర్నర్ అభినందించారు. గవర్నర్ రోశయ్య ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ప్రారంభించారు. ప్రజల కోరిక మేరకు తెలుగులో ప్రసంగించారు. మాజీ ఎంపీ. సి.నరసింహన్ స్వాగతోపన్యాసం చేశారు. కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం.హెచ్ అంబరీష్ కన్నడ భాషలో ఉపన్యసించారు. ఎం.మంజునాథ్ తదితరులు గవర్నర్‌ను సన్మానించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా క్రిష్ణగిరి ఎస్పీ సెందిల్‌కుమార్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి గవర్నర్ నేరుగా డెంకణీకోటకు వెళ్లారు. హొసూరులోని హోటల్ రినేజెన్స్లో ప్రముఖులను కలిసే కార్యక్రమం రద్దయింది. డెంకణీకోట, హొసూరు, క్రిష్ణగిరి, బెంగళూరు, సర్జాపురం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ స్వాగతం పలికారు. డెంకణీకోటలో రోశయ్యను కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. గవర్నర్ రాక కోసం పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రజలు వేచి ఉన్నారు.వర్షం జల్లులు పడడంతో కొంత ఇబ్బంది పడ్డారు.