ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి...
పొదుపు, పెట్టుబడులు గురించి భార్యాభర్తలిద్దరూ కలిసి చర్చించుకోవడమే కాదు, వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల దగ్గరి నుంచి, పొదుపు పథకాల వివరాలు, బీమా పథకాలు, బ్రోకరేజ్ అకౌంట్స్, ఇతర పెట్టుబడి సాధనాల వివరాలన్నీ ఇద్దరికీ తెలిసి ఉండాలి. వీటన్నిటికంటే ముందు పొదుపు ఎలా చేయాలి? దీనికి అనుసరించాల్సిన మార్గంపై ఇద్దరూ చర్చించుకొని, ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి.
లక్ష్యం ఉండాలి
సొంతిల్లు కట్టుకోవాలనో, కారు కొనుక్కోవాలనో... ఇలా అనేక లక్ష్యాలుంటాయి. వీటిలో కొన్ని తొందరగా చేరుకునేవి ఉంటే మరికొన్ని దీర్ఘకాలానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే నవ దంపతులు ముందుగా చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏంటి? వాటిని ఎలా చేరుకోవాలన్నదానిపై ఉమ్మడిగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇద్దరి అలవాట్లు, వాటికి కేటాయించే మొత్తం, ఇంటి అవసరాలకు అయ్యే వ్యయాలు వంటివి పోను లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత మొత్తం కేటాయిస్తారన్న దానిపై ముందుగా లెక్క తయారు చేసుకోవాలి. ఇందులో ఉన్న ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికప్పుడు ఇద్దరూ సంప్రతించుకోవాలి.
క్రమం తప్పకుండా..
ఒక్కసారి మీ ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత వస్తే వాటికి ఎంత మొత్తం కేటాయించాలన్నది సులభంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండాలి. ప్రతి నెలా బిల్లులు ఎలా చెల్లిస్తామో అదే విధం గా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయాలి. పొదుపును ఆలస్యంగా మొదలు పెడితే ఇవే లక్ష్యాల కోసం ప్రతినెలా పెద్ద మొత్తం కేటాయించాల్సి వస్తుంది. ప్రారంభంలోనే మొదలు పెడితే చిన్న మొత్తాలతోనే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
రుణాలకు దూరంగా...
సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి. ఇప్పటికే ఏమైనా రుణాలుంటే, ఉమ్మడి నిధిని నుంచి వాటిని తీర్చేసే అవకాశాలుంటే పరిశీలించండి. పెళ్ళి అవసరాల కోసం చేసిన అప్పులను తొందరగా వదిలించుకుంటే పొదుపునకు కేటాయించే మొత్తం పెరుగుతుంది. దీంతో లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. రుణాలను ఎంత తొందరగా తీరిస్తే ఆ మేరకు ఇన్వెస్ట్‌మెంట్ కేటాయింపులు పెరుగుతాయి.
అత్యవసర నిధి: జీవితంలో ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో తెలియదు. ఉద్యోగం పోవడం, ఆరోగ్యం, ఇంటి రిపేర్లు వంటి అనుకోని ఖర్చులు, అవసరాలు వచ్చిపడుతుంటాయి. ఇలా అత్యవసరం వచ్చే వాటికోసం ప్రత్యేకంగా ఒక నిధిని కేటాయించుకోవాలి. మూడు నుంచి ఆరు నెలలకు అవసరమయ్యే ఇంటి ఖర్చులు, బిల్లు అవసరాలకు సరిపోయేలా ఈ అత్యవసర నిధిని సమకూర్చుకుంటే చాలు. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఎలా ఉండాలంటే డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఉండాలి.
రిటైర్మెంట్..
ఆర్థిక లక్ష్యాల్లో అన్నిటికంటే ముఖ్యమైంది రిటైర్మెంట్. దీని కోసం ఎంత త్వరగా పొదుపు మొదలు పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఇలా తొందరగా ప్రారంభించడం వలన పొదుపు చేయడానికి ఎక్కువ కాలం దొరకడమే కాకుండా దానిపై వచ్చే రాబడులు చక్రవడ్డీ రూపంలో మరింత అధిక రాబడినిస్తాయి. మీ నష్టభయం, కాలపరిమితి, లక్ష్యం ఆధారంగా తగిన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. కేవలం రిటైర్మెంట్ కోసం కాకుండా... నవ దంపతులకు తొలిసారి పిల్లలు పుట్టడం, వారికి వేడుకలు నిర్వహించడం వంటి అనేక ఖర్చులుంటాయి. వీటన్నిటికీ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
బీమా మరవొద్దు...
ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఒకెత్తు అయితే.. పెళ్లయిన తర్వాత పెరిగే బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా బీమా రక్షణ తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మీరు నిర్మించుకున్న కలల సామ్రాజ్యం కొనసాగించడానికి బీమా అక్కరకు వస్తుంది.
సమీక్ష తప్పనిసరి
ప్రతీ నెలా చేతికి ఎంతొస్తోంది? ఎంత ఖర్చవుతోంది? అన్న విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అలాగే ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి సాధనాల పనితీరు వాటి రాబడులు ఎలాగున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు కొనసాగిస్తున్న వాటితో లక్ష్యాలను చేరుకోగలమా లేక ఏమైనా మార్పులు చేయాలా అన్నది పరిశీలించండి. ఆర్థిక ప్రణాళిక, లక్ష్యాలను చేరుకోవడంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉంటుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న అవరోధాలను సమష్టిగా ఎదుర్కొంటూ వెళితే.. ఆనందమయమైన జీవితం మీదే అవుతుంది. - ప్రశాంత్ త్రిపాఠి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మ్యాక్స్ లైఫ్
పొదుపు ఇంట.. కొత్త జంట
Published Sun, Jan 12 2014 3:06 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
Advertisement
Advertisement