జొహన్నెస్‌బర్గ్: ఈ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా దయనీయ పరిస్థితిని చూసి జాలిపడని వారు లేరు. ప్రధాన పేసర్లు స్టెయిన్, ఇన్‌గిడి గాయాలతో దూరం కావడం, బ్యాట్స్‌మెన్ వైఫల్యాలతో ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సహా ప్రతి ఒక్కరూ అంటున్న మాట... ‘ఏబీ డివిలియర్స్ (ఏబీడీ) ఉంటే ఇలా జరిగేదా?’ అని. తనదైన శైలిలో విరుచుకుపడి ఆడే డివిలియర్స్ అవసరమైతే ఇన్నింగ్స్‌లనూ నిర్మించగలడు. అలాంటి ఆటగాడు 2018 మేలో సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపించి ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అలసిపోవడంతో పాటు తనలో తపన లేదంటూ ఈ సందర్భంగా ఏబీడీ పేర్కొన్నాడు. నాడు ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యపర్చింది. కనీసం అతడు ప్రపంచ కప్ వరకైనా కొనసాగి ఉండాల్సిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, తర్వాత ఏమనుకున్నాడో ఏమో... పునరాగమనం చేయాలని డివిలియర్స్ భావించాడు. సరిగ్గా ఏప్రిల్ 18న ప్రస్తుత కప్‌నకు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించే సమయానికి కెప్టెన్ డు ప్లెసిస్, ప్రధాన కోచ్ ఒటిస్ గిబ్సన్, సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జొండిలతో కూడిన జట్టు యాజమాన్యాన్ని కలిసి తన అభిమతం వెల్లడించాడు. కానీ, గత ఏడాది కాలంగా ఎంపిక ప్రక్రియకు ప్రామాణికమైన దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో వారు ఏబీ ప్రతిపాదనను కనీసం పరిగణించలేదు.
అతడిని తిరిగి తీసుకోవడం భావ్యంగా ఉండదని, ముఖ్యంగా నిలకడగా ఆడుతున్న డసెన్ వంటి ఆటగాళ్ల అవకాశాలను దెబ్బతీసినట్లు అవుతుందని కూడా భావించారు. దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ కప్ సన్నాహాల్లో ఉంటే, డివిలియర్స్ ఐపీఎల్ ఆడిన వైనాన్నీ వారు దృష్టిలో పెట్టుకున్నారు. ఇటీవల భారత్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ తాను ప్రపంచ కప్ బృందంలో ఉండాల్సిందన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. మరోవైపు... కప్‌లో దెబ్బతిని ఉన్న తమ జట్టుకు ట్విట్టర్ ద్వారా డివిలియర్స్ ధైర్యం చెప్పాడు. ‘మనం జట్టుకు అండగా నిలవడంపై దృష్టిపెట్టడం ముఖ్యం. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. కుర్రాళ్లు ఆ పని చేస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు.
మా నిర్ణయం సరైనదే: జొండి
ఈ మొత్తం వ్యవహారంపై సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జొండి స్పందిస్తూ... ‘రిటైర్ కావొద్దంటూ గతేడాది ఏబీడీని నేను బతిమాలాను. అప్పటికీ ప్రపంచ కప్‌నకు తాజాగా ఉండేలా రాబోయే సీజన్‌ను ప్లాన్ చేసుకోమని అవకాశం కూడా ఇచ్చాను. కప్ కోసం పరిగణనలో ఉండాలంటే స్వదేశంలో శ్రీలంక, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడాలనీ చెప్పాం. అతడు వాటిని పట్టించుకోలేదు. రిటైర్మెంట్ ప్రకటనతో తాను ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పాడు. తీరా ఏప్రిల్ 18న డివిలియర్స్ ఆలోచన చెప్పేసరికి మేం షాక్ అయ్యాం. అతడి లోటు తీర్చలేనిదే. కానీ, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొందరు కుర్రాళ్లు తీవ్రంగా శ్రమించారు. వారికి అవకాశం ఇవ్వాల్సిందే. ఏదేమైనా మా నిర్ణయం విధానాల ప్రకారమే తీసుకున్నాం’ అని వివరించాడు.
వస్తానంటే... వద్దన్నారు
Published Fri, Jun 7 2019 5:04 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment