భవితకు చక్కని ప్లానింగ్..
పిల్లల భవిష్యత్తు
అవసరాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రతి తల్లిదండ్రుల ముందుండే అతిపెద్ద లక్ష్యం. చక్కగా ప్రణాళికాబద్ధంగా వెళితే ఇలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. పిల్లల ఆర్థిక ప్రణాళిక కోసం తల్లిదండ్రులు అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ...
పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి బంగారు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. వారిని జీవితంలో ఉన్నత శిఖరాల్లో నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. పిల్లల్లో ఉంటే సృజనాత్మక శక్తిని గ్రహించి వారిని ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి శిల్పిలాగా కృషి చేస్తారంటే అతిశయోక్తి కాదేమో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ వారి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. దీనికి అనుగుణంగానే ఆర్థిక ప్రణాళికలను కూడా రచించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్న వారు వారి ఫ్యామిలీ బడ్జెట్‌లో చిన్నారుల కోసం ప్రతీ నెలా కొంత కేటాయించే విధంగా చూసుకోవాలి.
చదువు, విదేశాల్లో ఉన్నత విద్య, పెళ్ళి వంటి ప్రధాన అవసరాలే కాకుండా వ్యాపారం ప్రారంభించడానికి కొంత మూల ధనం సమకూర్చడం తదితర అనేక అవసరాలు ఉంటాయి. వీటన్నింటికీ నగదు భారీగానే అవసరం అవుతుంది. ఈ కలల లక్ష్యాలను చేరుకోవడానికి బీమా కంపెనీలు వివిధ పథకాలను అందిస్తున్నాయి. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే... పిల్లల లక్ష్యాలు ఆగకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి బీమా పథకాలు అక్కరకు వస్తాయి. కాబట్టి పిల్లల కోసం చేసుకునే ప్లానింగ్‌లో బీమా తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాలి.
చిన్నారుల భవిష్యత్తు కోసం నిర్దేశించిన బీమా పథకాలు దీర్ఘకాలానికి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి వీటిల్లో క్రమం తప్పకుండా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. పెరుగుతున్న విద్యావ్యయం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు ఈ బీమా పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. పిల్లల కోసం బీమా పథకాలను తీసుకునేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి...
పిల్లల కోసం చేసే ఆర్థిక ప్రణాళికల్లో జాప్యం వద్దు. ఎంత తొందరగా మొదలు పెడితే అంత ప్రయోజనం ఉంటుంది. చాలా బీమా పథకాల్లో మెచ్యూర్టీ లేదా క్రమానుగత చెల్లింపులు పిల్లల వయసు 18 ఏళ్ళు రాగానే మొదలవుతాయి. కాబట్టి ఈ దీర్ఘకాలిక పథకాలను ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఒకవేళ ఏ పథకం తీసుకోవాలో అర్థం కాకపోతే గుర్తింపు పొందిన ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదించి మీ అవసరాలకు అనువైన పథకాన్ని ఎంచుకోండి. ప్రధాన పాలసీకి అనుబంధంగా ప్రీమియం వైవర్ అనే రైడర్‌ను అందిస్తుంటాయి. పిల్లల పథకాలతో పాటు తప్పకుండా తీసుకోవాల్సిన రైడర్లలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రీమియం చెల్లించే పాలసీదారుడు మరణిస్తే... భవిష్యత్తు ప్రీమియంలు కట్టనవసరం లేకుండా పాలసీ కొనసాగడానికి ఈ రైడర్ దోహదం చేస్తుంది. అంటే పాలసీదారుడు మరణించినా... ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్థిక భారం లేకుండానే లక్ష్యాలను చేరుకోవచ్చు.
దీర్ఘకాలంలో ఈక్విటీలకు అధిక లాభాలను ఇచ్చే శక్తి ఉండటంతో యులిప్స్ పథకాలను తీసుకోవచ్చు. అత్యధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే గ్రోత్ ఫండ్‌ను ఎంచుకొని లక్ష్యాన్ని చేరుతున్నప్పుడు వచ్చిన లాభాలను కాపాడుకోవడానికి ఈ మొత్తాన్ని క్రమానుగతంగా డెట్ పథకాల్లోకి మార్చుకోండి. లేకపోతే అటు వృద్ధికి అవకాశం ఉంటూ, ఇటు అసలుకు ఢోకా లేకుండా ఉండే విధంగా బ్యాలెన్స్‌డ్ పథకాలను ఎంచుకోండి. వీటితో పాటు ప్రీమియం చెల్లించే వ్యక్తికి తగినంత బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. పన్ను ప్రయోజనాలపరంగా చూసినా బీమా పథకాలు రెండిందాల ప్రయోజనాన్ని కలిగిస్తాయి. చెల్లిస్తున్న ప్రీమియంపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనంతోపాటు, సెక్షన్ 10 (10డీ) ప్రకారం మెచ్యూర్టీ ద్వారా అందుకునే మొత్తాన్ని కూడా పన్ను భారం లేని ఆదాయంగా పరిగణిస్తారు.
పాలసీ తీసుకునే ముందు అందులో పొందుపర్చిన నిబంధనలు, ఆ పథకం మీ అవసరాలకు తగినట్లుగా ఉందా లేదా అన్న విషయాలను ఒకసారి పరిశీలించాలి. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బీమా పథకాలతో పోల్చి చూసి మేలైనదాన్ని ఎంచుకోండి.