
ఉదయం 11.54 గంటలకు ముహూర్తం
ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలోనే ఎత్తయిన దివ్యవిమానబంగారు గోపురం
మహోత్సవానికి ముస్తాబైన యాదగిరిగుట్ట క్షేత్రం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి యాదగిరిగుట్ట క్షేత్రం ముస్తాబైంది. ఆదివారం జరిగే స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది. గుట్టలో ఈ నెల 19 నుంచి నిర్వహిస్తున్న పంచకుండాత్మక నారసింహ యాగం పూర్ణాహుతి అనంతరం ఆదివారం ఉదయం 11.54 గంటలకు దివ్య స్వర్ణ విమాన గోపురం కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది.
68 కిలోల బంగారంతో తాపడం..
యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం దేశంలోనే ఎత్తయినదని చెపుతున్నారు. పంచతల రాజగోపురానికి సుమారు 68 కిలోల బంగారంతో తాపడం చేయించారు. రూ.5.10 కోట్ల ఖర్చుతో భక్తులు, దాతలు ఇచి్చన బంగారం, నగదుతోపాటు, దేవస్థానం హుండీలో భక్తులు వేసిన కానుకలతో స్వర్ణ తాపడం చేపట్టారు. గోపురంపై సింహ, గరుడ విగ్రహాలు, నారసింహ రూపాలు చెక్కారు.
దాతల కోటాలో కేసీఆర్‌కు ఆహ్వానం
స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్‌స్వామిలను దాతల కేటగిరీలో దేవస్థానం అధికారులు ఈ మహోత్సవానికి ఆహ్వానించారు. మహా కుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక నారసింహ యాగం జరుగుతున్న తీరును కేసీఆర్ ఆరా తీశారని సమాచారం. త్వరలో ఆయన యాదాద్రీశుని దర్శనానికి వస్తానని చెప్పినట్లు తెలిసింది.
హాజరుకానున్న మంత్రులు
యాదగిరిగుట్ట ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరుకానున్నారు.
ఆర్జిత సేవలు రద్దు: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయంలో నిత్య కల్యాణం, పుష్పార్చనతో పాటు ఆయా ఆర్జిత సేవలను రద్దుచేశారు. అంతే కాకుండా ఉదయం, సాయంత్రం ఆలయంలో బ్రేక్ దర్శనాలను సైతం నిలిపివేశారు. ఉదయం 10 గంటల నుంచి ఉచిత, వీఐపీ, ఇతర టికెట్ దర్శనాలను రద్దు చేశారు. ఉదయం సమయంలో స్వామి వారి దర్శనాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రావాలని ఆలయ ఈవో భాస్కర్‌రావు పేర్కొన్నారు.
నేడు పంచకుండాత్మక యాగం ముగింపు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురానికి కుంభాభిõÙకం, సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగం ఆదివారంతో ముగియనుంది. శనివారం ఉదయం ప్రధాన ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం, యాగశాలలో చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమాన్ని రుత్వికులు నిర్వహించారు.
తర్వాత ఏకాశీతి కలశ స్నపనము, చాతుమరై నిర్వహించి నిత్య పూర్ణాహుతి చేశారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించారు. ఆయా వేడుకల్లో వానమామలై మఠం మధుర కవి రామానుజ జీయర్ స్వామి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఇతర అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment