
సుదర్శన చక్రం వద్ద పూజలు చేస్తున్న వానమామలై రామానుజ జీయర్ స్వామి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవం పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. వానమామలై రామానుజ జీయర్ స్వామితో కలిసి రేవంత్.. శ్రీ సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ చేసి, స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీనృసింహుడికి అంకితమిచ్చారు.
సంప్రోక్షణ మహోత్సవం సాగిందిలా..
మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా పంచకుండాత్మక యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11:24 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా యాగశాలకు చేరుకోగా రుతి్వక్కులు వారికి స్వాగతం పలికారు. ఆపై ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రికి అర్చకులు సంకల్పం చెప్పారు.
ఆ తరువాత కలశంలో నాలుగు రోజులుగా పూజలు నిర్వహించిన 14 నదుల జలాలను తీసుకొని వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ప్రాకార మండపం మీదుగా స్వామివారి శిరస్థానమైన ఆలయ పంచతల స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు చేరుకున్నారు.
స్వర్ణ విమాన గోపురం చుట్టూ ఉన్న తెరలను తొలగించి 11:32 గంటలకు దేశంలోనే ఎత్తయిన దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆ తరువాత స్వర్ణ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి చేతుల మీదుగా నదీజలాలతో పూజలు నిర్వహించిన నవ కలశ స్నపన తీర్థంతో ఆలయ శిఖరంపై సుదర్శన చక్రానికి కుంభాభిషేకం చేశారు. ఉదయం 11:54 గంటలకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తాన స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు.
గర్భాలయంలో సీఎం దంపతుల పూజలు
సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవం పూర్తికాగానే తూర్పు రాజగోపురం ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అక్కడి నుంచి ధ్వజస్తంభం వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వయంభూవులను దర్శించుకున్నారు. వారిని అర్చకులు అష్టోత్తరంతో ఆశీర్వదించారు.
అనంతరం ఆలయ ముఖ మండపంలో సీఎం దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తరువాత వానమామలై రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. సీఎంను జీయర్ స్వామి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రికి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు విమాన గోపురం ప్రతిమను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు పలకరింపు..
పడమటి రాజగోపురం మీదుగా ఆలయం నుంచి సీఎం దంపతులు బయటకు వచ్చారు. కాలినడకన వస్తూ కొండపైన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. కొండపైన ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. అంతా బాగుందని.. భక్తులు అధికంగా వస్తున్నారని సీఎంకు వారు చెప్పారు. అనంతరం ఈఓ కార్యాలయానికి వెళ్లి స్వామివారి ప్రసాదం తీసుకున్నారు.
కాగా, ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు నిర్వహించిన స్తపతి రవీంద్రన్, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బంగారు కడియాలు తొడిగారు. మరోవైపు కొండపై కల్యాణమండపం నిర్మించాలని సీఎం రేవంత్‌ను కోరగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.
బాల్యమిత్రుడి కుమార్తె వివాహానికి హాజరు
గుట్ట ప్రెసిడెన్షియల్ సూట్‌లో తన చిన్ననాటి స్నేహితుడు భాష్యం ఎదుమోహన్–కల్యాణి దంపతుల కుమార్తె శ్రీలిపి, వరుడు జయసూర్య విశ్వనాథ్‌ల వివాహానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో తిరుగుపయనం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment