Yadagiri gutta temple
-
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
ఒకే రకమైన దర్శనం కల్పించాలి
యాదగిరిగుట్ట: అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో రాబోయే రోజుల్లో భక్తులందరికీ ఒకే రకమైన దర్శనం లభించే విధంగా ప్రభుత్వం, అధికారులు కృషిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి అన్నారు. యాదాద్రీశుడిని శనివారం జస్టిస్ సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆచార్యులు మండపంలో ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే యాదాద్రి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. వీఐపీలు, వీవీఐపీలతో పాటు సాధారణ భక్తులకు సైతం శ్రీస్వామివారి దర్శనం అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా జడ్జి, పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
యాదాద్రి: అడుగడుగు.. అణువణువు
సాక్షి, యాదాద్రి: యాదగిరి క్షేత్రాన్ని పునఃప్రారం భించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళ వారం యాదాద్రిలో పర్యటించారు.సుమారు 8 గం టల పాటు ఆయన ప్రధానాలయంతో పాటు యాదాద్రిలో చేపట్టిన పనులను పరిశీలించి సూచ నలు చేశారు. పూర్తికావచ్చిన ఆలయ పునర్ని ర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని పరిశీలిం చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు, పరిసరాలన్నిం టినీ పరిశీలించారు. మధ్యాహ్నం 12.40గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగి కొండపై బాలాలయానికి చేరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సీఎంకు పుష్పగుచ్చాలు అందజేయగా వేదపండితులు, అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. బాలాలయంలో అర్చన అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం.. పెంబర్తి కళాకారులు తీర్చిదిద్దిన ప్రధానాలయ ద్వారాలను పరిశీలించారు. ప్రాంగ ణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను తన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృ«శ్యాలను పరిశీలించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తది తర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొం దించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి.. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాల యం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’ అంటూ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అర్చకులకు ఇళ్ల స్థలాలు ఆలయ అర్చకులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని కోరగా.. నిర్ణయం ఎప్పుడో తీసుకున్నం దున ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అర్చ కులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటా యించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. ‘మీకు పీఆర్సీ వస్తోందా ?’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగు లను అడిగి తెలుసుకున్నారు. రింగురోడ్డు నిర్మాణ సమయంలో వాణిజ్య స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కల్యాణ కట్ట సమీపంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. త్రిదండి చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ఆలయ ప్రారం భం ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని కోరుతూ ఆలయ ఈఓ గీతకు సీఎం కేసీఆర్ అందించారు. యాదాద్రిలోని రామలింగేశ్వ రాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు, ఎమ్మె ల్యేలు, తదితరులతో కలిసి భోజనం చేశారు. కొండ కింద పనుల పరిశీలన సాయంత్రం.. కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్క రిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణా లను పరిశీలించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పర్యవేక్షిం చారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం చేపట్టబోతు న్నట్లు చెప్పారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీ లను నిర్మిస్తుందని తెలిపారు. మద్యపానం నిషేధం యాదాద్రి పవిత్రతను కాపాడ టానికి అందరూ సహకరించా లని, టెంపుల్ సిటీ పరిధిలో మద్య పానం, ధూమపానం నిషేధాన్ని కఠినతరంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం శాకాహారాన్నే అను మతించాలని సూచించారు. వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్లు యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐ పీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసి డెన్షియల్ సూట్లను సీఎం పరిశీలించారు. హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగ వత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్‌రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవ దాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు హెలీపాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తా, సీఎం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. ప్రతి శిల్పం ప్రత్యేకంగా పరిశీలన ఆలయం ముందున్న వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన సీఎం ప్రధాన దేవాలయ గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్రనామాలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కల్యాణ ఘట్టాన్ని, తంజావూరు చిత్ర పటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రి వర్గ సహ చరులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ధ్వజ స్తంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలిం చారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్లు, క్షేత్రపాలకుడు ఆంజ నేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు. -
యాదాద్రి ఫోటోలు
-
యాదాద్రి రైల్వే స్టేషన్‌గా రాయగిరి..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్పు చేశా రు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వు లు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న విష యం తెలిసిందే. అయితే యాదాద్రి ఆల య పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే దేశ నలుమూలల నుంచి రోజూ లక్ష మంది భక్తులు వస్తారని ప్ర భుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో ఘట్కేసర్ వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించాలని, దీంతో పాటు రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చాలని 2016లో ముఖ్య మంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ పేరును కూడా మార్పు చేసింది. ఇందుకు సంబంధించి ఈనెల 18న దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. కాగా గత సంవత్సరం సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్టకు రాయగిరి రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్ – ఖాజీపేట సెక్షన్లో భువనగిరి – వంగపల్లి మధ్యన రాయగిరి రైల్వే స్టేషన్ ఉంది. రాయగిరిలో రైలు దిగి యాదగిరిగుట్టకు భక్తులు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం సాక్షి, యాదాద్రి : రాయగిరి రైల్వే స్టేషన్ పేరు యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌కు పేరు మార్పుతో యాదాద్రి దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. 2016లో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. –డా.బూరనర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ, భువనగిరి -
వివాదాలు చెరిపినారు
యాదగరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణంలో అష్టభుజి ప్రాకారం రాతి స్తంభాలపై ఏర్పాటు చేసిన వివాదాస్పద చిత్రాలను ఆదివారం తొలగించారు. రాతి స్తంభాలపై చెక్కిన సీఎం కేసీఆర్, చార్మినార్, కేసీఆర్ కిట్ వంటి తదితర చిత్రాలపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొలగించింది. వాటి స్థానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను చెక్కుతున్నారు. శనివారం చిత్రాలను తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అక్కడి శిల్పులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే యాదాద్రిలో రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. -
యాదాద్రి ప్రాకారాలకు 28 రాజగోపురాలు
సాక్షి, యాదాద్రి/యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా నూతన ప్రధానాలయం ప్రాకారాలకు మొత్తం 28 చిన్న రాజగోపురాలు రానున్నాయి. 24 గోపురాలను అష్టభుజి మండపాలపై 8 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. అదే విధంగా నాలుగు మూలల్లోని మండపాలపై మరో నాలుగు రాజగోపురాలు రానున్నాయి. ఇవి సుమారు 13 అడుగుల ఎత్తుతో ఉంటాయి. వీటి నిర్మాణం పూర్తయితే ఆలయం ఇంకా అందంగా కనిపించనుంది. నాలుగు మండపాలపై రానున్న గోపురాలను ఆలయంలోనికి వెళ్లాక కనిపించేలా నిర్మాణం చేస్తున్నారు. అష్టభుజి మండపాలపై వచ్చే గోపురాలు మాత్రం బయటికి స్పష్టంగా కనిపించనున్నాయి. వీటికి సంబంధించిన ప్లాన్లు సైతం రూపొందించారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. సుదర్శన విమాన రాజగోపురం పూర్తి యాదాద్రి ప్రధానాలయ సప్తగోపుర నిర్మాణాల్లో అత్యంత ప్రధానమైన సుదర్శన విమాన రాజగోపుర నిర్మాణం పూర్తయింది. ఆలయ విస్తరణలో భాగంగా గర్భాలయంపై సుదర్శన విమాన రాజగోపురాన్ని నిర్మించారు. ఐదంతస్తుల్లో 50 వేల టన్నుల కృష్ణశిలలతో ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దీనిపై సుదర్శన చక్రం ఏర్పాటు చేసిన అనంతరం పెద్ద ఎత్తున కుంభాభిషేకం చేపడుతారు. దీంతో స్వామి, అమ్మవార్లు కొలువైన గర్భాలయంపైన గల సుదర్శన రాజగోపురం భక్తుల మొక్కులను అందుకోనుంది. ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో ఏడంతస్తుల మహారాజగోపురం చివరి దశ పనులు మినహా మిగతా ఆరుగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయంపైన గల సుదర్శన విమాన రాజగోపురంపై దేవతా విగ్రహాల ఏర్పాటు పూర్తయింది. 10 ద్వారపాలకుల విగ్రహాలు, ప్రతి అంతస్తులో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 10 విగ్రహాల ఏర్పాటు పూర్తి కావడంతో శిల్పులు తమ పనులను ముగించుకున్నారు. అయితే ప్రధానాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వయంభువుల ప్రతిష్ఠ తర్వాత రాజగోపురంపై కలశాలను, సుదర్శన చక్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ జీయర్లు, ఆచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రస్తుతం పూర్తయిన రాజగోపురాలు యాదాద్రికి వచ్చే భక్తులను కనువిందు చేస్తున్నాయి. అలాగే తిరుమాడ వీధులు, ముఖ మండపం, ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టడానికి వైటీడీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త గోపురాలు రానున్న ఆలయ ప్రాకారం -
‘యాదాద్రి’కి బంగారు, వెండి సొబగులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బంగారు, వెండి సొబగులు అద్దనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా చిన జీయర్‌స్వామి ఆదేశాల మేరకు ఆగమ శాస్త్రానుసారంగా స్వయంభూమూర్తుల గర్భాలయంపై ఉన్న విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభానికి బంగారం, ద్వారాలు, బలిపీఠానికి వెండి తొడుగులు వేయనున్నారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో బలిపీఠం ఉంటుంది. అష్టదిక్పాలకులకు అవసరమైన ఆహారం ఉం చేందుకు ఏర్పాటు చేసేదే బలిపీఠం. బంగారు తాపడం చేసే ధ్వజస్తంభ వేదిక, బలిపీఠం ఈ బృహత్తర ప్రణాళికకు రూ.50 కోట్లు వెచ్చించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందులో విమాన రాజగోపురం, ధ్వజస్తంభానికి రూ.35 కోట్లు, ద్వారాలు, బలిపీఠానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నారు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం వీటికి రాగి తొడుగులను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి దేవస్థానంలో ప్రస్తుతం సుమారు 10 కిలోల బంగారం, సుమారు 1,600 కేజీల వెండి ఉంది. కాగా, విమాన రాజగోపురానికి సుమారు 30 కేజీల బంగారం, ధ్వజస్తంభానికి సుమారు 10 కేజీల బంగారం, ఆలయ ద్వారాలు, బలిపీఠానికి తొడుగులకోసం సుమారు 2 వేల కేజీల వెండి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతపెద్ద మొత్తం బంగారం, వెండి దేవస్థానంలో అందుబాటులో లేదని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి తెలియజేశారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బంగారాన్ని, వెండిని వైటీడీఏకు అప్పగించి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికలను అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ పనులన్నీ అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అధికారులు ముందుగా విమాన రాజగోపురం సహా అన్ని రాజగోపురాల పనులను పూర్తి చేసి ప్రతిష్ఠ నాటికి ఈ కార్యక్రమాలను చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శనానికి వచ్చే భక్తులను కట్టడి చేస్తూ పనులను ఎలా చేయాలన్నదానిపై అధికారులు మీమాంసలో ఉన్నారు. ఎలాగైనా తిరుమల తరహాలో విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు, వెండిరేకులను తాపడం చేసి, స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు.. ఆధ్యాత్మిక ఆనందం, కనువిందు కలిగించాలని వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్‌ను కలసి ప్రణాళికలు వివరించాలని సమాలోచనలు చేస్తున్నారు. -
యాదాద్రికి ద్వారపాలకుల విగ్రహాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా సుదర్శన విమాన రాజగోపురంపైన ఏర్పాటు చేసేందుకు జయ విజయుల విగ్రహాలు శుక్రవారం యాదాద్రికి చేరుకున్నాయి. ఇవి ఒక్కోటి సుమారు ఆరున్నర అడుగులు ఉన్నాయి. శనివారం ఉదయం వీటిని రాజగోపురంపై ప్రతిష్ఠించనున్నారు. ఒక్కో ద్వారపాలకుడి విగ్రహం తయారు చేసేందుకు సుమారు 2 నెలల సమయం పట్టిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఇలా మొత్తం 8 విగ్రహాలను ఆళ్లగడ్డ, గుంటూరు నుంచి తీసుకువచ్చారు. ఇప్పటికే శిల్పులు సప్త రాజగోపురాలను పూర్తి చేశారు. ప్రస్తుతం వాటిపై శిల్పాలను ప్రతిష్ఠించే పనులు చేస్తున్నారు. వీటిని సైతం మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రధానాలయం పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. చినజీయర్‌స్వామి ఆదేశాల మేరకు ప్రధానాలయం ప్రతిష్ఠ కార్యక్రమాలకు తేదీల నిర్ణయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిత్య కల్యాణ మండపం మార్పు ప్రధానాలయంలోని ప్రాకారానికి వెనక వైపు నిత్య కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు మొదట భావించారు. అయితే రానున్న రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అది సరిపోదని భావించి నిత్యకల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా నిర్మించాలని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో సుమారుగా 50 నుంచి 70 కల్యాణాలు జరుగుతాయి. కాగా, ప్రతి శని, ఆదివారాలు, పర్వదినాలు, శేష రోజుల్లో వందల సంఖ్యలో జరుగుతాయని భావించి పెద్దగా ఉండేలా ప్రత్యేక మండపం నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మండపానికి వచ్చేందుకు ఒక ద్వారం, వెళ్లేందుకు మరోద్వారం ఏర్పాటు చేయనున్నారు. శిలాస్తంభాలపై నాణేల చిత్రాలు అష్టభుజి మండపం శిలాస్తంభాలపై 5 రూపాయలు, ఒక రూపాయి, రెండు పైసల నాణేం వంటి అనేక చిత్రాలే కాకుండా జంతువులు, వివిధ పనులకు సంబంధించిన పనిముట్లు, కాకతీయుల కాలం నాటి ముద్రణలు, శివాజీ, అమ్మవారి కలశం, వంటి వివిధ ఆకృతులలో ఉండే చిత్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. తెలంగాణ జీవన శైలికి అద్దం పట్టే విధంగా ఈ కళాకృతులను చెక్కుతున్నారు. -
శివాలయం, ప్రధానాలయం ఒకేసారి ప్రారంభం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మితమవుతున్న శివాలయం, స్వామి వారి గర్భాలయం రెండు ఒకేసారి ప్రారంభించడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గర్భాలయ ప్రతిష్ట చేసే తేదీలను చినజీయర్ స్వామి ప్రకటించడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రధానాలయంలోని గర్భాలయంలో స్వయంభూ మూర్తుల వద్ద ఫ్లోరింగ్ చేసి బండలు వేస్తున్నారు. ప్రధాన ముఖ మండపంలో పనులన్నీ పూర్తయ్యాయి. బయట ఉన్న అష్టబుజి మండపం, ఆలయ ప్రాకారం పనులు, రెండో ప్రాకారం పనులు జరుగుతున్నాయి. వీటిని మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. శివాలయం పనులు: శివాలయంలో ప్రస్తుతం రాజగోపురాలు, ప్రధాన ద్వారం, చుట్టూ ప్రాకారం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే రెండు ఆలయాల ప్రతిష్ట కార్యక్రమాలను ఒకేసారి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జనవరిలోనే ప్రధానాలయం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆలయ పనుల పరిశీలన: తిరుమాడ వీధులు, రాజగోపురాలు, నూతన ప్రధానాలయం పనులను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. -
గుట్ట ఆలయం గంటపాటు మూసివేత
యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గంటపాటు మూసివేశారు. విష్ణుపుష్కరిణిలో పడి హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన దుద్దెడ రాజు అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆలయ అర్చకులు నిత్య కైంకర్యాలన్ని నిలిపి వేసి గంటపాటు ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజనం చేశారు. నిత్య కైంకర్యాలను నిర్వహించి తిరిగి తెరిచారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు.