ఆలయ ప్రాకార రాజగోపురాల నమూనా
సాక్షి, యాదాద్రి/యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా నూతన ప్రధానాలయం ప్రాకారాలకు మొత్తం 28 చిన్న రాజగోపురాలు రానున్నాయి. 24 గోపురాలను అష్టభుజి మండపాలపై 8 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. అదే విధంగా నాలుగు మూలల్లోని మండపాలపై మరో నాలుగు రాజగోపురాలు రానున్నాయి. ఇవి సుమారు 13 అడుగుల ఎత్తుతో ఉంటాయి. వీటి నిర్మాణం పూర్తయితే ఆలయం ఇంకా అందంగా కనిపించనుంది. నాలుగు మండపాలపై రానున్న గోపురాలను ఆలయంలోనికి వెళ్లాక కనిపించేలా నిర్మాణం చేస్తున్నారు. అష్టభుజి మండపాలపై వచ్చే గోపురాలు మాత్రం బయటికి స్పష్టంగా కనిపించనున్నాయి. వీటికి సంబంధించిన ప్లాన్లు సైతం రూపొందించారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి.
సుదర్శన విమాన రాజగోపురం పూర్తి
యాదాద్రి ప్రధానాలయ సప్తగోపుర నిర్మాణాల్లో అత్యంత ప్రధానమైన సుదర్శన విమాన రాజగోపుర నిర్మాణం పూర్తయింది. ఆలయ విస్తరణలో భాగంగా గర్భాలయంపై సుదర్శన విమాన రాజగోపురాన్ని నిర్మించారు. ఐదంతస్తుల్లో 50 వేల టన్నుల కృష్ణశిలలతో ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దీనిపై సుదర్శన చక్రం ఏర్పాటు చేసిన అనంతరం పెద్ద ఎత్తున కుంభాభిషేకం చేపడుతారు. దీంతో స్వామి, అమ్మవార్లు కొలువైన గర్భాలయంపైన గల సుదర్శన రాజగోపురం భక్తుల మొక్కులను అందుకోనుంది. ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో ఏడంతస్తుల మహారాజగోపురం చివరి దశ పనులు మినహా మిగతా ఆరుగోపురాల పనులు పూర్తయ్యాయి.
గర్భాలయంపైన గల సుదర్శన విమాన రాజగోపురంపై దేవతా విగ్రహాల ఏర్పాటు పూర్తయింది. 10 ద్వారపాలకుల విగ్రహాలు, ప్రతి అంతస్తులో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 10 విగ్రహాల ఏర్పాటు పూర్తి కావడంతో శిల్పులు తమ పనులను ముగించుకున్నారు. అయితే ప్రధానాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వయంభువుల ప్రతిష్ఠ తర్వాత రాజగోపురంపై కలశాలను, సుదర్శన చక్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ జీయర్లు, ఆచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రస్తుతం పూర్తయిన రాజగోపురాలు యాదాద్రికి వచ్చే భక్తులను కనువిందు చేస్తున్నాయి. అలాగే తిరుమాడ వీధులు, ముఖ మండపం, ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టడానికి వైటీడీఏ అధికారులు సిద్ధమవుతున్నారు.
కొత్త గోపురాలు రానున్న ఆలయ ప్రాకారం
Comments
Please login to add a commentAdd a comment