‘యాదాద్రి’కి బంగారు, వెండి సొబగులు  | Gold and Silver coatings to the Yadadri Temple | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’కి బంగారు, వెండి సొబగులు 

Published Sat, Jan 12 2019 1:26 AM | Last Updated on Sat, Jan 12 2019 1:26 AM

Gold and Silver coatings to the Yadadri Temple - Sakshi

గుట్టపై కొనసాగుతున్న నిర్మాణ పనులు

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బంగారు, వెండి సొబగులు అద్దనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా చిన జీయర్‌స్వామి ఆదేశాల మేరకు ఆగమ శాస్త్రానుసారంగా స్వయంభూమూర్తుల గర్భాలయంపై ఉన్న విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభానికి బంగారం, ద్వారాలు, బలిపీఠానికి వెండి తొడుగులు వేయనున్నారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో బలిపీఠం ఉంటుంది. అష్టదిక్పాలకులకు అవసరమైన ఆహారం ఉం చేందుకు ఏర్పాటు చేసేదే బలిపీఠం.

బంగారు తాపడం చేసే ధ్వజస్తంభ వేదిక, బలిపీఠం  

ఈ బృహత్తర ప్రణాళికకు రూ.50 కోట్లు వెచ్చించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందులో విమాన రాజగోపురం, ధ్వజస్తంభానికి రూ.35 కోట్లు, ద్వారాలు, బలిపీఠానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నారు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం వీటికి రాగి తొడుగులను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి దేవస్థానంలో ప్రస్తుతం సుమారు 10 కిలోల బంగారం, సుమారు 1,600 కేజీల వెండి ఉంది. కాగా, విమాన రాజగోపురానికి సుమారు 30 కేజీల బంగారం, ధ్వజస్తంభానికి సుమారు 10 కేజీల బంగారం, ఆలయ ద్వారాలు, బలిపీఠానికి తొడుగులకోసం సుమారు 2 వేల కేజీల వెండి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంతపెద్ద మొత్తం బంగారం, వెండి దేవస్థానంలో అందుబాటులో లేదని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి తెలియజేశారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బంగారాన్ని, వెండిని వైటీడీఏకు అప్పగించి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికలను అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ పనులన్నీ అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అధికారులు ముందుగా విమాన రాజగోపురం సహా అన్ని రాజగోపురాల పనులను పూర్తి చేసి ప్రతిష్ఠ నాటికి ఈ కార్యక్రమాలను చేయాలని ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉండగా దర్శనానికి వచ్చే భక్తులను కట్టడి చేస్తూ పనులను ఎలా చేయాలన్నదానిపై అధికారులు మీమాంసలో ఉన్నారు. ఎలాగైనా తిరుమల తరహాలో విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు, వెండిరేకులను తాపడం చేసి, స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు.. ఆధ్యాత్మిక ఆనందం, కనువిందు కలిగించాలని వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్‌ను కలసి ప్రణాళికలు వివరించాలని సమాలోచనలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement