YTDA team
-
యాదాద్రిలో మండపాల్లోకి వర్షపు నీరు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన వర్షాలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ మండపాల్లోకి వర్షం నీళ్లు వచ్చాయి. ప్రధానంగా అష్టభుజి, అంతర్గత, బాహ్య ప్రాకార మండపాల్లో వర్షం నీళ్లు చేరుతున్నాయి. పంచతల రాజగోపురం వద్ద ఉన్న ప్రాకార మండపంలో నిర్మితం అవుతున్న అద్దాల మండపంలోకి కూడా వాననీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆలయ పునర్నిర్మాణ సాంకేతిక కమిటీ సభ్యులు, వైటీడీఏ అధికారులు, ఇంజనీర్లు ఆలయాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పనులు పూర్తి కాకపోవడంతోనే.. యాదాద్రి ప్రధాన ఆలయంలో చేస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి కాకపోవడంతోనే ఇటీవల కురిసిన వర్షానికి ఆలయం, మండపాల్లోకి నీరు చేరినట్లు తెలుస్తోంది. ఆలయంలో లైటింగ్, ఏసీలు, ఇతర అవసరాలకోసం ప్రస్తుతం వైరింగ్ పనులు జరుగుతున్నాయి. వైర్లు కనిపించకుండా వేసిన పైప్లలోకి వర్షం నీళ్లు వెళ్లడంతో అవి ప్రధాన ఆలయంలోకి చేరుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రధాన ఆలయంలోనుంచి నీరు బయటకు వెళ్లేలా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నడుస్తున్నాయి. ఈ పనులు పూర్తి కాకపోవడంతో వాన నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. రెయిన్ ఫ్రూఫ్ గట్టి పడకపోవడంతో.. అష్టభుజి ప్రాకార మండపం, ఇన్నర్, అవుటర్ ప్రాకార మండపాల్లోని పై భాగంలో ఉన్న స్లాబ్ మధ్యలోని గ్యాప్‌లను డంగు సున్నంతో మూసేశారు. అలాగే స్లాబ్‌పైన వేసిన రెయిన్ ఫ్రూఫ్ గట్టిపడకపోవడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెయిన్ ఫ్రూఫ్ గట్టిపడడానికి సుమారు రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఇలా లీకేజీలు రావడంపై స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యతతో పనులు చేపట్టాలని, లీకేజీలు పునరావృతం కాకుండా వైటీడీఏ అధికారులు, టెక్నికల్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కాగా, ఆలయ నిర్మాణ పనుల్లో రాజీపడేది లేదని ఆలయం ఈవో గీతారెడ్డి స్పష్టం చేశారు. లీకేజీల పరిశీలన టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్రావు, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి, స్తపతి ఆనందచారి వేలు, శిల్పులు ఆలయంలో లీకేజీలను పరిశీలించారు. అద్దాల మండపంలోకి నీళ్లు ఎలా చేరాయి అనే అంశంపై శిల్పులతో చర్చించారు. అలాగే రెయిన్ ఫ్రూప్ వేశాక కూడ వర్షం నీళ్లు ఎలా లీక్ అవుతున్నాయని అడిగారు. స్లాబ్‌పై ఏర్పాటు చేసిన రెయిన్ ఫ్రూఫ్ పూర్తిగా గట్టి పడటానికి రెండేళ్ల కాలం పడుతుందని, ప్రస్తుతం జరిగిన లీకేజీలను సరి చేస్తామని టెక్నికల్ కమిటీ సభ్యులకు శిల్పులు తెలిపారు. లీకేజీలపై టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్రావు పలువురిని మందలించినట్లు తెలిసింది. -
రాష్ట్రపతి కోసం ప్రత్యేక భవనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. వైటీడీఏ ఆధ్వర్యంలో రూ.2,000 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే పెద్దగుట్ట లే అవుట్, ప్రధానాలయం అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానానికి వచ్చే వీవీఐపీల బస కోసం ప్రెసిడెన్షియల్ సూట్ (గెస్ట్‌హౌస్)ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సామాన్య భక్తుల కోసం వసతిగృహాలను నిర్మిస్తున్న వైటీడీఏ వీవీఐపీలు, వీఐపీల కోసం కూడా ప్రెసిడెన్షియల్ సూట్ల పేరుతో ప్రత్యే కంగా గెస్ట్‌హౌస్‌లను నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా యాదాద్రి క్షేత్ర మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రూ.104 కోట్ల తో అత్యాధునిక హంగులతో ప్రత్యేక గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. యాద గిరిపల్లి శివారులోని గుట్ట ప్రాంతంలో సర్వేనంబర్ 146లో 13.26 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించి వైటీడీఏకు అప్పగించారు. ఎన్ని నిర్మిస్తారంటే.. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే వీవీఐపీల కోసం 15 ప్రెసిడెన్షియల్ సూట్లను నిర్మిస్తున్నారు. ఇందులో కొండపైన అన్నిటికన్నా ఎత్తులో కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, గవర్నర్, సీఎంల బస కోసం ఓ అతిథిగృహాన్ని నిర్మిస్తారు. 14 గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తారు. ఇందులో 8 అతిథిగృహాల నిర్మాణం జరుగు తోంది. వీటికోసం ప్రత్యే కంగా రోడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ సూట్లలో విశాలమైన గదులు, సమావేశ మందిరాలుంటాయి. అత్యాధునిక ఫర్నిచర్, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో కళాఖండాలతో రమణీయంగా తీర్చిదిద్దనున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేక సదుపాయాలు, ఆవరణలో పచ్చదనం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయం పూర్తయ్యేలోపు ఈ పనులన్నిం టిని పూర్తి చేయనున్నారు. నాలుగు స్తంభాల మంటప నిర్మాణం యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో మరో అద్భుత శిల్పకళా ఖండం రూపుదిద్దుకుంటోంది. స్థపతులు మరో అద్భుత శిల్ప గోపుర మంటపానికి శ్రీకారం చుట్టారు. ఆలయానికి ఈశాన్యంలో 4 స్తంభాలను కాకతీయ శిల్పశైలితో నిర్మిస్తున్నారు. ఈ స్తంభాల నిర్మాణంలో పాశుపాదం, విగ్రహస్థానం, అష్టపట్టం, చతురస్రం, అమలకం, పద్మం, పొందిక వంటి ముద్రికలను చెక్కారు. రామాయణంలోని ప్రధానఘట్టాలనూ రాతి స్తంభాలపై చెక్కారు. సీత జననం, శ్రీరామలక్ష్మణ, భరత, శతృఘ్నుల జననం, విశ్వామిత్రుని వద్ద విద్యాభ్యాసం, సీతా స్వయంవరం, భరతుడికి శ్రీరాముని పాదుకలు ఇవ్వడం, రావణుడు సీతాపహరణ సమయంలో జటాయువు పోరాటం, వాలీసుగ్రీవుల పోరాటం, లంకలోని అశోక వనంలో ఉన్న సీతకు హన్మంతుడు అంగుళీయకం ఇవ్వడం, రావణ వధ, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలను స్తంభాలపై చెక్కారు. -
యాదాద్రి ప్రాకారాలకు 28 రాజగోపురాలు
సాక్షి, యాదాద్రి/యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా నూతన ప్రధానాలయం ప్రాకారాలకు మొత్తం 28 చిన్న రాజగోపురాలు రానున్నాయి. 24 గోపురాలను అష్టభుజి మండపాలపై 8 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. అదే విధంగా నాలుగు మూలల్లోని మండపాలపై మరో నాలుగు రాజగోపురాలు రానున్నాయి. ఇవి సుమారు 13 అడుగుల ఎత్తుతో ఉంటాయి. వీటి నిర్మాణం పూర్తయితే ఆలయం ఇంకా అందంగా కనిపించనుంది. నాలుగు మండపాలపై రానున్న గోపురాలను ఆలయంలోనికి వెళ్లాక కనిపించేలా నిర్మాణం చేస్తున్నారు. అష్టభుజి మండపాలపై వచ్చే గోపురాలు మాత్రం బయటికి స్పష్టంగా కనిపించనున్నాయి. వీటికి సంబంధించిన ప్లాన్లు సైతం రూపొందించారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. సుదర్శన విమాన రాజగోపురం పూర్తి యాదాద్రి ప్రధానాలయ సప్తగోపుర నిర్మాణాల్లో అత్యంత ప్రధానమైన సుదర్శన విమాన రాజగోపుర నిర్మాణం పూర్తయింది. ఆలయ విస్తరణలో భాగంగా గర్భాలయంపై సుదర్శన విమాన రాజగోపురాన్ని నిర్మించారు. ఐదంతస్తుల్లో 50 వేల టన్నుల కృష్ణశిలలతో ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దీనిపై సుదర్శన చక్రం ఏర్పాటు చేసిన అనంతరం పెద్ద ఎత్తున కుంభాభిషేకం చేపడుతారు. దీంతో స్వామి, అమ్మవార్లు కొలువైన గర్భాలయంపైన గల సుదర్శన రాజగోపురం భక్తుల మొక్కులను అందుకోనుంది. ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో ఏడంతస్తుల మహారాజగోపురం చివరి దశ పనులు మినహా మిగతా ఆరుగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయంపైన గల సుదర్శన విమాన రాజగోపురంపై దేవతా విగ్రహాల ఏర్పాటు పూర్తయింది. 10 ద్వారపాలకుల విగ్రహాలు, ప్రతి అంతస్తులో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 10 విగ్రహాల ఏర్పాటు పూర్తి కావడంతో శిల్పులు తమ పనులను ముగించుకున్నారు. అయితే ప్రధానాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వయంభువుల ప్రతిష్ఠ తర్వాత రాజగోపురంపై కలశాలను, సుదర్శన చక్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ జీయర్లు, ఆచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రస్తుతం పూర్తయిన రాజగోపురాలు యాదాద్రికి వచ్చే భక్తులను కనువిందు చేస్తున్నాయి. అలాగే తిరుమాడ వీధులు, ముఖ మండపం, ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టడానికి వైటీడీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త గోపురాలు రానున్న ఆలయ ప్రాకారం -
‘యాదాద్రి’కి బంగారు, వెండి సొబగులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బంగారు, వెండి సొబగులు అద్దనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా చిన జీయర్‌స్వామి ఆదేశాల మేరకు ఆగమ శాస్త్రానుసారంగా స్వయంభూమూర్తుల గర్భాలయంపై ఉన్న విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభానికి బంగారం, ద్వారాలు, బలిపీఠానికి వెండి తొడుగులు వేయనున్నారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో బలిపీఠం ఉంటుంది. అష్టదిక్పాలకులకు అవసరమైన ఆహారం ఉం చేందుకు ఏర్పాటు చేసేదే బలిపీఠం. బంగారు తాపడం చేసే ధ్వజస్తంభ వేదిక, బలిపీఠం ఈ బృహత్తర ప్రణాళికకు రూ.50 కోట్లు వెచ్చించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందులో విమాన రాజగోపురం, ధ్వజస్తంభానికి రూ.35 కోట్లు, ద్వారాలు, బలిపీఠానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నారు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం వీటికి రాగి తొడుగులను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి దేవస్థానంలో ప్రస్తుతం సుమారు 10 కిలోల బంగారం, సుమారు 1,600 కేజీల వెండి ఉంది. కాగా, విమాన రాజగోపురానికి సుమారు 30 కేజీల బంగారం, ధ్వజస్తంభానికి సుమారు 10 కేజీల బంగారం, ఆలయ ద్వారాలు, బలిపీఠానికి తొడుగులకోసం సుమారు 2 వేల కేజీల వెండి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతపెద్ద మొత్తం బంగారం, వెండి దేవస్థానంలో అందుబాటులో లేదని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి తెలియజేశారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బంగారాన్ని, వెండిని వైటీడీఏకు అప్పగించి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికలను అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ పనులన్నీ అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అధికారులు ముందుగా విమాన రాజగోపురం సహా అన్ని రాజగోపురాల పనులను పూర్తి చేసి ప్రతిష్ఠ నాటికి ఈ కార్యక్రమాలను చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శనానికి వచ్చే భక్తులను కట్టడి చేస్తూ పనులను ఎలా చేయాలన్నదానిపై అధికారులు మీమాంసలో ఉన్నారు. ఎలాగైనా తిరుమల తరహాలో విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు, వెండిరేకులను తాపడం చేసి, స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు.. ఆధ్యాత్మిక ఆనందం, కనువిందు కలిగించాలని వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్‌ను కలసి ప్రణాళికలు వివరించాలని సమాలోచనలు చేస్తున్నారు. -
యాదాద్రికి ఎల్ఈడీ వెలుగులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అత్యాధునిక హంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్ఈడీ లైట్లతోపాటు ఏసీ చిల్లర్స్, అగ్నిమాపక యంత్రాలు, సీసీ కెమెరాలు, సీసీ టీవీలను అమర్చనున్నారు. యాదాద్రిని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలన్న ప్రణాళికలో భాగంగా ఒక్కో హంగును సమకూరుస్తున్నారు. అవసరమైన విద్యుత్ పరికరాలను వివిధ దేశాలనుంచి ప్రత్యేక సంస్థల ద్వారా దిగుమతి చేసుకునే పనుల్లో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు. కొండపై ప్రత్యేకంగా రెండు సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. మెట్లదారిలో సుమారు రూ.15 కోట్ల ఖర్చుతో 1600 కేవీ సబ్‌స్టేషన్, అలాగే 1000 కేవీ కెపాసిటీ గల మరో సబ్‌స్టేషన్ గోశాలవద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రధానాలయంలో సౌండ్ సిస్టం, కేబుల్, విద్యుత్ దీపాలు, ఏసీల అమరికను ప్రత్యేకం గా చేపడుతున్నారు. గర్భాలయం, ముఖ మండపం, గిరి ప్రదక్షిణం, సత్యనారాయణవ్రత మండపం, ఆలయ తిరుమాడ వీధులు, దక్షిణ ప్రాకార మండపం వంటి ప్రాంతాలలో విద్యుత్లైట్లకు సంబంధించిన కేబుళ్లను పూర్తిగా భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయంలో 600 టీఆర్ సామర్థ్యం గల ఏసీలను అమర్చుతున్నారు. ఆలయంలో అమర్చే లైట్లన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. ఆలయ తిరుమాడ వీధులు, శివాలయం, సత్యనారాయణవ్రత మండపం వంటి ప్రదేశాలలో హైమాస్ట్ లైట్లతో వెలుగులు నింపే విధంగా ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రికి మూడో కన్నుగా కెమెరాలు దేవస్థానంలో ఏ మూలాన ఏమి జరిగినా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ప్రధానాలయంలో మొత్తంగా 65 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు కోటిన్నర రూపాయలతో జర్మనీనుంచి సీసీ కెమెరాలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కెమెరాలను 10 టీవీలకు అనుసంధానించనున్నారు. భద్రతకు సంబంధించిన పరికరాలన్నీ జర్మనీ, జపాన్, స్వీడన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాదాద్రి రాజగోపురాలు ఎంత దూరం నుంచి చూసినా లైట్ల వెలుతురులో అందంగా కనపడే విధంగా ప్రత్యేక షేడింగ్ లైట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆధునిక ఏసీల ఏర్పాటు గర్భాలయంలో అత్యాధుక ఏసీ చిల్లర్స్‌ను అమర్చనున్నారు. ఈ ఏసీ చిల్లర్స్కు కొండపైన గల పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి అందులో ఈ మిషన్ నుంచి గర్భాలయంలోకి పైపుల ద్వారా శీతలగాలిని వదులుతారు. గర్భాలయం మొత్తం చల్లగా మారుతుంది. గంటపాటు నిర్విరామంగా ఏసీని వదులుతే మూడు గంటలపాటు చల్లదనం ఉంటుందని చెబుతున్నారు. ఈ మిషన్లన్నీ కూడా జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. సంవత్సరం తర్వాత యాదాద్రి దేవస్థానం అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే ఆధునిక అగ్నిమాపక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
శివాలయం, ప్రధానాలయం ఒకేసారి ప్రారంభం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మితమవుతున్న శివాలయం, స్వామి వారి గర్భాలయం రెండు ఒకేసారి ప్రారంభించడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గర్భాలయ ప్రతిష్ట చేసే తేదీలను చినజీయర్ స్వామి ప్రకటించడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రధానాలయంలోని గర్భాలయంలో స్వయంభూ మూర్తుల వద్ద ఫ్లోరింగ్ చేసి బండలు వేస్తున్నారు. ప్రధాన ముఖ మండపంలో పనులన్నీ పూర్తయ్యాయి. బయట ఉన్న అష్టబుజి మండపం, ఆలయ ప్రాకారం పనులు, రెండో ప్రాకారం పనులు జరుగుతున్నాయి. వీటిని మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. శివాలయం పనులు: శివాలయంలో ప్రస్తుతం రాజగోపురాలు, ప్రధాన ద్వారం, చుట్టూ ప్రాకారం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే రెండు ఆలయాల ప్రతిష్ట కార్యక్రమాలను ఒకేసారి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జనవరిలోనే ప్రధానాలయం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆలయ పనుల పరిశీలన: తిరుమాడ వీధులు, రాజగోపురాలు, నూతన ప్రధానాలయం పనులను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. -
దివ్య..యాదాద్రి
యాదగిరికొండను సందర్శించిన వైటీడీఏ బృందం ఆలయ పరిసరాల పరిశీలన చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధ్యయనం యాదగిరికొండ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం వైటీడీఏ అధికారులు సందర్శించారు. ఈ సదర్భంగా వారు ఆలయ పరిసరాల్లో కలి యతిరిగారు. సంగీత భవనం, విష్ణు పుష్కరిణి, శ్రీచక్రకాంప్లెక్స్, గర్భాలయం, దక్షిణ ప్రాకార మండపం తదితర ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులపై అధ్యయం చేశారు. కొండపై చేపట్టనున్న పనులుకొండపైన గల 14 ఎకరాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ 20 అంశాలతో కూడిన ప్రణాళిక ఇచ్చారని వైటీడీఏ వైఎస్ చెర్మైన్ తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆయన ఆండాలు నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండపై చేపట్టనున్న పనుల వివరాలను వెల్లడించారు. తొలుత గర్భాలయం చుట్టూ 5 ఎకరాల స్థలంలో తిరుమాడ వీధులు, ఆలయ ప్రాకారం నిర్మించిన తర్వాత విష్ణు పుష్కరిణిని విశాలంగా తయారు చేస్తామన్నారు. ఆలయాన్ని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకుండా చుట్టూ ఉన్న గోడలను తీసివేసి వాటిస్థానంలో రాతి కట్టడాలను నిర్మిస్తామని చెప్పారు. కొండపైన వీఐపీలు, భక్తులకు సంబంధించి 7వేల కార్లు నిలిపేవిధంగా పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వీఐపీలకు గెస్టు హౌస్‌లు, మూడున్నర ఎకరాలలో భక్తుల సౌకర్యార్థం గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. భక్తులు కొండపైన బస్సు దిగిన వెంటనే ముందుగా ఆలయానికి రావడానికి ముందుగా మొక్కులు చెల్లించుకుని తలనీలాలు తీయించుకునే వారికోసం కల్యాణ కట్టలోకి వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని, అక్కడి నుంచి నేరుగా క్యూలైన్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు, కల్యాణ కట్ట భవనం కింది భాగంలో అన్నదానం ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షమంది పట్టే విధంగా కల్యాణ మండపం, ఈశాన్య లేదా ఆగ్నేయ దిశలో రథ మండపం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండకింద భాగంలో గిరి ప్రదక్షిణం చేసే వారికోసం ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, వివాహాల కోసం కల్యాణ మండపాలను కొండకింద నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా గుట్టకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి అందులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని, రాయగిరి కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజి గోపాల్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్కిటెక్టు అధికారులు, ఆనంద్‌సాయి, రాజు, దేవస్థానం చెర్మైన్ నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆర్అండ్బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పది రోజుల్లో పనులు ప్రారంభం యాదగిరికొండపై చేపట్టనున్న అభివృద్ధి పనులన్నీ మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మూడు సంవత్సరాలలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ధృడ సంకల్పంతో ఉన్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు.