యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అత్యాధునిక హంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌ఈడీ లైట్లతోపాటు ఏసీ చిల్లర్స్, అగ్నిమాపక యంత్రాలు, సీసీ కెమెరాలు, సీసీ టీవీలను అమర్చనున్నారు. యాదాద్రిని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలన్న ప్రణాళికలో భాగంగా ఒక్కో హంగును సమకూరుస్తున్నారు. అవసరమైన విద్యుత్ పరికరాలను వివిధ దేశాలనుంచి ప్రత్యేక సంస్థల ద్వారా దిగుమతి చేసుకునే పనుల్లో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు. కొండపై ప్రత్యేకంగా రెండు సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. మెట్లదారిలో సుమారు రూ.15 కోట్ల ఖర్చుతో 1600 కేవీ సబ్‌స్టేషన్, అలాగే 1000 కేవీ కెపాసిటీ గల మరో సబ్‌స్టేషన్ గోశాలవద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రధానాలయంలో సౌండ్ సిస్టం, కేబుల్, విద్యుత్ దీపాలు, ఏసీల అమరికను ప్రత్యేకం గా చేపడుతున్నారు. గర్భాలయం, ముఖ మండపం, గిరి ప్రదక్షిణం, సత్యనారాయణవ్రత మండపం, ఆలయ తిరుమాడ వీధులు, దక్షిణ ప్రాకార మండపం వంటి ప్రాంతాలలో విద్యుత్‌లైట్లకు సంబంధించిన కేబుళ్లను పూర్తిగా భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయంలో 600 టీఆర్ సామర్థ్యం గల ఏసీలను అమర్చుతున్నారు.
ఆలయంలో అమర్చే లైట్లన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. ఆలయ తిరుమాడ వీధులు, శివాలయం, సత్యనారాయణవ్రత మండపం వంటి ప్రదేశాలలో హైమాస్ట్ లైట్లతో వెలుగులు నింపే విధంగా ఎల్‌ఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రికి మూడో కన్నుగా కెమెరాలు దేవస్థానంలో ఏ మూలాన ఏమి జరిగినా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ప్రధానాలయంలో మొత్తంగా 65 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు కోటిన్నర రూపాయలతో జర్మనీనుంచి సీసీ కెమెరాలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కెమెరాలను 10 టీవీలకు అనుసంధానించనున్నారు. భద్రతకు సంబంధించిన పరికరాలన్నీ జర్మనీ, జపాన్, స్వీడన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాదాద్రి రాజగోపురాలు ఎంత దూరం నుంచి చూసినా లైట్ల వెలుతురులో అందంగా కనపడే విధంగా ప్రత్యేక షేడింగ్ లైట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఆధునిక ఏసీల ఏర్పాటు
గర్భాలయంలో అత్యాధుక ఏసీ చిల్లర్స్‌ను అమర్చనున్నారు. ఈ ఏసీ చిల్లర్స్‌కు కొండపైన గల పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి అందులో ఈ మిషన్ నుంచి గర్భాలయంలోకి పైపుల ద్వారా శీతలగాలిని వదులుతారు. గర్భాలయం మొత్తం చల్లగా మారుతుంది. గంటపాటు నిర్విరామంగా ఏసీని వదులుతే మూడు గంటలపాటు చల్లదనం ఉంటుందని చెబుతున్నారు. ఈ మిషన్లన్నీ కూడా జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. సంవత్సరం తర్వాత యాదాద్రి దేవస్థానం అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే ఆధునిక అగ్నిమాపక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment