యాదాద్రిలో అద్దాల మండపం పై భాగంలోని స్లాబ్‌ను పరిశీలిస్తున్న టెక్నికల్ సభ్యులు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన వర్షాలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ మండపాల్లోకి వర్షం నీళ్లు వచ్చాయి. ప్రధానంగా అష్టభుజి, అంతర్గత, బాహ్య ప్రాకార మండపాల్లో వర్షం నీళ్లు చేరుతున్నాయి. పంచతల రాజగోపురం వద్ద ఉన్న ప్రాకార మండపంలో నిర్మితం అవుతున్న అద్దాల మండపంలోకి కూడా వాననీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆలయ పునర్‌నిర్మాణ సాంకేతిక కమిటీ సభ్యులు, వైటీడీఏ అధికారులు, ఇంజనీర్లు ఆలయాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ పనులు పూర్తి కాకపోవడంతోనే..
యాదాద్రి ప్రధాన ఆలయంలో చేస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి కాకపోవడంతోనే ఇటీవల కురిసిన వర్షానికి ఆలయం, మండపాల్లోకి నీరు చేరినట్లు తెలుస్తోంది. ఆలయంలో లైటింగ్, ఏసీలు, ఇతర అవసరాలకోసం ప్రస్తుతం వైరింగ్ పనులు జరుగుతున్నాయి. వైర్లు కనిపించకుండా వేసిన పైప్‌లలోకి వర్షం నీళ్లు వెళ్లడంతో అవి ప్రధాన ఆలయంలోకి చేరుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రధాన ఆలయంలోనుంచి నీరు బయటకు వెళ్లేలా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నడుస్తున్నాయి. ఈ పనులు పూర్తి కాకపోవడంతో వాన నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.
రెయిన్ ఫ్రూఫ్ గట్టి పడకపోవడంతో..
అష్టభుజి ప్రాకార మండపం, ఇన్నర్, అవుటర్ ప్రాకార మండపాల్లోని పై భాగంలో ఉన్న స్లాబ్ మధ్యలోని గ్యాప్‌లను డంగు సున్నంతో మూసేశారు. అలాగే స్లాబ్‌పైన వేసిన రెయిన్ ఫ్రూఫ్ గట్టిపడకపోవడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెయిన్ ఫ్రూఫ్ గట్టిపడడానికి సుమారు రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఇలా లీకేజీలు రావడంపై స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యతతో పనులు చేపట్టాలని, లీకేజీలు పునరావృతం కాకుండా వైటీడీఏ అధికారులు, టెక్నికల్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కాగా, ఆలయ నిర్మాణ పనుల్లో రాజీపడేది లేదని ఆలయం ఈవో గీతారెడ్డి స్పష్టం చేశారు.
లీకేజీల పరిశీలన
టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి, స్తపతి ఆనందచారి వేలు, శిల్పులు ఆలయంలో లీకేజీలను పరిశీలించారు. అద్దాల మండపంలోకి నీళ్లు ఎలా చేరాయి అనే అంశంపై శిల్పులతో చర్చించారు. అలాగే రెయిన్ ఫ్రూప్ వేశాక కూడ వర్షం నీళ్లు ఎలా లీక్ అవుతున్నాయని అడిగారు. స్లాబ్‌పై ఏర్పాటు చేసిన రెయిన్ ఫ్రూఫ్ పూర్తిగా గట్టి పడటానికి రెండేళ్ల కాలం పడుతుందని, ప్రస్తుతం జరిగిన లీకేజీలను సరి చేస్తామని టెక్నికల్ కమిటీ సభ్యులకు శిల్పులు తెలిపారు. లీకేజీలపై టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్‌రావు పలువురిని మందలించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment