
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ఆదివారం(ఆగస్టు12) కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోకి వరదనీరు వచ్చింది. అసెంబ్లీకి కొద్ది దూరంలో ఉన్న మంత్రుల బంగ్లాలున్న ప్రాంతంలోనూ భారీగా నీరు నిలిచింది.
గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండక్, కోసి, గంగా, మహానంద, కమల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీశ్‌కుమార్ పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు పడినపుడు వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.