nitishkumar
-
అసెంబ్లీ, మంత్రుల నివాసాలకు వరద నీరు
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ఆదివారం(ఆగస్టు12) కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోకి వరదనీరు వచ్చింది. అసెంబ్లీకి కొద్ది దూరంలో ఉన్న మంత్రుల బంగ్లాలున్న ప్రాంతంలోనూ భారీగా నీరు నిలిచింది. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండక్, కోసి, గంగా, మహానంద, కమల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీశ్‌కుమార్ పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు పడినపుడు వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఫలితాల తర్వాత నితీష్ ఏదైనా చేయొచ్చు: తేజస్వి
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు. -
జేడీయూలో అసమ్మతి.. షాకిచ్చిన ఎంపీ!
పట్నా: జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ మరోసారి బీజేపీతో చేతులు కలిపి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నిన్నసాయంత్రం అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామాచేసి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కూటమికి వీడ్కోలు పలికి.. మళ్లీ పాత దోస్త్ బీజేపీతో జట్టు కట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో నరేంద్రమోదీ ఎదుగదలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీతో నితీశ్ తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యారు. బిహార్‌లో మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు లాలూ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి సరికొత్త కూటమిని నితీశ్ తెరపైకి తెచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆర్జేడీకి అత్యధికంగా 80 స్థానాలు రాగా, జేడీయూకి 71 స్థానాలు దక్కాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నితీశ్‌కుమార్.. లాలూ కుటుంబంపై సీబీఐ దాడులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో మహాకూటమితో తెగదెంపులు చేసుకొని.. హుటాహుటీన బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇలా మరోసారి కమలదళంతో నితీశ్‌కుమార్ చేతులు కలుపడంపై ఆయన సొంత పార్టీ జేడీయూలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. నితీశ్ నిర్ణయాన్ని తాజాగా జేడీయూ ఎంపీ అలీ అన్వర్ వ్యతిరేకించారు. నితీశ్ మరోసారి బీజేపీతో కలువడాన్ని తన అంతరాత్మ ఒప్పుకోవడం లేదని, అందుకు తాను దీనిని సమర్థించడం లేదని అలీ అన్వర్ మీడియాకు తెలిపారు. నితీశ్ తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించారని, తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం తాను నడుచుకుంటానని ఆయన చెప్పారు. తనకు అవకాశం ఇస్తే ఈ విషయాన్ని పార్టీ వేదికలో లేవనెత్తుతానని అన్నారు. -
నితీష్ సర్కార్‌పై కాంగ్రెస్ గుస్సా!
న్యూఢిల్లీ: బిహార్‌లోని నితీశ్‌కుమార్ సర్కార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ చిక్కుల్లో పడేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలన బ్రిటీష్ పాలకుల కంటే ఘోరంగా ఉందంటూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రచురించడం నితీశ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారును ఇబ్బందుల్లో పడేసింది. నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ కథనంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. బిహార్ చరిత్ర కథనంలో భాగంగా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ నియంతృత్వ, అణచివేత పాలన కొనసాగించారని, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ సాగించిన ప్రజాస్వామిక పోరాటం మళ్లీ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాదులు వేసిందని వెబ్సైట్లో పేర్కొనడం సంకీర్ణ పక్షాల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఈ కథనంలో ఇందిరాగాంధీకి సంబంధించిన వ్యాఖ్యలను తాము ఎంతమాత్రం ఆమోదించబోమని కాంగ్రెస్ నేత చందన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయం సీఎం నితీశ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బిహార్ కాంగ్రెస్ చీఫ్, విద్యాశాఖ మంత్రి అశోక్ కుమార్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మరోవైపు అధికార జేడీయూ మాత్రం వెబ్‌సైట్‌లోని చారిత్రక అంశాల్లో ఎలాంటి తప్పు లేదని, చారిత్రక అంశాలను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడం సరికాదని చెప్తోంది. -
'బిహార్‌లో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు'
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం రెండేళ్లకు మించి పనిచేయకపోవచ్చునని, కచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై శనివారం ఆయన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి ఎన్నికల్లో కులంకార్డును ప్రయోగించిందని, ఇది దీర్ఘకాలంలో పనిచేయబోదని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలువగా, జేడీయూ రెండోస్థానంలో నిలిచిందని, ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఆధిపత్యం కోసం కొట్లాడుతాయని, దీంతో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జట్టు కట్టిన ఎల్జేపీ 40 సీట్లలో పోటీచేసి.. ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుపొందింది. ఎజ్జేపీ రాష్ట్ర అధ్యక్షుడు పశుపతికుమార్ ప్రాస్‌తోపాటు పాశ్వాన్ సోదరుడు, ఆయన ఇద్దరు అల్లుళ్లు, మేనల్లుడు, పలువురు బంధువులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. -
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
-
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్లో నితీశ్, లాలుకు అభినందనలు తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జత నితీశ్, లాలు అపూర్వ విజయాన్ని సాధించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సందర్భంగా నితీశ్, లాలును వైఎస్ జగన్ అభినందించారు. -
ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం: నితీశ్‌కుమార్
పట్నా: బిహార్ ఎన్నికల్లో మహాకూటమికి అధికారం అప్పగించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అభినందనలు తెలిపారు. మహాకూటమికి గట్టి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో నితీశ్‌కుమార్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పటిష్టమైన ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన సజావుగా ఉంటుందని, రాష్ట్రంలో తాము ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. బిహార్ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇది ప్రజల విజయం, మహాకూటమి విజయం అని పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ముందుగా అందరికీ స్వాగతం బిహార్ ప్రజలకు అభినందనలు బిహార్ స్వాభిమానం విజయం ఇది మహాకూటమికి బిహార్ ప్రజలు మంచి సమర్ధన ఇవ్వడం వల్లే మీముందు మళ్లీ నిలబడ్డాం మీకు చాలా అనుమానాలు రేకెత్తించారు. ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టే ఈ రకం ఫలితాలు వచ్చాయి ఓటర్లకు, బీహార్ ప్రజలకు అభినందనలు మాకు అన్ని వర్గాలు.. మహిళలు, యువత, ముస్లింలు, దళితులు, మహాదళితులు, గిరిజనులు.. ఎవరైనా అన్ని వర్గాల నుంచి మద్దతు అందింది ఇందులో ఎవరూ అస్పృశ్యులు లేరు మహాకూటమికి గట్టి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఎన్నికల సమయంలో చాలా దారుణమైన ప్రచారం జరిగింది బిహార్ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ విజ్ఞత నిరూపించుకున్నారు ఇది చాలా పెద్ద విజయం. దీన్ని మేం వినమ్రంగా స్వీకరిస్తున్నాం ప్రజల మనసులో కొన్ని ఆశలు ఉన్నట్లు తెలుస్తోంది బిహార్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వేగంగా వెళ్లాలని అనుకున్నారు మేమంతా దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ప్రజల ఆశలకు అనుగుణంగానే పనిచేస్తాం మేం ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కూడా మహాకూటమిలో మూడు పార్టీలు గట్టిగా నిర్ణయించుకున్నాం మా కూటమిని ప్రజలు ఆమోదించారు. ఈ మాండేట్ ప్రకారమే మేం పనిచేస్తాం మా మనసులో బిహార్‌లో ఎవరిపట్లా ఎలాంటి విభేదాలు ఉండవు ఎన్నికల సమయంలో ఎవరు ఏమన్నా కూడా ఆ ప్రభావం ఆ తర్వాత ఉండదు పాజిటివ్ భావనతోనే మేం పనిచేస్తాం దేశం మొత్తం ఈ ఎన్నికల వైపు చూసింది ఈరోజు పొద్దున్నే చాలా రకాల కథనాలు వచ్చాయి.. వాటిని చూసి దేశ ప్రజలు రకరకాలుగా భావించారు ఫోన్లు కూడా చేసి ఆందోళన వ్యక్తం చేశారు కానీ తర్వాత మా విజయం ఖాయమైన తర్వాత దేశ ప్రజల మనసు ఊరట పొందింది పటిష్ఠమైన ప్రతిపక్షం ఉంటేనే పాలన కూడా బాగా సాగుతుంది బిహార్‌లో ఫలితాలు బాగా వస్తే, దీని ప్రభావం దేశం మొత్తమ్మీద ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అధికారం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం బలహీనంగా ఉండాలని ఎవరూ అనుకోరు మేం ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం, ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాం ప్రతిపక్షాన్ని మేం గేలి చేస్తామని ఎవరూ అనుకోవక్కర్లేదు ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరేలా పాలన సాగిస్తాం ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు కేంద్రం కూడా బిహార్ అభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తున్నాం సోనియా, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, చంద్రబాబు, కేజ్రీవాల్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ములాయం సింగ్ యాదవ్, సుశీల్ కుమార్ మోదీ అందరూ అభినందించారు.. వాళ్లకు కృతజ్ఞతలు. ట్విట్టర్ ద్వారా కూడా అభినందనలు తెలిపినవాళ్లకు సైతం కృతజ్ఞతలు. మొదటి నుంచి మేమంతా ఒకే మాటమీద ఉన్నాం, ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేయాలో కూడా ముందే నిర్ణయించుకున్నాం. మూడు పార్టీల అభ్యర్థులందరి పేర్లు కలిపి ఒకేసారి ప్రకటించాం సమాజంలో విభేదాలు తేవాలన్న ప్రయత్నాలు కొంతవరకు జరిగినా, అవన్నీ విఫలమయ్యాయి -
'నితీశ్ నిజమైన హీరో'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మిత్రపక్షం బీజేపీని దెప్పిపొడుస్తూ శివసేన వ్యాఖ్యలు చేసింది. ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యత వహించాలని పేర్కొంది. అదేసమయంలో బిహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నితీశ్‌కుమార్‌ను నిజమైన హీరోగా పేర్కొంటూ శివసేన ప్రశంసల్లో ముంచెత్తింది. 'కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది సోనియాగాంధీ బాధ్యత అవుతుంది. అదేవిధంగా బిహార్ ఫలితాలను ప్రధాని మోదీ బాధ్యతగా బీజేపీ తప్పక అంగీకరించాలి' అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 'ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు వచ్చినా ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయి. ఎన్నికలకు మేం భయపడటం లేదు' అని ఆయన అన్నారు. రాజకీయ హీరోగా అవతరించిన నితీశ్‌కుమార్‌కు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలిపారని చెప్పారు. -
'వాళ్లకు జిన్నా భూతం పట్టింది'
పాట్నా: కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు బిహార్‌ను పాకిస్థాన్‌లాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రేతాత్మ వారిలోకి ప్రవేశించడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 'జిన్నాభూతం నితీశ్, లాలూలోకి ప్రవేశించింది. వారు బిహార్‌ను పాకిస్థాన్ చేయాలనుకుంటున్నారు' అని ఆయన శనివారం పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్‌లో బాణాసంచా పేల్చి సంబురాలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం ఇష్టంలేనివారు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
'లాలూ తాంత్రికుడు'
బిహార్‌ను, బిహార్ ప్రజలను కాపాడటానికి ప్రజాస్వామ్యం చాలు అని, ఏ తాంత్రికత అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓ తాంత్రికుడిని కలిసి.. అతన్ని కౌగిలించుకున్న వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో మోదీ ఆయనపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదేవిధంగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌పైనా మోదీ విరుచుకుపడ్డారు. లాలూ ఒక తాంత్రికుడని, ఆయన పార్టీ 'రాష్ట్రీయ జాడు టోనా పార్టీ' అని విమర్శించారు. బిహార్ అభివృద్ధికి ప్రజలు ఈ ఎన్నికల్లో పాలుపంచుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మూడో దశ పోలింగ్ తేదీ ముంచుకొస్తున్న నేపథ్యంలో బీహార్‌లోని నలందా జిల్లాలో ఆదివారం ఆయన ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీహార్ సీఎం నితీశ్ ఏడు సంకల్పాలు ప్రకటించగా.. అందుకు ప్రతిగా మోదీ ఆరు సూత్రాలను ప్రకటించారు. అభివృద్ధికి కీలకమైన మూడు సూత్రాలు బిజిలీ, సడక్, పానీ (విద్యుత్, రోడ్డు, నీరు) ఓ పథకాన్ని ప్రకటించారు. అలాగే యువత, వృద్ధుల కోసం యువత చదువు, యువతకు ఉపాధి, వృద్ధులకు ఆరోగ్యం, వైద్యం పేరిట మరో పథకాన్ని ప్రకటించారు. -
బిహార్ పగ్గాలు మళ్లీ నితీశ్‌కుమార్ కే
విశ్వాస పరీక్షకు ముందు మాంఝీ రాజీనామా తన మద్దతుదారులకు {పాణహాని ఉంది కనుకే పరీక్షకు వెళ్లలేదని వివరణ రేపు నాలుగోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం పట్నా: బిహార్ రాజకీయ సంక్షోభానికి శుక్రవారం తెరపడింది. జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్ ఆదివారం తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. శుక్రవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ రెబల్ నేత జితన్‌రాం మాంఝీ.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కొద్దిసేపు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. పరీక్షలో ఓటమి తప్పదని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు మెజారిటీ ఉందని, అయితే తనవైపున్న ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉండడంతో పరీక్షకు వెళ్లకుండా పదవి నుంచి తప్పుకున్నానన్నారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ నితీశ్.. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ వద్దకు వెళ్లారు. గవర్నర్‌తో గంటన్నర భేటీ అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద, తర్వాత తన నివాసంలోను విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రోజు మళ్లీ చెప్పాం. ఆయన ఆమోదం తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయడానికి రావాలని నన్ను ఆహ్వానించారు. మూడు వారాల్లోపు మార్చి 16లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని అడిగారు’ అని చెప్పారు. మీకు మద్దతిచ్చే పార్టీలు మీ ప్రభుత్వంలో చేరతాయా అని విలేకర్లు అడగ్గా, స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తాను సీఎం పదవి నుంచి తప్పుకుని మాంఝీని ఆ పీఠమెక్కించి తప్పు చేశానని, అందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘ఉద్వేగ నిర్ణయాలతో తిరిగి అలాంటి తప్పెన్నడూ చేయనని హామీ ఇస్తున్నాను. సుపరిపాలన అందిస్తాను’ అని చెప్పారు. పిడికెడు మంది అసంతృప్త జేడీయూ ఎమ్మెల్యేలను తనపైకి ఉసిగొల్పిన బీజేపీ పథకం విఫలమైందని అన్నారు. దళితుడినంటూ మాంఝీ ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. దళితుల్లో నిరుపేదలకు ప్రత్యేక సంక్షేమం కోసం మహాదళిత పదాన్ని సృష్టించింది తానేనన్నారు. మాంఝీ రాజీనామాపై స్పందిస్తూ.. జేడీయూను చీల్చేందుకు వేసిన జిత్తులన్నీ పారకపోవడంతో తప్పుకున్నారన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లడానికి ముందు నితీశ్ జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కలుసుకున్నారు. నితీశ్ వెంట రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో జేడీయూ రాష్ట్ర చీఫ్ వశిష్ట, ఆర్జేడీ రాష్ట్ర చీఫ్ పూర్బే, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ అశోక్ తదితరులు ఉన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. మాంఝీని సీఎంను చేయడం, విభేదాలు వల్ల నితీశ్‌ను జేడీయూ ఎల్పీనేతగా ఎన్నుకోవడం, మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. ఇబ్బందులు పడొద్దనే..: మాంఝీ మాంఝీ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేశారు. దీంతో విశ్వాస పరీక్షకు ముందు ఉభయ చట్టసభలనుద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగాన్ని గవర్నర్ రద్దు చేసుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల వల్ల గవర్నర్ ప్రసంగం రద్దయిందని స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి అసెంబ్లీలో ప్రకటించి, సభను నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ భేటీని ఎగ్గొట్టిన మాంఝీ తనింట్లో విలేకర్లతో మాట్లాడారు. ‘నాకు 140 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. వారికి రక్తపాతం, వేధింపుల ముప్పు ఉంది. హత్యా బెదిరింపులొచ్చాయి. వారు అసెంబ్లీ సభ్యత్వాలు కోల్పోవడం నాకిష్టం లేదు’ అన్నారు. ఒకరి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న స్పీకర్ రహస్య బ్యాలెట్‌కు ఒప్పుకోరని తెలిశాక తన మద్దతుదారులను ప్రమాదంలో పడేయడం మంచికాదని అనుకున్నానన్నారు. ‘నితీశ్ ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అర్ధరాత్రి దాటాక నా ఇంటికి వెనక తలుపు గుండా వచ్చారు. వారి ముఖాల్లో భయం కనిపించింది. విశ్వాస పరీక్షకు వెళ్లి వారిని నితీశ్ వర్గం ముందు బహిర్గతం చేసి ఇబ్బందుల్లోకి నెట్టకూడదనుకున్నా’ అని చెప్పారు. జేడీయూకు చెందిన 40 నుంచి 52 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, అయితే నితీశ్ అంటే భయం వల్ల వారు తనతో కలసికనిపించడానికి ఇష్టపడ్డం లేదని అన్నారు. ‘రూ. 2కోట్లు, మంత్రి పదవి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచైనా టికెట్ ఇస్తామని నితీశ్వర్గం చెప్పినట్లు ఎమ్మెల్యేలు నాకు తెలిపారు’ అని అన్నారు. కొత్త పార్టీ పెడతారా అని విలేకర్లు అడగ్గా, ఈ నెల 28న తన నివాసంలో తన మద్దతుదారులతో భేటీ నిర్వహిస్తానని, అలాంటి అభిప్రాయం వస్తే పరిశీలిస్తానని చెప్పారు. విలేకర్ల సమావేశంలో మాంఝీ పక్కనమొత్తం ఒక 8 మంది మంత్రులు(ఏడుగురు జేడీయూ, ఒక స్వతంత్రుడు) ఉన్నారు. కాగా, మాంఝీకి చివరి నిమిషంలో మద్దతు ప్రకటించిన బీజేపీ.. ఆయన అధికారం కోల్పోయినా గెలుపు ఆయనదేనని పేర్కొంది. నాలుగోసారి సీఎంగా... నితీశ్ సీఎం పదవి చేపట్టనుండడం ఇది నాలుగోసారి. తొలిసారి 2000 మార్చి 3న ముఖ్యమంత్రి అయిన ఆయన వారం రోజులకే రాజీనామా చేశారు. 2005 నవంబర్ 24న రెండోసారి ఆ పగ్గాలు అందుకుని 2010 నవంబర్ 24 వరకు అధికారంలో ఉన్నారు. 2010 నవంబర్ 26న మూడోసారి ఆ పదవి చేపట్టి 2014 మే వరకు కొనసాగారు. 2014త లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి, సీఎం పదవిని తన శిష్యుడైన మాంఝీకి అప్పగించారు.