'లాలూ తాంత్రికుడు'
బిహార్‌ను, బిహార్ ప్రజలను కాపాడటానికి ప్రజాస్వామ్యం చాలు అని, ఏ తాంత్రికత అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓ తాంత్రికుడిని కలిసి.. అతన్ని కౌగిలించుకున్న వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో మోదీ ఆయనపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదేవిధంగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌పైనా మోదీ విరుచుకుపడ్డారు. లాలూ ఒక తాంత్రికుడని, ఆయన పార్టీ 'రాష్ట్రీయ జాడు టోనా పార్టీ' అని విమర్శించారు. బిహార్ అభివృద్ధికి ప్రజలు ఈ ఎన్నికల్లో పాలుపంచుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
మూడో దశ పోలింగ్ తేదీ ముంచుకొస్తున్న నేపథ్యంలో బీహార్‌లోని నలందా జిల్లాలో ఆదివారం ఆయన ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీహార్ సీఎం నితీశ్ ఏడు సంకల్పాలు ప్రకటించగా.. అందుకు ప్రతిగా మోదీ ఆరు సూత్రాలను ప్రకటించారు. అభివృద్ధికి కీలకమైన మూడు సూత్రాలు బిజిలీ, సడక్, పానీ (విద్యుత్, రోడ్డు, నీరు) ఓ పథకాన్ని ప్రకటించారు. అలాగే యువత, వృద్ధుల కోసం యువత చదువు, యువతకు ఉపాధి, వృద్ధులకు ఆరోగ్యం, వైద్యం పేరిట మరో పథకాన్ని ప్రకటించారు.