భాగల్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను తెలియజేస్తూ, దేశ ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇదేవిధంగా ప్రధాని విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం ‘పరీక్షా పర్ చర్చ’(పరీక్షలపై చర్చ) కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు.
ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన చిన్నారులు ప్రధాని మోదీతో సంభాషించే అవకాశాన్ని పొందుతారు. బీహార్‌కు చెందిన సుపర్ణ అనే బాలిక ఈ కార్యక్రమానికి ఎంపిక అయిన వారిలో ఒకరు. ఈ చిన్నారి బీహార్‌లోని భాగల్పూర్‌లోని సాహెబ్‌గంజ్‌లో కుటుంబంతో పాటు ఉంటోంది. అధికారుల ఇంటర్వ్యూ అనంతరం ఆ చిన్నారి ఎంపికయ్యింది. దీంతో ఆమె ‘పరీక్షా పర్ చర్చ’ కార్యక్రమంలో పాల్గొని, ప్రధాని మోదీని పలు సందేహాలు అడగనున్నారు.
సుపర్ణ సిన్హా మీడియాతో మాట్లాడుతూ తాను భాగల్పూర్‌లోని గవర్నమెంట్ గర్ల్స్ ఇంటర్ లెవల్ హై స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నానని చెప్పింది. ఈ కార్యక్రమానికి తనను ఎంపిక చేసిన అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపింది. కాగా ప్రతి సంవత్సరం బోర్డు పరీక్షలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షల గురించి చర్చిస్తారు. దీనికి తొలుత ‘ఎగ్జామ్ వారియర్స్’ అని పేరు పెట్టారు. పరీక్షలకు ముందు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యం.
ఈ కార్యక్రమంలో పొల్గొనేందుకు తొలుత విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ ప్రొఫెసర్లు ఈ ఇంటర్వ్యూ చేస్తారు. అనంతరం విద్యార్థులను ఎంపికచేస్తారు. ఈ విధంగా ఎంపికైన సుపర్ణ బోర్డు పరీక్షల్లో తనకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకోనున్నారు. ఈ కార్యక్రమం జరిగే తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం త్వరలోనే వెల్లడించనుంది. గత ఏడాది ఈ కార్యక్రమం జనవరి 29న జరిగింది.
ఇది కూడా చదవండి: ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం
Comments
Please login to add a commentAdd a comment