విశ్వాస పరీక్షకు ముందు మాంఝీ రాజీనామా
తన మద్దతుదారులకు
{పాణహాని ఉంది కనుకే పరీక్షకు వెళ్లలేదని వివరణ
రేపు నాలుగోసారి
సీఎంగా నితీశ్ ప్రమాణం
పట్నా: బిహార్ రాజకీయ సంక్షోభానికి శుక్రవారం తెరపడింది. జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్ ఆదివారం తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. శుక్రవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జేడీయూ రెబల్ నేత జితన్‌రాం మాంఝీ.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కొద్దిసేపు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. పరీక్షలో ఓటమి తప్పదని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు మెజారిటీ ఉందని, అయితే తనవైపున్న ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉండడంతో పరీక్షకు వెళ్లకుండా పదవి నుంచి తప్పుకున్నానన్నారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ నితీశ్.. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ వద్దకు వెళ్లారు. గవర్నర్‌తో గంటన్నర భేటీ అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద, తర్వాత తన నివాసంలోను విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రోజు మళ్లీ చెప్పాం. ఆయన ఆమోదం తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయడానికి రావాలని నన్ను ఆహ్వానించారు. మూడు వారాల్లోపు మార్చి 16లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని అడిగారు’ అని చెప్పారు. మీకు మద్దతిచ్చే పార్టీలు మీ ప్రభుత్వంలో చేరతాయా అని విలేకర్లు అడగ్గా, స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తాను సీఎం పదవి నుంచి తప్పుకుని మాంఝీని ఆ పీఠమెక్కించి తప్పు చేశానని, అందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘ఉద్వేగ నిర్ణయాలతో తిరిగి అలాంటి తప్పెన్నడూ చేయనని హామీ ఇస్తున్నాను. సుపరిపాలన అందిస్తాను’ అని చెప్పారు. పిడికెడు మంది అసంతృప్త జేడీయూ ఎమ్మెల్యేలను తనపైకి ఉసిగొల్పిన బీజేపీ పథకం విఫలమైందని అన్నారు. దళితుడినంటూ మాంఝీ ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. దళితుల్లో నిరుపేదలకు ప్రత్యేక సంక్షేమం కోసం మహాదళిత పదాన్ని సృష్టించింది తానేనన్నారు. మాంఝీ రాజీనామాపై స్పందిస్తూ.. జేడీయూను చీల్చేందుకు వేసిన జిత్తులన్నీ పారకపోవడంతో తప్పుకున్నారన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లడానికి ముందు నితీశ్ జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కలుసుకున్నారు. నితీశ్ వెంట రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో జేడీయూ రాష్ట్ర చీఫ్ వశిష్ట, ఆర్జేడీ రాష్ట్ర చీఫ్ పూర్బే, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ అశోక్ తదితరులు ఉన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. మాంఝీని సీఎంను చేయడం, విభేదాలు వల్ల నితీశ్‌ను జేడీయూ ఎల్పీనేతగా ఎన్నుకోవడం, మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే.
ఇబ్బందులు పడొద్దనే..: మాంఝీ
మాంఝీ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేశారు. దీంతో విశ్వాస పరీక్షకు ముందు ఉభయ చట్టసభలనుద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగాన్ని గవర్నర్ రద్దు చేసుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల వల్ల గవర్నర్ ప్రసంగం రద్దయిందని స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి అసెంబ్లీలో ప్రకటించి, సభను నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ భేటీని ఎగ్గొట్టిన మాంఝీ తనింట్లో విలేకర్లతో మాట్లాడారు. ‘నాకు 140 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. వారికి రక్తపాతం, వేధింపుల ముప్పు ఉంది. హత్యా బెదిరింపులొచ్చాయి. వారు అసెంబ్లీ సభ్యత్వాలు కోల్పోవడం నాకిష్టం లేదు’ అన్నారు. ఒకరి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న స్పీకర్ రహస్య బ్యాలెట్‌కు ఒప్పుకోరని తెలిశాక తన మద్దతుదారులను ప్రమాదంలో పడేయడం మంచికాదని అనుకున్నానన్నారు. ‘నితీశ్ ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అర్ధరాత్రి దాటాక నా ఇంటికి వెనక తలుపు గుండా వచ్చారు. వారి ముఖాల్లో భయం కనిపించింది. విశ్వాస పరీక్షకు వెళ్లి వారిని నితీశ్ వర్గం ముందు బహిర్గతం చేసి ఇబ్బందుల్లోకి నెట్టకూడదనుకున్నా’ అని చెప్పారు. జేడీయూకు చెందిన 40 నుంచి 52 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, అయితే నితీశ్ అంటే భయం వల్ల వారు తనతో కలసికనిపించడానికి ఇష్టపడ్డం లేదని అన్నారు. ‘రూ. 2కోట్లు, మంత్రి పదవి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచైనా టికెట్ ఇస్తామని నితీశ్‌వర్గం చెప్పినట్లు ఎమ్మెల్యేలు నాకు తెలిపారు’ అని అన్నారు. కొత్త పార్టీ పెడతారా అని విలేకర్లు అడగ్గా, ఈ నెల 28న తన నివాసంలో తన మద్దతుదారులతో భేటీ నిర్వహిస్తానని, అలాంటి అభిప్రాయం వస్తే పరిశీలిస్తానని చెప్పారు. విలేకర్ల సమావేశంలో మాంఝీ పక్కనమొత్తం ఒక 8 మంది మంత్రులు(ఏడుగురు జేడీయూ, ఒక స్వతంత్రుడు) ఉన్నారు. కాగా, మాంఝీకి చివరి నిమిషంలో మద్దతు ప్రకటించిన బీజేపీ.. ఆయన అధికారం కోల్పోయినా గెలుపు ఆయనదేనని పేర్కొంది.
నాలుగోసారి సీఎంగా...
నితీశ్ సీఎం పదవి చేపట్టనుండడం ఇది నాలుగోసారి. తొలిసారి 2000 మార్చి 3న ముఖ్యమంత్రి అయిన ఆయన వారం రోజులకే రాజీనామా చేశారు. 2005 నవంబర్ 24న రెండోసారి ఆ పగ్గాలు అందుకుని 2010 నవంబర్ 24 వరకు అధికారంలో ఉన్నారు. 2010 నవంబర్ 26న మూడోసారి ఆ పదవి చేపట్టి 2014 మే వరకు కొనసాగారు. 2014త లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి, సీఎం పదవిని తన శిష్యుడైన మాంఝీకి అప్పగించారు.
బిహార్ పగ్గాలు మళ్లీ నితీశ్‌కుమార్ కే
Published Sat, Feb 21 2015 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement