'బిహార్‌లో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు'
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం రెండేళ్లకు మించి పనిచేయకపోవచ్చునని, కచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై శనివారం ఆయన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి ఎన్నికల్లో కులంకార్డును ప్రయోగించిందని, ఇది దీర్ఘకాలంలో పనిచేయబోదని అన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలువగా, జేడీయూ రెండోస్థానంలో నిలిచిందని, ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఆధిపత్యం కోసం కొట్లాడుతాయని, దీంతో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జట్టు కట్టిన ఎల్జేపీ 40 సీట్లలో పోటీచేసి.. ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుపొందింది. ఎజ్జేపీ రాష్ట్ర అధ్యక్షుడు పశుపతికుమార్ ప్రాస్‌తోపాటు పాశ్వాన్ సోదరుడు, ఆయన ఇద్దరు అల్లుళ్లు, మేనల్లుడు, పలువురు బంధువులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.