'బీహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్ వచ్చేసింది'
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస హత్యల నేపథ్యంలో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీయే చెప్పినవిధంగానే బిహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్' (ఆటవిక రాజ్యం) వచ్చేసిందని మండిపడ్డారు. వరుస హత్యలు జరుగుతున్నా నితీశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిష్క్రియగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
'బిహార్‌లో మళ్లీ జంగల్ రాజ్ వచ్చేసింది. నితీశ్-లాలూ జోడీకడితే బిహార్‌లో మళ్లీ ఆటవిక రాజ్యం వస్తుందని మేం ఎన్నికల ప్రచారంలో చెప్పాం. జంగల్‌రాజ్ కాదు 'మంగళ్ రాజ్' (మంగళకరమైన రాజ్యం) వస్తుందంటూ నితీశ్-లాలూ చెప్పారు. ఇది ఆటవిక రాజ్యామా? లేక మంగళకర రాజ్యమా? అన్నది ఇప్పుడు ప్రజలే చెప్పాలి' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. బిహార్‌లో వరుసగా ఇంజినీరింగ్ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.