సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటుకు జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు రాష్ట్ర బీజేపీ సంకీర్ణ కూటమిలో చిచ్చు పెట్టాయి. బీజేపీ ప్రాభవం పడిపోతున్న విషయాన్ని ఈ ఫలితాల ద్వారా గ్రహించిన నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీలు రాష్ట్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం నాడు నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్‌లు గంటకుపైగా చర్చలు జరిపారు.
ఆ తర్వాత నితీష్ కుమార్ జన్ అధికార పార్టీ నాయకుడు, మధేపుర పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్‌తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కావాలంటూ జేడీయూ బుధవారం నాడు పార్లమెంట్‌లో డిమాండ్ చేసింది. ఆ మేరకు ఓ నోటీసును కూడా అందజేసింది. ఆ డిమాండ్‌కు మద్దతు తెలియజేస్తూ లోక్ జన్‌శక్తి పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిని గ్రహించిన బీజేపీ సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్‌లు పాశ్వాన్‌ను, బీజేపీ ముస్లిం నాయకుడు షా నవాజ్ హుస్సేన్ నితీష్ కుమార్‌ను కలుసుకొని సంప్రదింపులు జరిపారు. బీహార్‌లో మతసామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారికి బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
అయినప్పటికీ నితీష్, పాశ్వాన్‌లు శాంతించలేదు. బిహార్ ఉప ఎన్నికల్లో హిందూ అగ్రవర్ణాల ఓట్ల కోసం బీజేపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టారు. ఇది నితీష్, పాశ్వాన్‌లకు ఎక్కువ కోపం తెప్పించింది. ఎందుకంటే వెనకబడినవారు, దళితులు, మైనారిటీలు వారి సంప్రదాయ ఓటర్లు. బిజేపీ కూటమిలో కొనసాగడం వల్ల అనవసరంగా ఈ వర్గాలను దూరం చేసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ ఇరువురు నాయకులు 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment