తేజస్విపై వేటు:.. లాలూ గేమ్‌ప్లాన్ ఇదే!
- ఆర్జేడీ మంత్రుల మూకుమ్మడి రాజీనామాలు
- నితీశ్ సర్కారు పడిపోకుండా బయటినుంచి సపోర్ట్
పట్నా: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తేజస్వి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్ ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తనకు తానుగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని, సీఎం నితీశ్‌కుమార్ వేటు వేసేవరకు వేచి చూడాలని తేజస్వి భావిస్తున్నారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. తేజస్విపై వేటు వేసిన మరుక్షణమే నితీశ్ కేబినెట్‌లోని ఆర్జేడీ మంత్రులు సైతం మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని, అయినా, సంకీర్ణ ప్రభుత్వానికి బయటనుంచి తమ మద్దతును కొనసాగిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.
సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి రాజీనామా చేస్తే.. లాలూ కుటుంబం ఏదో తప్పుచేసిందన్న భావన పార్టీ శ్రేణుల్లోకి వెళుతుందని, ఇది పార్టీ కేడర్‌ను నైతికంగా దెబ్బతీసే అవకాశముందని, అందుకే తేజస్వి రాజీనామా చేయొద్దని లాలూ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే, పార్టీ గేమ్ ప్లాన్ ప్రకారం.. తేజస్వి నితీశ్ కేబినెట్ నుంచి తొలగించిన మరుక్షణమే.. 11మంది ఆర్జేడీ మంత్రులు సైతం కేబినెట్ నుంచి తప్పుకుంటారని, అయినా, మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా ఆర్జేడీ బయటి నుంచి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు.