ఆధ్యాత్మికతకు నెలవు
నిత్యం వేలాది మంది రాక
ఇబ్బందులు తలెత్తకుండా వసతులు
పర్యాటకంగా, వ్యాపారపరంగా గణనీయమైన వృద్ధి
మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలు
మహా దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి.. చెంతనే తిరుమలను పోలిన స్వర్ణగిరి.. దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ ఆలయాలకు నిత్యం వేలాదిగా వస్తున్న భక్తులతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వీటితో పాటు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్, మత్స్యగిరి, ఇతర ప్రధానాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు.
సాక్షి, యాదాద్రి: జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాదాద్రి, స్వర్ణగిరి క్షేత్రాలకు నిత్యం పోటెత్తుతున్న భక్తులతో పులకించిపోతుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన స్వర్ణగిరి క్షేత్రం తిరుపతిని పోలి ఉండడంతో అనతికాలంలో విశేష ప్రాచుర్యం పొందింది. యాదాద్రికి వచ్చిన భక్తులంతా స్వర్ణగిరిని చూడనిదే వెనుదిరగడం లేదు. వెరసి స్వల్పకాలంలోనే ఈ ప్రాంతం పర్యాటకంగా, వ్యాపారపరంగా వృద్ధి చెందింది. స్వయం ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
యాదాద్రి టు స్వర్ణగిరి
పునర్నిర్మాణంతో యాదాద్రి ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో రోజూ 5 వేల మందికి మించి భక్తులు వచ్చేవారు కాదు. ప్రస్తుతం నిత్యం 25 వేలకు పైగా భక్తులు దైవ దర్శనం చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి సైతం భక్తులు రావడం విశేషం. యాదాద్రికి వస్తున్న భక్తులు.. తప్పనిసరిగా స్వర్ణగిరిని దర్శించుకుంటున్నారు. తిరుమల తిరుపతి ఆలయాన్ని పోలిన విధంగా స్వర్ణగిరి క్షేత్రం రూపుదిద్దుకుంది. ఈ ఆలయాన్ని భువనగిరి శివారులో యాదాద్రికి వెళ్లే మార్గం మానేపల్లి హిల్స్‌లో నిర్మించారు. అద్భుత శిల్పకళతో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగి 100 రోజులు గడిచింది. ఇప్పటి వరకు 35 లక్షల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్షేత్రాల కారణంగా సమీపంలో ఉన్న ఎల్లమ టెంపుల్, వలిగొండ మండలంలోని మత్స్యగిరికి సైతం భక్తుల తాకిడి పెరిగింది.
వసతులకు పెద్దపీట
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిఽధిలో గల యాదాద్రి దేవస్థానంలో భక్తుల వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు పర్యవేక్షణలో అఽధికారులు, ఉద్యోగులు నిత్య సేవలు అందిస్తున్నారు. ఇక స్వర్ణగిరి క్షేత్రంలోనూ భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త మానేపల్లి రామారావు, కుటుంబ సభ్యులు.. క్షేత్రంలో వసతులను పర్యవేక్షిస్తున్నారు. వసతులు ఇంకా పెంచాలని భక్తులు కోరుతున్నారు.
మెరుగుపడిన ఉపాధి అవకాశాలు
యాదాద్రి, స్వర్ణగిరి క్షేత్రాలకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తుండడంతో యాదాద్రి, భువనగిరి ప్రాంతాలు పర్యాటకంగా, వ్యాపారపరంగా మరింత వృద్ధి చెందుతున్నాయి. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగు పడుతున్నాయి. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. రోజంతా గిరాకీ ఉంటుందని వాహనదారులు అంటున్నారు. దీంతో పాటు హోటల్ వ్యాపారం పెరిగింది. రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకు గిరాకీ పెరిగింది. అలాగే భక్తికి సంబంధించిన సామగ్రి దుకాణాలు వెలుస్తున్నాయి. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment