![President Draupadi Murmu Visits Yadadri Temple - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/30/President-Draupadi-Murmu.jpg.webp?itok=_Dwrt_EZ)
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. యాదాద్రి గర్భాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
యాదాద్రిలో భారీ ఏర్పాట్లు
కాగా రాష్ట్రపతి యాదాద్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధానాలయాన్ని మామిడి, అరటి తోరణాలు, పూలతో అలంకరించారు. ఉత్తర రాజగోపురం గుండా రాష్ట్రపతి శ్రీస్వామివారి దర్శనానికి వెళ్లనుండడంతో కృష్ణశిల స్టోన్ ఫ్లోరింగ్‌కు కూల్ పేయింట్ వేశారు. రాష్ట్రపతి ఆలయానికి చేరుకొని తిరుగుపయనం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
పోలీసుల ఆధీనంలో యాదాద్రి
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా యాదాద్రి ప్రధానాలయంతో పాటు రింగ్ రోడ్డు, ఘాట్‌రోడ్డు, హెలిపాడ్‌లు ఏర్పాటు చేసిన యాగస్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో అడిషనల్ సీసీ సురేంద్రబాబు, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్లా నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట పట్టణ సీఐ సైదయ్య బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి వెంట ఎస్‌పీజీ, ఐబీ, క్యూఆర్‌టీ టీంలు రానున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రధానాలయంలో భక్తులతో నిర్వహించే పూజలను రద్దు చేసి స్వామివారికి చేపట్టే ఆర్జిత సేవలను అంతరంగికంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉదయం 9నుంచి 10 గంటల వరకు ఉన్న బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతనే భక్తులు శ్రీస్వామి దర్శనానికి రావాలని ఆలయ అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment