అర్చకులతో ఫొటో దిగుతున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో గవర్నర్ తమిళిసై, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి/ సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆమె ఉదయం 9.22 గంటలకు బొల్లారం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. వారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో కొండపైకి వెళారు. ఆలయంలో త్రితల రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నారసింహుడికి ప్రత్యేక పూజలు, కేశవ నామార్చన చేశారు. తర్వాత ముఖ మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గవర్నర్ తమిళిసైలకు వేదాశీర్వచనం చేసి.. ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి జ్ఞాపికను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రపతికి అందజేశారు. ఆలయం నుంచి బయటికి వచ్చాక ఉత్తర రాజగోపురం ముందు మంత్రులు, అధికారులు, అర్చకులు, దేవస్థానం సిబ్బందితో రాష్ట్రపతి ఫొటోలు దిగారు. కాగా.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు యాదాద్రి కొండపైకి అనుమతించలేదు.
అమర సైనికుల కుటుంబాలతో భేటీ
యాదాద్రి నుంచి వచ్చిన తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అమర సైనికుల కుటుంబాలను ముర్ము పరామర్శించారు. దేశం కోసం ప్రాణా లు అర్పించిన వీరులను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులతో కొంతసేపు మాట్లాడారు. వారిని సన్మానించి, బహుమతులు అందచేశారు.
ప్రముఖులకు విందు
రాష్ట్రంలో పర్యటన ముగుస్తుండటంతో శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో రాజకీయ ప్రముఖులకు ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరికొందరు మంత్రులు, ఎంపీలు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.లక్ష్మణ్, నామా నాగేశ్వర్‌రావు, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పట్టువస్త్రాలు, జ్ఞాపికతో వీడ్కోలు
హైదరాబాద్‌లో శీతాకాల విడిదిని ముగించుకున్న రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆమెకు గవర్నర్ తమిళిసై, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ నూతన పట్టువస్త్రాలు, జ్ఞాపిక, ఫలాలను రాష్ట్రపతికి అందచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కలిసి వెండి వీణను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment