కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన చెక్కును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, యాదాద్రి ఈవో గీతారెడ్డికి అందజేస్తున్న సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు. చిత్రంలో కేసీఆర్ దంపతులు తదితరులు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి అనుబంధంగా జరుగుతున్న నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత అద్భుతంగా, వైభవంగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాల ని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఫోన్లో ఆదేశించారు.
శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మ దంపతులు మనవడు హిమాన్షుతో కలిసి శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యవిమాన స్వర్ణ తాపడం కోసం కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారానికి గాను చెక్కును దేవస్థానానికి అందజేశారు. సుమారు 4.40 గంటలపాటు సీఎం యాదాద్రిలో పర్యటించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రి చేరుకున్న కేసీఆర్.. మొదట గుట్ట చుట్టూ బస్సులో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు. అక్కడ యాదాద్రి అభివృద్ధి పనులపై మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు.
అనుబంధ సేవలకు 2,157 ఎకరాలు
‘యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ)కి 2,157 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుంది. దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు, భూమిని కేటాయించిన శాఖలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ భూమిని ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలి.
ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలను కేటాయించాలి. యాదాద్రి టెంపుల్ టౌన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలి. దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలు ఆదాయ పన్ను మినహాయింపు పొందేలా అనుమతులు వెంటనే తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు.
50 ఎకరాల్లో కల్యాణ మండపం
‘ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి కావాలి. హెలిప్యాడ్‌ల నిర్మాణం కూడా చేపట్టాలి. వైటీడీఏ పరిధిలో ఉన్న 100 ఎకరాల అడవిని ‘నృసింహ అభయారణ్యం’ పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలి. స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక అద్భుతమైన కల్యాణ మండప నిర్మాణం చేపట్టాలి.
ఆలయం సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండ్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాదాద్రిలో ఉన్న విలేకరులకు కలెక్టర్ పమేలా సత్పతి వైటీడీఏ బయట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు.
ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా కాటేజీలు
‘పెద్దగుట్టపై 250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా నిర్మించాలి. వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలి. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయాలి..’ అని సూచించారు.
పూర్ణ కుంభంతో స్వాగతం
సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘తొందర ఏమీలేదు.. ఇక్కడున్నవారందరికీ తీర్థం ఇచ్చి అక్షింతలు వేయాలని సీఎం వేదపండితులను కోరారు. దాతలతో పాటు అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరి గోత్రనామాలు చదివే వరకు ఓపికతో కూర్చున్నారు.
కేసీఆర్ కుటుంబం తరఫున వారి మనవడు హిమాన్షు యాదాద్రీశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన ఒక కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52,48,097 విలువైన చెక్కును హిమాన్షు చేతుల మీదుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం కోసం నాలుగు కిలోల ప్రత్యేక లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు తయారు చేశారు.
కాగా ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి రూ.20 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ఎ.రజిత 30 లక్షలు, స్నేహిత బిల్డర్స్ రూ.51 లక్షలు, ఏనుగు దయానందరెడ్డి రూ.50.04 లక్షల (కిలో బంగారం) మేరకు చెక్కులను అధికారులకు అందజేశారు. యాదాద్రీశుని గర్భాలయంలో ఆయా చెక్కులు, ఒక కవర్‌కు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం ఆలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.
రెండు గంటలు సూట్‌లోనే..
రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం వెంటనే స్వామి వారి దర్శనం కోసం వెళ్లకుండా రెండు గంటలపాటు ప్రెసిడెన్షియల్ సూట్‌లోనే ఉండిపోయారు. చెక్ బుక్ మర్చిపోవడంతో అధికారులు హైదరాబాద్ ప్రగతి భవన్‌నుంచి తేవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో సీఎం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు సూట్‌లోనే వేచి చూశారు.
యాదాద్రి పర్యటనలో కేసీఆర్ దంపతులతో పాటు మంత్రులు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా సీఎం రాక సందర్భంగా హైదరాబాద్ బేగంపేట నుంచి యాదాద్రి వరకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఒక గంటలోనే యాదాద్రికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment