జస్టిస్ సుభాష్‌రెడ్డికి ఆశీర్వచనం చేస్తున్న ఆచార్యులు
యాదగిరిగుట్ట: అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో రాబోయే రోజుల్లో భక్తులందరికీ ఒకే రకమైన దర్శనం లభించే విధంగా ప్రభుత్వం, అధికారులు కృషిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి అన్నారు. యాదాద్రీశుడిని శనివారం జస్టిస్ సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆచార్యులు మండపంలో ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే యాదాద్రి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. వీఐపీలు, వీవీఐపీలతో పాటు సాధారణ భక్తులకు సైతం శ్రీస్వామివారి దర్శనం అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా జడ్జి, పలువురు న్యాయవాదులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment