Justice subhash reddy
-
ఒకే రకమైన దర్శనం కల్పించాలి
యాదగిరిగుట్ట: అద్భుత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో రాబోయే రోజుల్లో భక్తులందరికీ ఒకే రకమైన దర్శనం లభించే విధంగా ప్రభుత్వం, అధికారులు కృషిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి అన్నారు. యాదాద్రీశుడిని శనివారం జస్టిస్ సుభాష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆచార్యులు మండపంలో ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం జస్టిస్ సుభాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే యాదాద్రి క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. వీఐపీలు, వీవీఐపీలతో పాటు సాధారణ భక్తులకు సైతం శ్రీస్వామివారి దర్శనం అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా జడ్జి, పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
రేప్ కేసుల విచారణ తీరుపై ‘సుప్రీం’ కమిటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నియమించారని సోమవారం సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. -
కార్యదక్షుడు జస్టిస్ సుభాష్‌రెడ్డి
హైదరాబాద్: కార్యదక్షుడు కాబట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నియమితులయ్యారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.పి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్టీసీ కల్యాణ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో న్యాయవాదుల మహాసమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సుభాష్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తిగా సమర్థవంతంగా పనిచేయడం వల్లనే గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుభాష్‌రెడ్డి నియమితులయ్యారని అన్నారు. అక్కడ కూడా తన సత్తాను నిరూపించుకోవడంతోపాటు ఆయన ఇచ్చిన తీర్పుల వల్ల మంచి గుర్తింపు రావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారని కితాబిచ్చారు. సుప్రీంకోర్టులో కూడా సుభాష్‌రెడ్డి తనదైన శైలిలో మంచి తీర్పులు ఇచ్చి గుర్తింపు పొందుతారని ఆశాబావం వ్యక్తం చేశారు. మాజీ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. అంకితభావం, కార్యదీక్షతో కష్టపడి పనిచేసి సుభాష్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారని కితాబిచ్చారు. గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా విజయవంతం కావడం వల్లనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆలస్యం అయినప్పటికీ తక్కువ సమయంలో ఎన్నో మంచి తీర్పులు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టు జడ్జీగా ఐదేళ్ల నాలుగు నెలల కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారని.. ఆ తీర్పులను ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి గుర్తింపు తెస్తా: జస్టిస్ సుభాష్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను గ్రామీణ వాతావరణం నుంచి వచ్చానని, ఇంటర్లో తెలుగు మీడియం చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్ మీడియంలో చేరానని చెప్పారు. బాగా కష్టపడి పనిచేయడంతో పాటు పెద్దల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా మంచి గుర్తింపు వచ్చిందని ఇంకా బాగా కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొస్తానని అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు అనంతరెడ్డి, హరిమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేనరెడ్డి, అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి.బాలరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జితేందర్‌రెడ్డి, బి.జయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సుభాష్‌రెడ్డితోపాటు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ అజయ్ రస్తోగీలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ సుభాష్‌రెడ్డి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో కేసులను విచారించారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుభాష్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ఈ నెల 29న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్, అలాగే డిసెంబర్ 30న జస్టిస్ మదన్ బి.లోకూర్‌లు పదవీ విరమణ చేయనున్నారు. -
ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సుభాష్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు జడ్జీలు కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నేడు బాధ్యతలు చేపట్టారు. వీరిలో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అజయ్ రస్తోగిలు ఉన్నారు. వీరిచే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుభాష్‌రెడ్డిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్తగా నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టడంతో.. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. సుప్రీంలో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుభాష్ రెడ్డి.. మండల కేంద్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సాధించారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ బాధ్యతలు చేపట్టారు. 2016 ఫిబ్రవరి 13 నుంచి గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. -
జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై కేంద్రానికి సిఫారసు పంపించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రతీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంది. అయితే తెలంగాణ నుంచి సుప్రీంకోర్టులో ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. దీంతో తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్రెడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా జస్టిస్ సుభాష్‌రెడ్డికి న్యాయవర్గాల్లో మంచిపేరు ఉంది. ఆయన నియామకానికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయనున్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి నేపథ్యం... జస్టిస్ సుభాష్‌రెడ్డి 1957 జనవరి 5న మెదక్ జిల్లా, శంకరంపేట మండలం, కమరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశాలాదేవి, జగన్నాథరెడ్డి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం శంకరంపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సాగింది. హైదరాబాద్, ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1980 అక్టోబర్ 30న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో వృత్తి నైపుణ్యాన్ని సాధించారు. తక్కువ సమయంలో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేసే స్థాయికి ఎదిగారు. సంస్కృతి, కళలు, సంగీతంపై మక్కువ చూపే జస్టిస్ సుభాష్‌రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ, జేఎన్టీయూలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్యుడు, వివాదరహితుడు కావడంతో అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించారు. 2016 ఫిబ్రవరి 13న పదోన్నతిపై గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి న్యాయ నైపుణ్యాన్ని, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్‌ను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రా నికి సిఫారసు చేస్తూ ఈ నెల 29న కొలీజి యం తీర్మానం చేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి జస్టిస్ చౌహాన్ వస్తున్నారు. ఆయన నెంబర్ టు స్థానంలో కొనసాగుతారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్ చౌహాన్ సభ్యులుగా ఉంటారు. జస్టిస్ చౌహాన్ ఉమ్మడి హైకోర్టుకు వచ్చిన తర్వాత కొలీజియం మరికొందరు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఎవ రిని చేర్చాలన్న విషయంపై కొలీజియంలోని న్యాయమూర్తులు ఇప్పటికే ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలకు లోకాయుక్తగా వ్యవహరిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి బుధవారం పదవీ విరమణ చేశారు. లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు సన్మానం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, జస్టిస్ జి.చంద్రయ్య, ఉపలోకాయుక్త గంగిరెడ్డి పాల్గొన్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పోస్టు ఎంత ఆత్మ సంతృప్తి కలిగించిందో.. లోకాయుక్త పోస్టు కూడా అంతే సంతృప్తి కలిగించిందని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోస్టుల ద్వారా అనేక మంది పేదలకు న్యాయం చేసే అవకాశం కలిగిందన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు వంటివి అందక ఇబ్బందిపడే పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూశానని, ఇది ఎంతో ఆనందం కలిగించిందని ఆయన చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు ఒక్కోసారి చట్ట పరిధి దాటి కూడా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. తన సిబ్బంది సహాయ సహకారాలు అందించారని, లోకాయుక్తలో భర్తీ చేసిన పోస్టుల విషయంలో ఎక్కడా పక్షపాతానికి తావివ్వలేదని పేర్కొన్నారు. ఏ వృత్తిలోనైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి గొప్ప మానవతావాదని ఉపలోకాయుక్త గంగిరెడ్డి కొనిడాయారు. విధి నిర్వహణలో సుభాషణ్‌రెడ్డి ఎంతో మందికి ఆదర్శప్రాయులని తెలిపారు. అనంతరం జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత్త లోకాయుక్త నియామకానికి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఉప లోకాయుక్త గంగిరెడ్డి లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
గుజరాత్ సీజేగా జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డిని గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతిపై నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పదవీబాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆయన పదోన్నతి వర్తిస్తుంది. అలహాబాద్ హైకోర్టులోని 12 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రేమ్‌శంకర్ భట్‌ను జార్ఖండ్ హైకోర్టుకు, గుజరాత్ హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ జయంత్ పటేల్‌ను కర్ణాటక హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధుర్య ను గుజరాత్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు వివరించింది. రాజస్తాన్, పట్నా, గౌహతి, మేఘాలయా, కర్ణాటక హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల నియామకంపై కొలీజియం చేసిన సిఫార్సులు పరిశీలనలో ఉన్నాయని...వాటిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. న్యాయశాఖ గణాంకాల ప్రకారం...24 హైకోర్టుల్లో 1,044 మంది జడ్జీల ఆమోదిత సంఖ్యకుగాను ఈ ఏడాది జనవరి 1 నాటికి 601 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులో 31 మంది జడ్జీల ఆమోదిత సంఖ్యకుగాను ప్రస్తుతం 26 మంది జడ్జీలే ఉన్నారు. -
జస్టిస్ సుభాష్‌రెడ్డికి ఘన వీడ్కోలు
♦ ఆయన సహకారం మరువలేనిదన్న ఏసీజే ♦ సుభాష్‌రెడ్డి సేవలను కొనియాడిన ఏజీలు ♦ ఘనంగా సన్మానించిన న్యాయవాదుల సంఘం సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డికి హైకోర్టు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకు గాను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్‌లు న్యాయవ్యవస్థకు జస్టిస్ సుభాష్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే మాట్లాడుతూ ఉమ్మడి హైకోర్టు ఓ మంచి న్యాయమూర్తి సేవలను కోల్పోతోందన్నారు. విధి నిర్వహణలో తనకు జస్టిస్ సుభాష్‌రెడ్డి అనేక విధాలుగా సహాయ, సహకారాలు అందించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనేక కీలక కమిటీలకు నేతృత్వం వహించి సమస్యల పరిష్కారానికి ఎంత గానో కృషి చేశారని ప్రశంసించారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏసీజే ఆకాంక్షించారు. ఆ తరువాత జస్టిస్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో తనకు సహకరించిన వారిందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన సహచర న్యాయమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నందుకు సంతోషంగా ఉన్నా, హైకోర్టును, సహచరులను విడిచి వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. తరువాత హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ సుభాష్‌రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించింది. అలాగే సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల సంఘం కూడా ఆయన్ను సత్కరించింది. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏపీ విభాగం అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుజరాత్ సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి
♦ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర ♦ ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం ♦ జస్టిస్ జయంత్ పటేల్ బదిలీ తరువాతే బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు సీజే పదవికి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫారసుకు ఆమోదముద్ర వేస్తూ సంబంధిత ఫైల్‌పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం సాయంత్రం సంతకం చేశారు. అందుకు సంబంధించిన వారెంట్ సైతం సుభాష్‌రెడ్డికి అందింది. గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాష్‌రెడ్డి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ ఈ వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ జయంత్ ఎం.పటేల్ కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లిన తరువాత జస్టిస్ సుభాష్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. ఇందుకు పది, పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి పలు కీలక తీర్పులు వెలువరించారు. సుభాష్‌రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కోటాలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ కుటుంబం నుంచి సీజే వరకు వివాదరహితుడిగా పేరున్న జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి 1957లో మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రామయ్యగారి జగన్నాథరెడ్డి, విశాలదేవి ఆయన తల్లిదండ్రులు. శంకరంపేటలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత ఓయూ నుంచి లా డిగ్రీ పొందారు. 1980 అక్టోబర్ 30న ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి(హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత లోకాయుక్త) వద్ద న్యాయవాద జీవితాన్ని ప్రారంభించారు. సుభాష్‌రెడ్డి సోదరినే జస్టిస్ సుభాషణ్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి న్యాయమూర్తిగా నియమితులైన తరువాత తన సహచరులు రఘువీర్‌రెడ్డితో కలసి సుభాష్‌రెడ్డి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిజామాబాద్‌లో ప్రముఖ న్యాయవాది అయిన బి.ఆర్.గంగారెడ్డి కుమార్తె రజితను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ఆర్.అశ్విన్‌రెడ్డి ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తుంటే, రెండో కుమారుడు సుశాంత్‌రెడ్డి తండ్రి అడుగుజాడల్లో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ సుభాష్‌రెడ్డికి పట్టు ఉంది. పలు సంస్థలకు, వర్సిటీలకు ఆయన న్యాయవాదిగా పనిచేశారు. 2001-02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2002, డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 జూన్‌లో శాశ్వత న్యాయమూర్తి అయ్యా రు. న్యాయమూర్తిగా ఆయన హైకోర్టులో పలు కీలక కమిటీలకు నేతృత్వం వహించారు. ఎంత పెద్దోడైనా ఊరును మరవలే.. జస్టిస్ సుభాష్‌రెడ్డి ఎంత పెద్దోడు అయినా సొంత ఊరును మరువలేదు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారని తెలిసి ఎంతో సంబరపడ్డాం. గ్రామానికి ఎప్పుడు వచ్చినా యోగక్షేమాలు అడుగుతారు. గ్రామంలో ఎందరికో సహాయం చేశారు. ఊరు నుంచి ఎవరు వెళ్లినా ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టనిదే వదలరు. - చిన్ననాటి గురువు తారక పోచయ్య, కామారం మా ఊరు చేసుకున్న అదృష్టం మా గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం మా ఊరు చేసుకున్న అదృష్టం. గ్రామంలో రోడ్ల అభివృద్ధి ఆయన చలవతోనే సాధ్యమైంది. ఆయన సొంత నిధులతో హనుమాన్ దేవాలయం ప్రహరీని నిర్మించారు. మా కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ఆయనను మేము ఎప్పటికీ మరచిపోలేం. - హేమలత, కామారం సర్పంచ్ పురిటిగడ్డలో హర్షాతిరేకాలు చిన్నశంకరంపేట: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడంపట్ల ఆయన పురిటిగడ్డ మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నా.. సాధారణ పౌరుడిలా గ్రామానికి వస్తూ అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలను కనుక్కునేవారని స్థానికులు గుర్తుచేసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆయన కృషి వల్లే జరిగిందన్నారు. ఇటీవల గ్రామంలో తన సోదరుడి కుమారుడి పెళ్లికి వచ్చి పోచమ్మ గుడిలో మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు. -
చర్చల ద్వారా పరిష్కరించుకోండి
పురోగతి లేకుంటే మాకు చెప్పండి ♦ అప్పుడు మేమే తగిన ఆదేశాలు జారీ చేస్తాం ♦ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ♦ ఇరు రాష్ట్రాలకూ హైకోర్టు స్పష్టీకరణ ♦ తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తలెత్తిన వివాదాన్ని చర్చలద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. రెండురాష్ట్రాల విద్యుత్ అధికారులు చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. చర్చల్లో పురోగతి లేకుంటే పూర్తిస్థాయి విచారణ అనంతరం తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. ఉద్యోగుల విభజన ప్రక్రియను కొలిక్కితెచ్చే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలా? లేదా ఇరురాష్ట్రాల అంగీకారంతో కోర్టు పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయాలా? అన్నదానిపై అభిప్రాయం చెప్పాలని ఉభయరాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీ)ను ఆదేశించింది. వచ్చే విచారణ నాటికి ఏ విషయం చెబితే తదనుగుణంగా ఆదేశాలిస్తామంది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుదిజాబితాను సవాలుచేస్తూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు వేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. చట్ట నిబంధనలమేరకే విభజన: తెలంగాణ ఏజీ స్థానికత ఆధారంగా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ పునర్విభజన చట్టం మేరకే జరిగిందని తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. నిబంధనలకు అనుగుణంగా లేదు: ఏపీ ఏజీ ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు, తదనుగుణంగా తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులు, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా నిబంధనలకు అనుగుణంగా లేదని ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ తెలిపారు. ఇదేసమయంలో గతవారం ధర్మాసనం జారీచేసిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ఆ సంస్థలే ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపింది. వివాద పరిష్కార బాధ్యతను షీలాబిడే కమిటీకి అప్పగించే ఉద్దేశం తమకుందని, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
సివిల్ జడ్జిలే మూల స్తంభాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైదరాబాద్, న్యూస్‌లైన్: క్షేత్రస్థాయిలో పనిచేసే జూనియర్ సివిల్ జడ్జిలే న్యా య వ్యవస్థకు మూల స్తంభాల్లాంటివారని, వారి పనితీరుతోనే న్యాయవ్యవస్థ ప్ర తిష్ట ఇనుమడిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ఉద్ఘాటించారు. తమిళనాడు న్యాయ అకాడమీలో శిక్షణ పొందిన జూని యర్ సివిల్ జడ్జిల విజ్ఞాన అవగాహన సదస్సు ఏపీ న్యాయ అకాడమీలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనియర్ సివిల్ జడ్జిలు అంకితభావంతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేయాలన్నారు. ఏపీ న్యాయవ్యవస్థ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ సుభాష్‌రెడ్డి, డెరైక్టర్ వీఎస్ అవధాని, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ నౌషద్ అలీ తదితరులు ప్రసంగించారు. తమిళనాడుకు చెందిన 30 మంది ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జిలు సహా రాష్ట్రానికి చెందిన పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.