జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి(పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు జడ్జీలు కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నేడు బాధ్యతలు చేపట్టారు. వీరిలో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అజయ్ రస్తోగిలు ఉన్నారు. వీరిచే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుభాష్‌రెడ్డిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్తగా నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టడంతో.. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. సుప్రీంలో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుభాష్ రెడ్డి.. మండల కేంద్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సాధించారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ బాధ్యతలు చేపట్టారు. 2016 ఫిబ్రవరి 13 నుంచి గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment