Justice Ranjan Gogoi
-
మమ్మల్నే ఎందుకు విమర్శిస్తారు?
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు వేరే పదవులు తీసుకుంటే ఎందుకు విమర్శిస్తారని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్ ప్రశ్నించారు. అదే యాక్టివిస్ట్ జడ్జీలు, రిటైర్ అయ్యాక డబ్బు సంపాదన కోసం మధ్యవర్తిత్వం నెరిపే న్యాయమూర్తులపై ఎలాంటి విమర్శలు ఎదురుకావని అన్నారు. ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల వెబినార్‌లో గొగొయ్ మాట్లాడారు. మాజీ జడ్జీల్లో మూడు కేటగిరీలు ఉన్నాయని అన్నారు. (తెల్లరంగు దుస్తులు ధరించండి) రిటైరయ్యాకా న్యాయవ్యవస్థ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే యాక్టవిస్టు జడ్జీలు, వివాదాలను పరిష్కరించడంలో లాయర్లకు సలహాలిస్తూ డబ్బులు సంపాదించే మాజీ జడ్జీలు, రిటైరయ్యాక ఏదో ఒక పదవి పొందే జడ్జీలు ఇలా 3 కేటగిరీలు ఉన్నప్పటికీ ఎప్పుడూ పదవులు తీసుకునే వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. మిగతా రెండు విభాగాల వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని నిలదీశారు. జడ్జీగా ఉన్నపుడు నిబద్ధతతో ఉంటే, ఆ తర్వాత ఎలాంటి ఉద్యోగానికి వెళ్లినా వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ విమర్శలకు వ్యతిరేకం కాదని.. నిజాయితీ, మేధో, విద్యాపరమైన కసరత్తు లేకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జస్టిస్ రంజన్ గొగొయ్ 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ వరకు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 19న రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, షేమ్’అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. (చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!) -
‘అయోధ్య’పై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి– బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. తీర్పులో కొన్ని తప్పులున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ సోమవారం మౌలానా సయ్యద్ అషాద్ రషీది, జామియత్ ఉలేమా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సయ్యద్ రషీది తొలి పిటిషన్‌దారు ఎం సిద్ధిఖీకి చట్టబద్ధ వారసుడు. ‘ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాలని తీర్పునివ్వడం ద్వారానే నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది’ అని 93 పేజీల ఆ రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, ప్రతిగా, ముస్లింల తరఫున సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9న సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ గొగోయ్ దంపతులు
సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ పాల్గొన్న గొగోయ్ దంపతులు, అనంతరం తిరు మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవను తిలకించారు. క్షేత్ర సాంప్రదాయ ప్రకారం భూ వరాహ స్వామిని దర్శించుకున్న గొగోయ్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
అయోధ్య కేసు : అంతిమ తీర్పులో ఆ ఐదుగురు
సాక్షి, న్యూఢిల్లీ : శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేసమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసు తుది విచారణలో భాగమైన రాజ్యంగ ధర్మాసనంలోని న్యాయమూర్తుల వివరాలు మీకోసం.. ⇔ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబర్ నియమితులయ్యారు. అస్సాంకు చెందిన గొగోయ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. గౌహతి హైకోర్టు, పంజాబ్ హరియాణా హైకోర్టులో ఆయన సీజేగా పనిచేశారు. 2012లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నార్సీ వంటి కేసుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ⇔ జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే : సీజేఐ రంజన్ గొగోయ్ రిటైర్మెంట్ తర్వాత సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బాబ్డే సీజేఐగా 18 నెలల పాటు కొనసాగనున్నారు. ఆయన 2000 ఏడాదిలో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా పనిచేశారు. 2002లో మధ్యప్రదేశ్ సీజేగా నియమితులయ్యారు. 2013లో సుప్రీం న్యాయమూర్తిగా వచ్చారు. బాబ్డే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. ⇔ జస్టిస్ డీవై చంద్రచూడ్ : సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలంపాటు పనిచేసిన వైవీ చంద్రచూడ్ తనయుడు. డీవై చంద్రచూడ్ 2016లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో బాంబే హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు సీజేగా పనిచేశారు. వ్యభిచార చట్టం మరియు గోప్యత హక్కు వంటి కీలక కేసులో వాదనలు విన్నారు. ⇔ జస్టిస్ అశోక్ భూషణ్ : 1970 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అప్పటి నుంచే అయోధ్య వివాదంపై పలు దశల్లో పనిచేశారు. అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేశారు. అదే కోర్టుకు 2001లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో కేరళ హైకోర్టులో పనిచేశారు. కొన్ని నెలలపాటు కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ⇔ జస్టిస్ అబ్దుల్ నజీర్ : 1983లో అడ్వొకేట్‌గా కెరీర్ ప్రారంభించారు. కేరళ హైకోర్టులో 20 ఏళ్ల పాటు సేవలందించారు. 2003లో కేరళ హైకోర్టు అదనపు జడ్జిగా పనిచేశారు. 2004లో పూర్తి స్థాయిలో కేరళ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ట్రిపుల్ తలాక్ వాదనలు విన్న బెంచ్‌లో సభ్యుడు. -
‘అయోధ్య’ తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాల వివాదానికి నేడు తెరపడనుంది. దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు కారణమైన జటిల సమస్యకు నేడు పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో నేడు తేలనుంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది. దీనికి సంబంధించిన నోటీసును శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ కొనసాగింది. అక్టోబర్ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. యూపీ ఉన్నతాధికారులతో సీజేఐ భేటీ తీర్పు ప్రకటించనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ, ఆ రాష్ట్ర డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితిని, తీర్పు నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు వర్గాలు సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పునిచి్చన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయోధ్యలోని రామజన్మభూమి న్యాస్ కార్యశాల వద్ద ప్రార్థనలు చేస్తున్న భక్తురాలు 1950 నుంచీ.. అంతకుముందు, మొదట 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే రామ్‌లల్లా భక్తుడు స్థానిక కోర్టులో వ్యాజ్యం వేశారు. వివాదాస్పద ప్రదేశంలో కొలువైన చిన్నారి రాముడి విగ్రహానికి పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. అదే సంవత్సరం బాబ్రీ మసీదు ప్రధాన గుమ్మటం కిందనే విగ్రహాలను ఉంచి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని పరమహంస రామచంద్ర దాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ తరువాత ఆ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. 1959లో రామ్‌లల్లాకు భక్తులుగా పూజాదికాలు నిర్వహించేందుకు హక్కులు కోరుతూ నిర్మోహి అఖాడా అదే కోర్టులో వ్యాజ్యం వేసింది. ఆ తరువాత మొత్తం వివాదాస్పద ప్రదేశంపై పూర్తి హక్కులు కోరుతూ 1961లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కేసు వేసింది. అనంతరం, అక్కడి రామ్‌లల్లా విరాజ్మాన్ విగ్రహం, రామ జన్మభూమి తరఫున అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దియెకి నందన్ అగర్వాల్ 1989లో ఈ వ్యాజ్యంలో పాలుపంచుకున్నారు. మొత్తం వివాదాస్పద ప్రాంతంపై తమకు(రామ్‌లల్లాకు) యాజమాన్య హక్కులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం 1992 డిసెంబర్ 6వ తేదీన కూల్చివేతకు గురైంది. దాంతో, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురికి 3 భాగాలు.. ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన్న వ్యాజ్యాలన్నీ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. సుదీర్ఘ వాదనల అనంతరం అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారానికి ఆధ్యాత్మిక గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ కలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఒక మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పడింది. వివిధ వర్గాలతో నాలుగు నెలల పాటు ఆ కమిటీ సంప్రదింపులు జరిపింది. అయినా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. అనంతరం, తమ అభిప్రాయాలతో కూడిన ఒక నివేదికను ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి అందజేసింది. ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ నుంచి రోజువారీ విచారణను ప్రారంభించింది. అత్యధిక కాలం విచారణ సాగిన కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ కేసు విచారణను చివరకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 16న ముగించింది. మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్ 17 వ తేదీన జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేయనుండటంతో.. ఆ లోపే తీర్పును ప్రకటిస్తారని అంతా భావించారు. చివరకు, నేడు ఆ చరిత్రాత్మక తీర్పు వెలువడనుంది. కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయోధ్య తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నేడు భేటీ కానుంది. ఆదివారం ఉదయం ఈ భేటీ జరగాల్సి ఉండగా తాజా పరిణామాలతో శనివారమే నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఉదయం 9:45 గంటలకు 10 జనపథ్‌లో ఈ సమావేశం జరగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇందులో కాంగ్రెస్ కీలక నేతలు సహా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. తీర్పుపై కాంగ్రెస్ వైఖరి నిర్ణయించుకునేందుకే ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. మరోవైపు సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కలి్పస్తున్నారు. కాగా ‘కోర్టు తీర్పును మనమంతా గౌరవించాలి. సంయమనం పాటించాలి. మత నమ్మకాలను కించపరచవద్దు’ అని లక్నో ఈద్గా ఇమాం మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ సూచించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అయోధ్య కేసు అతి పెద్దది, సున్నితమైనదని, తీర్పును గౌరవించి శాంతిని కాపాడాల్సి బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అయోధ్యలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 60 కంపెనీల పారా మిలటరీ బలగాలు (ఒక్కో కంపెనీలో 90 – 125 మంది), ఇతర సిబ్బందిని అక్కడ మోహరించారు. పరిస్థితిని డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం సమీక్షిస్తున్నారు. రామజన్మభూమి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి వాహనాన్ని అణువణువూ తనిఖీ చేస్తున్నారు. శాంతి సమావేశాలు.. శాంతిని పరిరక్షించాలని కోరుతూ మీరట్ డివిజనల్ కమిషనర్ అనితా మెష్రామ్ హిందు, ముస్లిం వర్గాల మత పెద్దలతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవద్దని, రెచ్చగొట్టే సందేశాలు ప్రచారం చేయవద్దని కోరారు. నవంబర్ 30వ తేదీ వరకు నిరంతరం పనిచేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మత సామరస్యాన్ని పాటించాలని పశి్చమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘అయోధ్య’పై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్ ముంబై: రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనుండగా, దీనిపై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్ట్‌ను పెట్టిన మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ జన్మభూమిపై న్యాయం జరిగిన తర్వాత తాను దీపావళి చేసుకుంటానని, చరిత్రలో నల్లటి మచ్చను ఇది తొలగిస్తుందంటూ ఆగ్రారోడ్డుకు చెందిన సంజయ్ రామేశ్వర్ శర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. భిన్న మతాల మధ్య సామరస్యానికి విఘాతం కలిగించే చర్యగా పరిగణించి సెక్షన్ 153 (1), సెక్షన్ 188 కింద పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అయోధ్యను సందర్శించే భక్తులపై నిషేధం లేదు... తాత్కాలిక ఆలయం వద్ద బారికేడ్లను పటి ష్టం చేశామని, అయోధ్యను 31 సెక్టార్లు, 35 సబ్ సెక్టార్లుగా విభజించి కట్టుదిట్టమైన భద్రత కలి్పంచినట్లు యూపీ ప్రాసిక్యూషన్ అదనపు డీజీ అశుతోష్ పాండే తెలిపారు. శ్రీరాముడి దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తే బ్యాచ్‌ల వారీగా అనుమతిస్తామని చెప్పారు. అయోధ్యలో భక్తులపై ఎలాంటి నిషేధం లేదన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియాపై పోలీస్ నిఘా అయోధ్యపై తుదితీర్పు నేపథ్యంలో మతపరమైన ప్రాంతాల భద్రతకు చర్యలు చేపట్టామని, సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్‌లో మత విద్వేషాలను రగిల్చేలా ప్రచారానికి పాల్పడితే జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ), గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని నోయిడా గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా మేజి్రస్టేట్ బీఎన్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా నిందితుల ఆస్తులను కూడా స్వాదీనం చేసుకునే వీలుందన్నారు. విభిన్న రకాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో శాంతి సమావేశాలు నిర్వహించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే తరహాలో కేంద్ర హోంశాఖ సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించారు. యూపీలో పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు లక్నోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో బలగాల మోహరింపు.. గతంలో అయోధ్య ఘటన సమయంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అప్రకటిత నిషేధాజ్ఞలు అమలుకానున్నాయి. నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడకుండా చర్యలు తీసుకోనున్నారు. శనివారమే ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్ సైతం ఉండటంతో 20 వేల మందితో బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి పాక్షికంగా, శనివారం తెల్లవారుజాము నుంచి పూర్తి స్థాయిలో అదనపు బలగాలు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర హోంశాఖ ఇచి్చన ఆదేశాల ప్రకారం.. ఎక్కడా ఎలాంటి చిన్న ఘటన కూడా జరగకుండా పోలీసులు పకడ్బందీగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే.. రాష్ట్ర పోలీసు బలగాలకు తోడుగా.. కేంద్రం నుంచి అదనపు బలగాలను తెప్పించే యోచనలో ఉన్నారు. తీర్పును ఏ ఒక్క వర్గం విజయంగానో, వైఫల్యంగానో చూడొద్దు : మోదీ అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఏ ఒక్క వర్గం విజయంగానో, మరో వర్గం అపజయం గానో పరిగణించవద్దని ప్రధాని మోదీ సూచించారు. శాంతి, సంయమనం పాటించాలని వరుస ట్వీట్లతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఈ తీర్పు ఎలా ఉన్నా.. భారతదేశ ఔన్నత్య ప్రతీకలైన శాంతి, ఐకమత్యం, సద్భావం బలోపేతం కావడమే మన ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఈ తీర్పు ఆ భావనలను మరింత దృఢపర్చాలి’ అని ఆకాంక్షించారు. తీర్పు నేపథ్యంలో సానుకూల, సుహృద్భావ వాతావరణం ఏర్పడేలా పౌరులు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. -
యూపీ అధికారులతో సమావేశం కానున్న సీజేఐ
న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్నివర్గాలు అయోధ్య తీర్పుపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయరాదని తమ శ్రేణులను ఆదేశించాయి. అలాగే యూపీ ప్రభుత్వం కూడా అయోధ్యలో భారీగా భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్‌సింగ్‌లతో శుక్రవారం సమావేశం కానున్నట్టుగా సమాచారం. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో యూపీలోని శాంతి భద్రతలపై ఆయన వారితో సమీక్ష చేపట్టనున్నారు. సీజేఐ చాంబర్లో ఈ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గత రాత్రి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లక్నో, అయోధ్యలలో హెలికాఫ్టర్లు అందుబాటులో ఉండనున్నట్టు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. మరోవైపు కేంద్రం కూడా.. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభ్తుత్వం కూడా తీర్పు అనంతరం ఉత్సవాలను జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. కాగా, అయోధ్య కేసుకు సంబంధించి సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు హిందు, ముస్లిం వర్గాల తరఫు లాయర్లు 40 రోజులు వరుసగా తమ వాదనలు వినిపించారు. అక్టోబర్ 16వ తేదీన తుది వాదనలు వినడం ముగించిన రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును జస్టిస్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్న నవంబర్ 17లోపు ప్రకటించే అవకాశముంది. -
ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్ తలాక్ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో చారిత్రక, సంచలన తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది. అందులో యావత్ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనది. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తతలకు దారితీసిన, మరెన్నో వివాదాలకు తెరలేపిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్ళుగా ఉన్న ఈ కేసులో జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్‌పై తుదితీర్పును సైతం చీఫ్ జస్టిస్ గొగోయ్ రిజర్వులో ఉంచారు. కేరళలోని శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటి తీర్పును జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలనుంది. రఫేల్ ఒప్పందం... రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. 36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనేది ఈ కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం. డిసెంబర్ 14, 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిçస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్ ఆరోపించింది. చౌకీదార్ చోర్‌హై వివాదం మే 10న సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్ చోర్‌హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వచ్చే అవకాశముంది. ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత 2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశముంది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 4న వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(హెచ్) ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. -
అయోధ్య కేసుపై నేటితో ముగియనున్న వాదనలు
-
నేటితో ‘అయోధ్య’ వాదనలు పూర్తి!
న్యూఢిల్లీ:వివాదాస్పద రామజన్మభూమి– అయోధ్య కేసు వాదనలను బుధవారంతో ముగించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అక్టోబర్ 18తో అయోధ్య కేసు వాదనలను ముగించాలని తొలుత నిర్ణయించినా..16వ తేదీతోనే ముగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన వాదనలన్నీ నేటితో ముగించాలని మంగళవారం హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. మంగళవారం కూడా సాయంత్రం 5 గంటల వరకు వాదనలు విన్నది. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ కేసును 39 రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. సీజేఐ పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. అప్పటికల్లా తీర్పు వెలువడకపోతే కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలోపే తీర్పు వెలువరించాలని ధర్మాసనం భావిస్తోంది. గతంలో ఓ సందర్భంలో సీజేఐ మాట్లాడుతూ.. ‘అయోధ్య కేసులో తీర్పు వెలువరించేందుకు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఇంత స్వల్ప∙సమయంలో తీర్పు చెప్పడం ఓ అద్భుతం లాంటిదే’అని పేర్కొన్నారు. బాబర్ తప్పును సరిదిద్దాల్సి ఉంది.. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించి బాబర్ చక్రవర్తి చారిత్రక తప్పిదం చేశారని.. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని హిందూ పార్టీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయోధ్య కేసుకు సంబంధించి సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. హిందూ పార్టీ తరఫున సీనియర్ అడ్వొకేట్ కె.పరాశరన్ వాదనలు వినిపించారు. న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం భూసేకరణ చట్టంపై విచారణ నుంచి తప్పుకోవాలంటూ తనపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఫలానా జడ్జి అంటూ ఆ కథనాల్లో వేలెత్తి చూపకున్నా న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టే భూసేకరణలో నిబంధనలపై గతంలో రెండు ధర్మాసనాలు వేర్వేరుగా తీర్పులు వెలువరించాయి. ఆ ధర్మాసనాల్లో ఒకదానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. పరస్పర విరుద్ధ తీర్పులు వివాదాస్పదం కావడంతో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది. అయిదుగురు సభ్యులతో కూడిన ఈ ధర్మాసనంలో జస్టిస్ మిశ్రా కూడా ఉన్నారు. దీనిపై కొన్ని పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని, ఆ ధర్మాసనం నుంచి జస్టిస్ మిశ్రా వైదొలగా లంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలు వడ్డాయి. మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ మిశ్రా వీటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. -
సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు. దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. -
రంజన్ గగోయ్‌కు క్లీన్చిట్ : సుప్రీం కోర్టు వెలుపల ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి అంతర్గత కమిటీ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు వెలుపల మంగళవారం 144 సెక్షన్ విధించారు. సుప్రీం కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు, మహిళా సంఘాల కార్యకర్తలు సర్వోన్నత న్యాయస్ధానం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు నిలువరించే క్రమంలో పలువురు మహిళలు, జర్నలిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులను పోలీసులు ఆ తర్వాత విడుదల చేయగా 30 మందికి పైగా మహిళా కార్యకర్తలను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. సుప్రీం కోర్టు వెలుపల భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణకు అనుసరించిన పద్ధతిని పలువురు న్యాయవాదులు, మహిళా కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్‌కు క్లీన్చిట్ ఇస్తూ సుప్రీం అంతర్గత కమిటీ విచారణకు అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టామని భారత మహిళా జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీ రాజా పేర్కొన్నారు. గతంలో సుప్రీం కోర్టులో పనిచేసిన ఉద్యోగిని తనను జస్టిస్ రంజన్ గగోయ్ లైంగికంగా వేధింపులకు గురిచేశారని చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. -
సీజేఐ వేధింపులపై వాంగ్మూలమిచ్చిన మహిళ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ సోమవారం అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన ఆమె ఈ విచారణకు హాజరుకావడం ఇది రెండోసారి. ఆమె చేసిన ఆరోపణలపై జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ విచారణ చేపట్టింది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఈ కమిటీలోని ఇతర సభ్యురాళ్లు. విచారణ సందర్భంగా బాధితురాలు ఒక్కరినే అనుమతించారని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆమె తరపు న్యాయవాది సమర్పించిన ఫిర్యాదును స్వీకరించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. తదుపరి విచారణ మంగళవారం జరగనుందని తెలుస్తోంది. -
సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. విచారణ సమయంలో ఆయనకు సహకరించాలంటూ సీబీఐ, ఐబీ డైరెక్టర్లతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతరుల సాయం తీసుకోవచ్చంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ తన దర్యాప్తు నివేదికను సీల్డు కవర్లో అందజేయాలని కోరింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ వేసిన అఫిడవిట్‌ను గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాల ప్రత్యేక ధర్మాసనం విచారించి, పై ఉత్తర్వులను వెలువరించింది. అఫిడవిట్లో పేర్కొన్న వివిధ అంశాలపై కమిటీ కోరినప్పుడు వివరణ ఇవ్వాలని లాయర్‌ను ఆదేశించింది. త్రిసభ్య కమిటీపై అభ్యంతరాలు.. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని అంతర్గత విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీజేఐకు జస్టిస్ రమణ సన్నిహిత మిత్రుడని, నిత్యం సీజేఐ నివాసానికి ఆయన వెళ్తుంటారని, కమిటీలో ఆయన ఉండటం వల్ల తాను సమర్పించిన ఆధారాలు, అఫిడివిట్‌పై సరైన విచారణ జరుగుతుందని భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కమిటీలో మహిళా జడ్జి ఇందిరా బెనర్జీ ఒక్కరు మాత్రమే ఉండటంపైనా ఆమె జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో అభ్యంతరం లేవనెత్తారు. కాగా, సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఫిర్యాదుదారు అభ్యంతరం తెలిపిన కారణంగా జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగలేదని సమాచారం. -
అగ్రవర్ణ కోటాపై ఇప్పుడే ఆదేశాలివ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ల కేసుపై ప్రస్తుత తరుణంలో తాము ఏ ఆదేశాలూ ఇవ్వదలచుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 28న ఈ కేసుకు సంబంధించిన వాదనలను తాము వింటామనీ, రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీ చేయాలా, వద్దా అన్న విషయాన్ని కూడా అప్పుడే పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారందరి కేసుల్లోనూ ఈ విషయాన్ని తాము తర్వాత పరిశీలిస్తామంటూ అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు వాయిదా వేస్తుండటం తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు పంపింది. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌పై పిటిషన్లు కొట్టివేత ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్రం పొడిగించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) ఆర్డినెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్ 19న ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉంది. -
అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు
-
అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ : అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం నెరపడానికి ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లో జస్టిస్ ఖలీఫుల్లా, రవిశంకర్ ప్రసాద్, శ్రీ రామ్ పంచ్‌ల పేర్లను సూచించింది. మధ్యవర్తితత్వాన్ని ప్రారంభించడానికి ఒక వారం, 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్, 8 వారాల్లో మధ్యవర్తిత్వం పూర్తి చేయాలని ప్యానెల్‌ను ఆదేశించింది. మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించాలని, ఫైజాబాద్ కేంద్రంగా మధ్యవర్తితత్వం చేయాలని సూచించింది. బుధవారం మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఇక అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదస్పద భూమిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగా.. రామ్‌లల్లా, నిర్మోహ అఖోడా, సున్నీ వక్ఫ్ బోర్డు మధ్య ఈ వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు అప్పజెప్పడంతో ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్ తేల్చనుంది. ఇక అయోధ్యలో 67. 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా 1993లో స్టే విధించారు. 2010లో 2.77 ఎకరాల భూమిని అలహాబాద్ కోర్ట్ ముగ్గురికి పంచింది. ఈ తీర్పుపైనే ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. -
‘అయోధ్య మధ్యవర్తి’ తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాద కేసును మధ్యవర్తికి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సమస్య పరిష్కారానికి అర్హులైన మధ్యవర్తుల పేర్లు సూచించాలని కక్షిదారుల్ని కోరింది. ఈ వ్యవహారంలో త్వరలోనే ఆదేశాలు జారీచేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తెలిపింది. వివాద స్వభావం దృష్ట్యా మధ్యవర్తిత్వ మార్గం ఎంచుకోవడం సరైనది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సమస్య సద్దుమణిగేందుకు అవకాశం ఉన్నప్పుడే ఈ దిశగా యోచించాలని పేర్కొన్నారు. గతంలోనూ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కక్షిదారు రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు లాయర్ సీఎస్ వైద్యనాథన్ గుర్తుచేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కాబట్టి ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమి ప్రభుత్వానికే చెందుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆ స్థలంలో ఆలయం ఉండేదని గుర్తిస్తే, రామాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని 1994లో పీవీ ప్రభుత్వం కోర్టుకు మాట ఇచ్చిన సంగతిని ప్రస్తావించారు. వివాదం ఆస్తికే సంబంధించికాదని, సెంటిమెంట్లు, విశ్వాసాలతోముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలన్న కోర్టు సూచనకు ముస్లిం సంస్థలు అంగీకరించగా, హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. -
ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం
-
ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదివారం ప్రారంభించారు. సీఆర్డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనానికి కూడా జస్టిస్ రంజన్ గొగోయ్ శంకుస్థాపన చేశారు. ఇక, హైకోర్టు తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై ఇంతవరకూ పూర్తి స్పష్టత లేదు. ఫిబ్రవరి 15 అనంతరం ఈ భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. -
విజయవాడకు సీజేఐ జస్టిస్ గొగొయ్ రాక
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/గన్నవరం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌కు శనివారం గన్నవరం విమానాశ్రయంలో పలువురు న్యాయాధిపతులు, ప్రభుత్వాధిపతులు స్వాగతం పలికారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవానికి న్యూఢిల్లీ నుంచి విమానంలో జస్టిస్ రంజన్ గొగొయ్ దంపతులు విచ్చేశారు. వీరితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డిలు కూడా గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో సీజేఐ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మానవేంద్రనాథ్‌రాయ్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణ, రాజ్యసభ సభ్యులు కె.రవీంద్రకుమార్, జిల్లా న్యాయమూర్తి వై.లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం, నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావులు ఉన్నారు. దుర్గమ్మకు సీజేఐ ప్రత్యేక పూజలు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్‌రెడ్డి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌లు విచ్చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన న్యాయమూర్తులకు ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. సీజేఐతో చంద్రబాబు భేటీ సాక్షి, అమరావతి: సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్‌ను సీఎం చంద్రబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభానికి వచ్చిన జస్టిస్ గొగొయ్ నోవాటెల్ హోటల్లో విడిది చేశారు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబునాయుడు -
నేడు హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. సీఆర్డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే హైకోర్టు తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై ఇంతవరకూ పూర్తి స్పష్టత లేదు. ఫిబ్రవరి 15 అనంతరం ఈ భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. భవనాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారం పైభాగంలో మూడు సింహాల బొమ్మ ఏర్పాటు చేశారు. హైకోర్టులోని ఓ కోర్టు గది 2.5 లక్షల చ.అడుగుల్లో నిర్మాణం ఈ తాత్కాలిక భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. రూ.110 కోట్లతో జీ+2 అంతస్తుల్లో నిర్మించిన భవనాన్ని భవిష్యత్తులో జీ+ 5కు పెంచుకునే వెసులుబాటు ఉంది. 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఈ తాత్కాలిక భవన నిర్మాణాన్ని ప్రారంభించగా.. మొదటి అంతస్తులో కోర్టు హాళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. రెండో అంతస్తులో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. హైకోర్టు భవనం నాలుగు వైపులా రాజస్తాన్ స్టోన్‌ను పరిచారు. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన స్థలం కేటాయించారు. 100 అడుగుల స్తూపం జాతీయ జెండా ఎగురవేసేందుకు హైకోర్టు భవనం ఎదుట ఏర్పాటు చేసిన 100 అడుగుల స్తూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. హైకోర్టు భవనం పక్కనే జీ+5 అంతస్తుల్లో న్యాయవాదుల కోసం మరో భవనం నిర్మిస్తున్నారు. 2.5 లక్షల రికార్డులు భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గది, ప్రభుత్వ న్యాయవాదులకు చాంబర్లు, సువిశాలమైన క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారుల కోసం తాత్కాలిక హైకోర్టు భవనానికి వచ్చేందుకు వీలుగా విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి బస్సులు నడపనున్నారు. తాత్కాలిక భవనం ఎదురుగా న్యాయమూర్తులకు విల్లాలు సిద్ధం చేస్తున్నారు. ఆ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. నిఘా నీడలో నేలపాడు గుంటూరు: నేలపాడు గ్రామ పరిధిలో ఆదివారం హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీజేఐతో పాటు పలువురు సుప్రీం, తెలుగు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు హాజరవుతున్న కారణంగా భద్రతను మరింత పెంచారు. -
‘అయోధ్య’పై నూతన రాజ్యాంగ ధర్మాసనం
-
‘అయోధ్య’పై నూతన రాజ్యాంగ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై తొలుత ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మార్పులు చేశారు. తొలుత పేర్కొన్న ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యుయు లలిత్ స్థానంలో కొత్తగా జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లను తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే జస్టిస్ యుయు లలిత్ మాత్రం గతంలో అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులో లాయర్‌గా ఉన్నందున.. తాను ఈ ధర్మాసంలో కొనసాగలేనని తెలిపారు. తాజా నిర్ణయంతో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే, జస్టిస్ భూషణ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నజీర్‌లు సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ ధర్మాసనం జనవరి 29 నుంచి అయోధ్య వివాదంపై విచారణ చేపట్టనుంది. కాగా, జస్టిస్ దీపక్ మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అయోధ్య వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనంలో జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయోధ్య వివాదం విషయంలో వాదనలు వినేందుకు జనవరిలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత అక్టోబర్ 29న వెల్లడించింది. అయితే, అయోధ్య కేసులో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి వాదనలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
సీజేఐ బాటలో జస్టిస్ ఏకే సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్. నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ గురువారం ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్‌ను శుక్రవారం ఈ మరో బెంచ్ విచారించనుంది. ‘ఈ పిటిషన్‌ను విచారించలేను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవాల’ని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్ దవేతో జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. (‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ) సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించి ఆయన స్థానంలో తాత్కాలికంగా నాగేశ్వరరావును నియమించాలని జనవరి 10న నిర్ణయం తీసుకున్న ఉన్నతస్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. బెంచ్ నుంచి జస్టిస్ సిక్రీ తప్పుకోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఇప్పటికే బెంచ్ నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జస్టిస్ సిక్రీ కూడా వైదొలగడంతో ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా లేదన్న భావన ప్రజల్లో కలిగే అవకాశముందన్నారు. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు విచారణకు గొగోయ్ దూరం
-
ఆ కేసు విచారణకు గొగోయ్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున ఈనెల 24 నుంచి జరిగే ఈ కేసు విచారణకు దూరంగా ఉన్నానని, మరో బెంచ్ ఈ పిటిషన్‌ను విచారిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌కు పేర్ల కుదింపు, ఎంపిక, నియామకంలో పారదర్శకత ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా 1986 ఒడిషా కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును గత ఏడాది అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్దానాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వారిని ప్రభుత్వం సెలవుపై పంపింది. తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు వెనువెంటనే ఆస్ధానా అవినీతి కేసును విచారిస్తున్న డీఎస్పీ ఎకే బస్పీ, డీఐజీ ఎంకే సిన్హా,జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా పెద్దసంఖ్యలో అధికారులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు వర్మ, ఆస్ధానాల వ్యవహారం న్యాయస్ధానానికి చేరిన క్రమంలో నాగేశ్వరరావును ప్రభుత్వం అడిషనల్ డైరెక్టర్ స్ధాయికి ప్రమోట్ చేసింది. -
రామజన్మభూమి కేసు విచారణకై ప్రత్యేక ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసు విచారణ కొత్త ధర్మాసనానికి కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణకు అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఏర్పాటయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఉదయ్ లలిత్, జస్టిస్ చందర్ చూడ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆయోధ్య కేసును ఈ నెల 10న విచారణ చేపట్టనుంది. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేస్తున్న విషయం తెలిసిందే. -
అయోధ్యపై 4న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: అయోధ్య అంశం జనవరి 4వ తేదీన సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ఈ అంశంలో దాఖలైన పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాద ప్రాంతంపై దాఖలైన 14 పిటిషన్లపై విచారణ తేదీలను ఈ ధర్మాసనం ఖరారు చేయనుంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధార్ తీర్పుపై రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ చట్టం చెల్లుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఇంతియాజ్ అలీ పల్సనియా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పౌరుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందించే సాధనంగా ఆధార్ చట్టం మారిపోయిందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. -
రాజ్యాంగం పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాజ్యాంగం ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెడితే.. తీవ్ర భిన్నాభిప్రాయానికి, గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజయ్ గొగోయ్ హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పాటించడం దేశ ప్రయోజనాలకు మంచిదన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ‘కాన్‌స్టిట్యూషన్‌డే సెలబ్రేషన్స్’లో సోమవారం ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశ ఆధునిక పవిత్ర గ్రంధం అని రాజ్యాంగాన్ని రాష్ట్రపతి అభివర్ణించారు. వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో రాజ్యాంగ ప్రవచిత అంశాలను విధిగా పాటించాలన్నారు. రాజ్యాంగం బోధించే విలువలకు కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. -
30 రోజుల్లో 33 మంది జడ్జీల నియామకం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో జడ్జీల నియామక వేగం పెరిగింది. జస్టిస్ గొగోయ్ గతనెల 3న 46వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 30 రోజుల్లో ఆయన ఆరు సార్లు కొలీజియం భేటీని నిర్వహించారు. కొలీజియంలో సీజేఐతో కలుపుకుని ఐదుగురు జడ్జీలున్నారు. కలకత్తా, బాంబే, సిక్కిం, గౌహతి, ఉత్తరాఖండ్ హైకోర్టులకు ప్రధాన జడ్జీలను కొలీజియం నియమించింది. బాంబే, కలకత్తా హైకోర్టుల్లోనే న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఎన్‌హెచ్ పాటిల్, డీకే గుప్తాలను అవే హైకోర్టుల ప్రధాన జడ్జీలుగా నియమించేందుకు ఎంవోపీ (మెమరాండం ఆఫ్ ప్రొసీజర్)ను కొలీజియం వినియోగించింది. సాధారణంగా ఇలా చేయడం అరుదు. కర్ణాటక, కేరళ, మద్రాస్, గౌహతి, మధ్యప్రదేశ్, కలకత్తా, పంజాబ్, హరియాణ, అలహాబాద్, ఒడిశా, ఉత్తరాఖండ్ హైకోర్టులకు కొత్త జడ్జీల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది. -
ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సుభాష్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రామయ్యగారి సుభాష్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు జడ్జీలు కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నేడు బాధ్యతలు చేపట్టారు. వీరిలో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అజయ్ రస్తోగిలు ఉన్నారు. వీరిచే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుభాష్‌రెడ్డిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్తగా నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టడంతో.. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. సుప్రీంలో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుభాష్ రెడ్డి.. మండల కేంద్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సాధించారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వివిధ బాధ్యతలు చేపట్టారు. 2016 ఫిబ్రవరి 13 నుంచి గుజరాత్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. -
అత్యవసర విచారణ అక్కర్లేదు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం అయోధ్య కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై బీజేపీతోపాటు పలు హిందుత్వ సంఘాలు నిరసన తెలిపాయి. రామమందిర నిర్మాణంలో జాప్యంతో హిందువుల్లో సహనం నశిస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్ కిశోర్ వ్యాఖ్యానించగా మందిర నిర్మాణం కోసం వెంటనే ఆర్డినెన్స్, లేదా పార్లమెంట్లో చట్టం తేవాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కాగా, అయోధ్య వివాదంలో కోర్టులు ఏమీ చేయలేవని శివసేన పేర్కొంది. మాకు వేరే ప్రాథమ్యాలున్నాయి.. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తేదీలను వచ్చే ఏడాది జనవరిలో ఖరారు చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘అయోధ్య వివాదాస్పద భూమిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సముచిత ధర్మాసనం విచారణ చేపడుతుంది. విచారణ తేదీలను ఆ ధర్మాసనం వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్ణయిస్తుంది’ అని తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రామ్‌లల్లా తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ లాయర్ సీఎస్ వైద్యనాథన్ కోరగా స్పందించిన ధర్మాసనం..‘మాకు వేరే ప్రాథామ్యాలున్నాయి. ఈ వివాదంపై జనవరి, ఫిబ్రవరి లేక మార్చిలోనా ఎప్పుడు విచారణ చేపట్టాలో ఆ ధర్మాసనం నిర్ణయిస్తుంది’ అని పేర్కొంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా వర్గాల మధ్య సమానంగా విభజించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. హిందువుల్లో సహనం నశిస్తోంది: న్యాయస్థానాలపై తమ ప్రభుత్వానికి గౌరవం, విశ్వాసం ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే, మెజారిటీ ప్రజలు ఈ విషయంలో త్వరగా తుది తీర్పు వెలువరించాలని కోరుతున్నారన్నారు. రామ మందిరం ఆలస్యంపై హిందువుల్లో సహనం నశిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ కిశోర్ అన్నారు. ప్రభుత్వం ముందున్న మార్గాలు అయోధ్య పరిష్కారంపై ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందు 4 మార్గాలున్నట్లు భావిస్తున్నారు. అవి 1. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా ఎదురుచూడటం, 2. రామాలయం నిర్మాణానికి వీలుగా ఆర్డినెన్స్ తేవడం, 3. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, 4. రథయాత్ర మాదిరి ఉద్యమాన్ని ప్రారంభించడం. వెంటనే ఆర్డినెన్స్ తేవాలి: హిందుత్వ సంస్థలు ‘త్వరలో ఈ వివాదాన్ని కోర్టు తేల్చాలి. మందిరం నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలను ప్రభుత్వం తొలగించాలి. వెంటనే రామాలయాన్ని నిర్మించాలి. ఆలయ నిర్మాణంతోనే దేశంలో మతసామరస్యం, ఐక్యతా భావం పెంపొందుతాయి’ అని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అరుణ్ కుమార్ తెలిపారు.రామాలయాన్ని నిర్మించటానికి వీలుగా కేంద్రం చట్టం తేవాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ కోరారు. లేని పక్షంలో జనవరిలో అలహాబాద్ కుంభమేళాలో తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. రాముని జన్మస్థలం అయోధ్యలోనే రామమందిరం కట్టాలని కోరుతున్నాం. అంతేతప్ప, పాకిస్తాన్లో కాదని శివసేన పేర్కొంది. -
‘మీటూ’కి సుప్రీంలో చుక్కెదురు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ’ ఉద్యమానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మీటూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిందిగా న్యాయవాది ఎమ్.ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు మీటూపై దాఖలైన ప్రజా ప్రయోజనం వ్యాజ్యంను అత్యవసర విచారణగా భావించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన గగోయ్, ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మసనం సోమవారం ప్రకటించింది. ప్రముఖులపై ప్రకంపనలు సృష్టిస్తున్న లైంగిక ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి, ఫిర్యాదు చేసిన మహిళలకు జాతీయ మహిళా కమిషన్ ద్వారా రక్షణ కల్పించాలని పిటిషనర్ ఇటీవల సుప్రీంకోర్టును కోరారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం (2013) ప్రకారం పని ప్రదేశాల్లో ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో నానా పటేకర్ తనని లైంగిక వేధింపులకు గురిచేశారని, నటి తనుశ్రీ సంచలన ఆరోపణలకు ఇటీవల తెరతీసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని ఆరోపణలు చివరికి కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామా వరకు వచ్చాయి. కాగా మీటూపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం తొసిపుచ్చిన నేపథ్యంలో సాధారణ పిటిషన్లతో పాటు షెడ్యూల్ ప్రకారం దానిని కూడా విచారించనుంది. -
న్యాయమూర్తులకు ‘నో లీవ్’ పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్ కేసులు పేరుకుపోవడంతో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రంజన్ గగోయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తులకు పనిదినాల్లో ‘నో లీవ్’ పాలసీని ముందుకుతెచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 3న ప్రమాణ స్వీకారం చేసిన రోజే జస్టిస్ గగోయ్ న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కోర్టు పెండింగ్ కేసుల క్లియరెన్స్ కోసం పనిదినాల్లో సెలవులు తీసుకోరాదనే విధాన నిర్ణయంపై సంకేతాలు పంపినట్టు సమాచారం. హైకోర్టుల్లో న్యాయమూర్తులు పనిదినాల్లో సెలవులు తీసుకోకుండా, కోర్టు రూముల్లో విధిగా హాజరుకావాలని జస్టిస్ గగోయ్ విస్పష్టంగా చెప్పినట్టు ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెల్లడించినట్టు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఇక సుప్రీంలో వివిధ బెంచ్‌లకు కేసుల కేటాయింపు కోసం జస్టిస్ గగోయ్ నూతన రోస్టర్‌ను తీసుకువచ్చారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తనతో పాటుగా తన తర్వాత సీనియర్ అయిన మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని బెంచ్‌లు విచారణ చేపట్టాలని జస్టిస్ గగోయ్ నిర్ణయించారు. ప్రాధాన్యత, తక్షణ అవసరాలకు అనుగుణంగా కేసుల విచారణకు నూతన ప్రమాణాలను అనుసరించాలని జస్టిస్ గగోయ్ న్యాయవాదులకు సంకేతాలు పంపారు. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే కేసుల తక్షణ విచారణకు ముందుకు రావద్దని ఆయన కోరారు. -
46వ సీజేఐగా జస్టిస్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ (63) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంతటి కీలక బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ గొగోయ్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన గొగోయ్ కోర్టు నంబర్ 1 (సీజేఐ కోర్టు)లో సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడారు. కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, అంతవరకు.. ఉరిశిక్ష, దేశ బహిష్కరణ శిక్షలకు సంబంధించిన కేసులు మినహా ఇతర ఏ కేసులను కూడా అత్యవసరంగా విచారించాలంటూ.. కోర్టు ముందుకు తీసుకురావద్దని సూచించారు. నవంబర్ 17, 2019లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. వస్తూనే రోస్టర్‌పై ఈయన తన ముద్ర చూపించారు. కేసుల కేటాయింపులో పలు మార్పులు చేశారు. దేశానికి ఆ అనుభవం అవసరం: మోదీ సీజేఐగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు కూడా హాజరయ్యారు. ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విశేషానుభవం, అంతఃశుద్ధి, న్యాయపరమైన అంశాలపై నైపుణ్యత దేశానికి ఎంతగానో మేలుచేస్తాయని భావిస్తున్నాను. ఆయన పదవీకాలం ఫలప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2న సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా జస్టిస్ గొగోయ్ ఎంపికపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. సీనియారిటీ ప్రకారం ఆయన్నే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఈయనను తదుపరి సీజేఐగా ప్రతిపాదించారు. ఈ ఏడాది జనవరి 11న సుప్రీంకోర్టు నలుగురు సీనియర్లు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో (జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ జోసెఫ్ కురియన్) నాటి సీజేఐ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. కోర్టు నంబర్ 1లో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనంతో కలిసి జస్టిస్ గొగోయ్ న్యాయవాదులతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత, అత్యవసరంగా విచారించాల్సిన కేసుల పేరుతో కోర్టుముందుకు పిటిషన్లు తీసుకురావద్దని వారికి సూచించారు. ఇలాంటి కేసుల విచారణ విషయంలో పలు నిబంధనలను మార్చాల్సి ఉన్నందున అంతవరకు అత్యవసర కేసులను స్వీకరించబోమని సీజేఐ స్పష్టం చేశారు. ‘కొన్ని నిబంధనలను మార్చాలని భావిస్తున్నాం. ఆ తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. రేపు ఎవర్నయినా ఉరితీస్తున్నారు. దీన్ని ఆపాల్సిందే అనే పరిస్థితి ఉంటే.. మేమే దాన్ని అత్యవసరంగా అర్థం చేసుకుంటాం. అవి మినహా మిగిలిన కేసుల్లో అత్యవసరాన్ని చేర్చకండి’ అని సీజేఐ గొగోయ్ సూచించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్ర మంలో గొగోయ్ మాట్లాడుతూ.. ‘నేను, నా సహచరులు కలిసి ఉత్తమమైన ఫలితాలు సాధించే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాం. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. కేసుల ఫైలింగ్, లిస్టింగ్ మధ్య సమయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నాం. జాబితా నుంచి కేసులు తొలగించకుండా ఉండే వ్యవస్థను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. రోస్టర్‌పై గొగోయ్ ముద్ర గొగోయ్ బాధ్యతలు స్వీకరించగానే సుప్రీంకోర్టులో రోస్టర్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో తాజా మార్పులను ఉంచారు. సీజేఐ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 3 నుంచి తదుపరి సవరణలు వచ్చేంతవరకు కొత్త కేసులకు ఇదే రోస్టర్ అమలవుతుందని అందులో పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొత్త సీజేఐ తన వద్దే ఉంచుకున్నారు. ఈయన నేతృత్వంలోని ధర్మాసనం.. సామాజిక న్యాయం ఎన్నికలు, కంపెనీ చట్టాలు, గుత్తాధిపత్యం, నియంత్రిత వాణిజ్య విధానాలు, ట్రాయ్, సెబీ, బీమా, ఆర్బీఐ, మధ్యవర్తిత్వం, హెబియస్ కార్పస్, క్రిమినల్ కేసులు, కోర్టు ధిక్కరణ, సాధారణ సివిల్ అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ బీ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం కేసులతోపాటు లేఖల ఆధారిత విషయాలు, భూ సేకరణ, అటవీ, పర్యావరణానికి సంబంధించిన కేసులు అప్పజెప్పారు. చేతల్లోనూ ఆదర్శప్రాయుడు! ఉన్నత కుటుంబంలో భోగభాగ్యాల మధ్య పెరిగినా సాధారణ జీవితం గడపడంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తన ఆస్తులు, ఆదాయం ఇతర విషయాల్లో దాపరికానికి అవకాశం లేని విధంగా తన స్థిర, చరాస్తులు, ఇతర ఆర్థిక వ్యవహారాల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడించారు. ప్రస్తుతమున్న 25 మంది సిట్టింగ్ జడ్జీల్లో 11 మందే ఈ విధంగా ఆస్తుల ప్రకటన చేశారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినపుడే ఇచ్చిన డిక్లరేషన్‌లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, వివాహ సమయంలో భార్యకు పుట్టింటి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్టు ప్రకటించారు. సొంత వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకు రుణాలు కూడా లేవు. రెండు బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.6.5 లక్షలు, రూ.16 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. 1999లో తీసుకున్న రూ.5 లక్షల విలువైన ఎల్ఐసీ పాలసీ ముగిశాక వచ్చిన డబ్బే ఆయన బ్యాంకు బాలెన్స్‌లో ప్రధాన వాటాగా నిలుస్తోంది. పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1.6 లక్షల విలువైన బంగారాన్ని కొన్నా రు. 1999లో గువాహటిలో కొనుగోలు చేసిన రూ.1.10 లక్షల విలువైన స్థలాన్ని 2018 జూన్ 6న విక్రయించారు. అస్సాంలోని కామ్రూప్ జిల్లా జపోరిగోగ్ బెల్టోలా గ్రామంలో తల్లి ద్వారా సంక్రమించిన కొంత భూమి (అందులో నిర్మించిన ఇంటిని కూల్చివేశారు) మాత్రమే కలిగి ఉన్నారు. దిబ్రూగఢ్ నుంచి సీజేఐగా 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆయన జన్మించారు. 1978 లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గువాహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్ చేశారు. 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.2010, సెప్టెంబర్ 9న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
‘పెండింగ్’ సమస్యకు పరిష్కారం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు భారంగా మారిన పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించేందుకు తన వద్ద ఒక ప్రణాళిక ఉందని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సోషల్ ఇంజనీరింగ్‌లో బార్ అండ్ బెంచ్ పాత్ర’అనే అంశంపై శనివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో గొగోయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు సంబంధించి న వాటిలో రెండు సమస్యలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయన్నారు. వాటిలో పెండింగ్ కేసుల సమస్య ఒకటి అని తెలిపారు. ఇది మొత్తం న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు చాలా కాలం పాటు శిక్ష అనుభవించిన తర్వాత తీర్పు రావడం అనేది మరో సమస్య అని పేర్కొ న్నారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు తరాల తర్వాత తీర్పు రావడం జరుగుతుందని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అయినప్ప టికీ పరిష్కరించడం సులువేనని వెల్లడించారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి తన వద్ద ఉన్న ప్రణాళికలు ఉన్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తమ మద్దతు ఇవ్వాల్సిందిగా బార్ అండ్ బెంచ్‌ను కోరారు. జిల్లా కోర్టుల్లో 5,950 పోస్టులు.. దేశంలో ఉన్న జిల్లా కోర్టులన్నింటిలో కలిపి 5,950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గొగోయ్ తెలిపారు. జడ్జీల పదవీ కాలం తక్కువ ఉండటం వల్ల ఎలాంటి సమస్య లేదని, చీఫ్ జస్టిస్‌లు మారుతుండటం వల్ల కేసుల ప్రాధాన్యత కూడా మారుతోందని వ్యాఖ్యానిం చారు. దీనికి సంబంధించి న్యాయవ్యవస్థలో ఒక స్థిరమైన విధానాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, సరైన పాలసీతో కేసులను పరిష్కరిస్తే ఇది పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా పదవీ విరమణ అనంతరం సీజేఐగా గొగోయ్ బుధవారం (3న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
తదుపరి సీజేఐగా జస్టిస్ గొగోయ్!
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి సుప్రీంలో తన తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ గొగోయ్ పేరును మిశ్రా ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ దీపక్ మిశ్రా చేసిన సిఫార్సును త్వరలోనే కేంద్ర న్యాయశాఖకు పంపనున్నట్లు వెల్లడించాయి. అన్ని సవ్యంగా సాగితే అక్టోబర్ 3న జస్టిస్ గొగోయ్ సీజేఐగా ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సాధారణంగా పదవీకాలం ముగిసేందుకు నెల రోజుల ముందుగా తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సీజేఐని కోరుతుంది. దీంతో తన తర్వాత అత్యంత సీనియర్‌ను తర్వాతి సీజేఐగా ప్రస్తుత సీజేఐ ప్రతిపాదిస్తారు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం కేంద్రం తదుపరి సీజేఐ నియామకంపై జస్టిస్ మిశ్రాకు లేఖ రాసింది. దీంతో సంప్రదాయాన్ని అనుసరించి జస్టిస్ గొగోయ్ పేరును జస్టిస్ దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు నిర్వహణతో పాటు కేసుల కేటాయింపులో సీజేఐ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రిటైర్డ్ జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలసి జస్టిస్ గొగోయ్ ఈ ఏడాది జనవరిలో మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ గొగోయ్ పేరును సీజేఐ మిశ్రా ప్రతిపాదించకపోవచ్చని వార్తలొచ్చాయి. సీజేఐ ప్రతిపాదనలను న్యాయశాఖ ప్రధాని ముందు ఉంచుతుంది. అనంతరం కొత్త సీజేఐ నియామకంపై ప్రధాని రాష్ట్రపతికి సలహా ఇస్తారు. అసోం నుంచి సుప్రీంకోర్టు వరకూ.. జస్టిస్ గొగోయ్ 1954, నవంబర్ 18న అసోంలో జన్మించారు. 1978లో బార్ అసోసియేషన్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత గొగోయ్ గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001, ఫిబ్రవరి 28న గొగోయ్ గువాహటి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, సెప్టెంబర్‌లో పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీఅయిన గొగోయ్, మరుసటి ఏడాది ఫిబ్రవరిలో అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్ 23న జస్టిస్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అసోంలో ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ను గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనమే పర్యవేక్షించింది. మద్రాస్ హైకోర్టు వివాదాస్పద మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును జస్టిస్ చలమేశ్వర్‌తో కలసి విచారించారు. అయితే 2016లో సౌమ్య అనే యువతి రేప్, హత్య కేసులో దోషికి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం యావజ్జీవంగా మారుస్తూ ఇచ్చిన తీర్పుపై అన్నివర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. -
జస్టిస్ గొగోయ్‌కి అన్ని అర్హతలున్నాయి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని శుక్రవారం పదవీవిరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ధర్మాసనాల కేటాయింపు సహా పలు అంశాలపై సీజేఐ తీరును తప్పుబడుతూ జనవరి 12న తనతో పాటు మరో ముగ్గురు జడ్జిలు కలిసి పెట్టిన ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని పలువురు మాజీ సీజేఐలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు సరైన దిశలో ఆలోచించే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో సమస్య ఉందని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో మరింత పారదర్శకత రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతిపై మరింత తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టిన రోజు తన ఇంటికి సీపీఐ నేత రాజా రావడంపై స్పందిస్తూ.. రాజా తనకు చాన్నాళ్ల నుంచి మిత్రుడని, తామిద్దరమూ మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులమేనని తెలిపారు. ఆ రోజు(ప్రెస్ మీట్ పెట్టిన రోజు) తన ఇంటి ముందు భారీగా మీడియా ఉండటంతో.. ఏం జరిగిందనే ఆందోళనతో ఆయన వచ్చారని వివరించారు. ‘అయితే, అప్పటికి మరికొన్ని వారాల్లో నేను రిటైర్ అవబోతున్నా. అప్పుడు నా ఇంటికి ఎవరొచ్చారనే విషయం కన్నా.. అధికారంలో ఉన్నవారితో ఎవరు(న్యాయమూర్తులు) సమావేశమవుతున్నారనేది మరింత కీలకమైన అంశం’ అని చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థలో, న్యాయపరమైన అంశాల్లో సీనియర్ మోస్ట్ జడ్జి, అత్యంత జూనియర్ జడ్జి సమానమే. అయితే, ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐకి కొన్ని అదనపు పరిపాలనాపరమైన అధికారాలుంటాయి’ అని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా విచారణకు వచ్చిన ఒక కేసుకు సంబంధించి తాను ఏర్పాటు చేసిన ఐదుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జస్టిస్ జోసెఫ్ సమర్ధుడు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సమర్ధుడైన న్యాయమూర్తి అయిన జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించేందుకు, ఆయన పేరును కొలీజియం మరోసారి సిఫారసు చేయాలన్నారు. జస్టిస్ జోసెఫ్ తన ప్రాంతంవాడో, తన భాషవాడో, తన మతం వాడో కాదని, అయినా ఆయన పదోన్నతి కోసం పోరాడానని వివరించారు. కొలీజియంలోకి జస్టిస్ ఏకే సిక్రీ! సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్తో సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ ఏకే సిక్రీ ఐదుగురు సభ్యుల బృందంలో చోటు దక్కించుకోనున్నారు. -
దిద్దుబాటే శ్రేయస్కరం
సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియాతో మాట్లాడటమే అపూర్వమైన అంశం అయితే వారు అందించిన సందేశం దిగ్భ్రాంతికరమైనది. జస్టిస్ లోధా, జస్టిస్ ఠాకుర్ వంటి మాజీ ప్రధాన న్యాయమూర్తులూ, మాజీ సొలిసిటర్ జనరల్ సోలీ సొరాబ్జీ వంటి న్యాయకోవిదులూ ఈ పరిణామం దురదృష్టకరమైనదనీ, అవాంఛనీయమైనదనీ అభివర్ణించారు. న్యాయమూర్తులు చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయనీ, న్యాయవ్యవస్థను వేధిస్తున్న సమస్యలను వెల్లడిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయం కూడా ఉంది. సుప్రీంకోర్టులో అనుభవం రీత్యా, పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా తర్వాత అగ్రగణ్యులైన నలుగురు న్యాయమూర్తులు సంప్రదాయం, నియమావళి పేరుతో తమను కట్టిపడవేసిన బంధనాలను తెంచుకొని, తెగించి ప్రజల ముందుకు వచ్చారంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రజలే కాపాడుకోవాలనీ వారు చెప్పారంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తిని కలసి సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. బహుశా రాష్ట్రపతిని కలసి ఆయనకు సమస్యను నివేదించి ఉంటే ప్రయోజనం ఉండేదేమో! నలుగురూ నిష్ణాతులే ఇప్పుడు వివాదం సృష్టించడం వల్ల ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేదు. పైగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చే అక్టోబర్ 2న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అలంకరించే అవకాశం ఉన్న రంజన్ గొగోయ్ తక్కిన ముగ్గురితో గొంతు కలపడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టదాయకంగా పరిణమించవచ్చు. జస్టిస్ చలమేశ్వర్ పదవీ కాలం ఈ యేడాది జూన్ 22తో ముగుస్తుంది. జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29 వరకే పదవిలో ఉంటారు. జస్టిస్ లోకుర్ సైతం డిసెంబర్ 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. నెలా, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోయే వారిని ప్రధాన న్యాయమూర్తి పీఠంపైన కూర్చో»ñ ట్టే సంప్రదాయం లేదు కనుక 2019 నవంబర్ 17 వరకూ పదవీకాలం కలిగిన గొగోయ్‌కి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ముగ్గురు సహచరులతో కలసి తిరుగుబాటు చేయడం నిజంగా సాహసమే. జస్టిస్ చలమేశ్వర్ చెప్పినట్టు, భావితరాలు తమను తప్పుపట్టకుండా తగిన సమయంలో ప్రశ్నించవలసిన బాధ్యతను నెరవేర్చామని గొగోయ్ సైతం భావిం చారు. జాతి రుణం తీర్చుకుంటున్నామని స్వయంగా చెప్పారు. ఇది ఎంతో గంభీ రమైన విషయం కాకపోతే అంత బరువైన మాటలు న్యాయమూర్తులు ఉపయోగించేవారు కాదు. సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండే నైజం గొగోయ్‌కి ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ను కోర్టు ధిక్కార నేరంపైన జైలుకు పంపించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగపీఠంలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. చీఫ్ జస్టిస్ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ (నెంబర్ 2) నిష్కర్షగా వ్యవహరించి వివాదాలకు కేంద్రమైనారు. న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (నేషనల్ జుడిషియల్ అపాయంట్మెంట్స్ కమిషన్–ఎన్జెఎస్సి) ప్రమేయంతో జరగాలని భావించి మెజారిటీ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం 2015 డిసెం బర్ 16న వెలువరించిన తీర్పులో తన అసమ్మతిని జస్టిస్ చలమేశ్వర్ (1:4) నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో 66(ఎ) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడం ద్వారా భావ ప్రకటనాస్వేచ్ఛకు దన్నుగా నిలిచారు. కొలీ జియం వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ పారదర్శకంగా ఉండాలని వాదించే ప్రముఖులలో చలమేశ్వర్ ప్రథములు. సీనియారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న లోకుర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కూడా ఉన్నారు. రాజకీయవాదులు మతం పేరుతో ఓట్లు అడగరాదంటూ ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తులలో ఆయన ఒకరు. అయిదో స్థానంలో ఉన్న కురియన్ త్రిపుల్ తలాఖ్ చెల్లనేరదని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి. ఈ నలుగురూ మీడియాతో మాట్లాడటాన్ని తప్పు పట్టినవారు సైతం వారి రుజువర్తనం, నిజాయితీ, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, ధర్మనిరపేక్షత, నిబద్ధత పట్ల లవలేశమంత సందేహం వెలిబుచ్చలేదు. ముదిరిన విభేదాలు కడచిన రెండు మాసాలలో సంభవించిన కొన్ని పరిణామాలు ఒకానొక అసాధారణ పరిస్థితిని సృష్టించాయి. ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు నడిపే మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కుంభకోణంపైన రగిలిన వివాదం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్లు అన్యాపదేశంగా ఆరోపించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను పురస్కరించుకొని ఈ కేసు విచారణకు ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో ఒక బెంచ్‌ని నెలకొల్పుతూ జస్టిస్ చలమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, చలమేశ్వర్ ఏర్పాటు చేసిన బెంచ్‌ని రద్దు చేసి ఆయన స్వయంగా తన ఆధ్వర్యంలోనే ఒక బెంచ్‌ని నియమించారు. ‘చీఫ్ జస్టిస్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అని ఏ కేసు ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందంటూ 1998లో రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు నెలకొల్పిన సంప్రదాయాన్ని జస్టిస్ దీపక్‌మిశ్రా గుర్తు చేశారు. నిజానికి చీఫ్ జస్టిస్ సమానులలో ప్రథముడే (ఫస్ట్ ఎమాంగ్ ఈక్వెల్స్) కానీ అందరి కంటే అధికుడు కారని నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. తక్కినవారంతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులైతే (జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు) చీఫ్ జస్టిస్ దేశానికి ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా). అంతమాత్రాన విశేషాధికారాలను వినియోగించే క్రమంలో పక్షపాతం కానీ స్వప్రయోజనాలు కానీ ఉన్నట్టు కనిపిస్తే ప్రధాన న్యాయమూర్తిని సైతం ప్రశ్నించే అధికారం న్యాయమూర్తులకూ, న్యాయవాదులకూ, సామాన్య పౌరులకూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏదైనా కేసు విచారించేందుకు నియమించిన పీఠాన్ని విస్తరించాలంటే కొత్తగా కొందరు న్యాయమూర్తులను చేర్చుతారు కానీ ఉన్నవారిని తొలగించరు. ఉదాహరణకు ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్‌ని విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల బెంచ్గా విస్తరించాలంటే కొత్తగా ముగ్గురిని నియమిస్తారు కానీ, మొదటి ఇద్దరిలో ఎవ్వరినీ తొలగించరు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మెడికల్ కుంభకోణం కేసు విచారించడానికి జస్టిస్ మిశ్రా నియమించిన బెంచ్‌లో జస్టిస్ చలమేశ్వర్ లేరు. రెండు, గుజరాత్ పరిణామాలకు సంబంధించి సోహ్రాబుద్దీన్ అనే వ్యక్తిని ‘బూటకపు ఎన్ కౌంటర్’ చేశారనే ఆరోపణను విచారిస్తున్న సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసు. నాగపూర్‌లో తన సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితులలో 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో లోయా మరణించారు. ఈ కేసు ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిందితుడు. అనంతరం షా పేరు నిందితుల జాబితా నుంచి తొలగించారు. లోయా మరణానికి సంబంధించిన కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులో నడుస్తుంటే దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఒక పిటిషన్ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తులకు కాకుండా సీనియారిటీ జాబితాలో పదో స్థానంలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కి పోస్ట్ చేశారు. లోయా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌నూ, ఇతర పత్రాలను సుప్రీం కోర్టులో జనవరి 15 నాడు సమర్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కౌన్సెల్ నిశాంత ఆర్ కర్నేశ్వార్కర్కు సుప్రీంకోర్టు పురమాయించింది. సాధారణంగా హైకోర్టులో విచారించవలసిన అంశాలు సుప్రీంకోర్టుకు వస్తే ముందు హైకోర్టుకు వెళ్ళండి అని పిటిషనర్లను న్యాయమూర్తులు ఆదేశిస్తారు. లోయా కేసు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పైగా బొంబాయ్ లాయర్ల సంఘం ఈ కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులోనే జరగాలని కోరుతోంది. ఈ సంఘం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముంబయ్‌కి చెందిన జర్నలిస్టు బీఆర్ లోన్ తరఫున ఇందిరా జైసింగ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ వకీలుగా వరీందర్ కుమార్ శర్మ మరో పిటిషన్ వేశారు. వీరందరి ప్రార్థనా ఒక్కటే. ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించవద్దు, బొంబాయ్ హైకోర్టులో విచారణ కొనసాగించాలి. ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసును సీనియర్ల నాయకత్వంలోని బెంచ్‌కి అప్పచెప్పకుండా జూనియర్‌కు పంపించడం వివాదాస్పదం అయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ సమానులే. సీనియర్, జూనియర్ అనే భేదం లేదు. కానీ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసులు సీనియర్లకు కేటాయించడం రివాజు. ప్రధాన న్యాయమూర్తిదే బాధ్యత ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారక ముందే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సోమవారం నుంచి తాము యథావిధిగా సుప్రీంకోర్టుకు వెడతామని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. శనివారంనాడు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల సమావేశాలు జరిగాయి. బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయమూర్తులు మీడియాను కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. వివాదం పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. లోయా కేసులో క్షుణ్ణంగా విచారణ జరగాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం అనవసరమైన రాజకీయ జోక్యమంటూ విమర్శించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతించింది. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడటం పట్ల బార్ అసోసియేషన్ అభ్యంతరం చెప్పలేదు కానీ పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. లోయా కేసు సహా అన్ని ‘పిల్’లనూ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలోని బెంచ్లే విచారించాలని బార్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉంది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేస్తుందని నిర్ణయించిన అనంతరం ఆ నిర్ణయం అమలు జరగాలంటే సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒక ఒప్పంద పత్రం (మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్–ఎంఓపీ) ఉండాలి. ఈ పత్రాన్ని తయారు చేయడంలో సహకరించడానికి అటార్నీ జనరల్ ముకుల్ రోహట్గీ నిరాకరించినప్పుడు ‘మీరు అటార్నీ జనరల్ దేశానికా లేక ప్రస్తుత ప్రభుత్వానికా?’ అంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఎద్దేవా చేశారు. ఎంఓపీని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపి నెలలు గడిచిపోతున్నా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తిగా తనను నియమించడానికి నిరాకరించారంటూ లూత్రా అనే న్యాయవాది వేసిన పిల్పైన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన బెంచ్ తీర్పు ఇస్తూ ఎంఓపీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయి కోర్టులలో ఖాళీలు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైతే, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే న్యాయమూర్తులు తమ వంతు కర్తవ్యం నెరవేర్చినట్టే. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా పెద్దమనసుతో నిర్వహించాలి. న్యాయమూర్తులనూ, న్యాయవాదులనూ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రధానంగా ఆయనదే. కె. రామచంద్రమూర్తి -
లోక్‌పాల్‌పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌పాల్ నియామకం చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. అందరి వాదనలు విన్నామని, తీర్పును రిజర్వులో ఉంచుతున్నామని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. లోక్‌పాల్ చట్టంలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేతకు సంబంధించిన నిర్వచనం విషయంలో చేపట్టిన సవరణలు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లోక్‌పాల్ నియామకం సాధ్యపడదని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం– 2013 ప్రకారం లోక్‌పాల్ ఎంపిక ప్యానెల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. అయితే ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం గమనార్హం. లోక్‌సభలో కాంగ్రెస్ అతి పెద్ద విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసర మైన సంఖ్యాబలం దానికి లేదని, అందువల్ల కాంగ్రెస్‌కు ఆ పదవి ఇవ్వలేదని అటార్నీ జనరల్ వివరించారు. అతిపెద్ద విపక్షపార్టీ నేతను ప్రతిపక్ష నేతగా చేస్తూ తలపెట్టిన సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు లోక్‌పాల్ నియామకం సాధ్యం కాదని రోహత్గీ స్పష్టం చేశారు. లోక్‌పాల్ నియామకం చేపట్టాలం టూ ఎన్జీవో కామన్ కాజ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్జీవో తరఫున సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ వాదనలు విని పిస్తూ బిల్లు 2013లో పార్లమెంటు ఆమోదం పొందిందని, 2014లో అమలులోకి వచ్చిందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లోక్‌పాల్‌ను నియమించట్లేదన్నారు.