
జస్టిస్ రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు భారంగా మారిన పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించేందుకు తన వద్ద ఒక ప్రణాళిక ఉందని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సోషల్ ఇంజనీరింగ్‌లో బార్ అండ్ బెంచ్ పాత్ర’అనే అంశంపై శనివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో గొగోయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు సంబంధించి న వాటిలో రెండు సమస్యలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయన్నారు. వాటిలో పెండింగ్ కేసుల సమస్య ఒకటి అని తెలిపారు.
ఇది మొత్తం న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు చాలా కాలం పాటు శిక్ష అనుభవించిన తర్వాత తీర్పు రావడం అనేది మరో సమస్య అని పేర్కొ న్నారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు తరాల తర్వాత తీర్పు రావడం జరుగుతుందని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అయినప్ప టికీ పరిష్కరించడం సులువేనని వెల్లడించారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి తన వద్ద ఉన్న ప్రణాళికలు ఉన్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తమ మద్దతు ఇవ్వాల్సిందిగా బార్ అండ్ బెంచ్‌ను కోరారు.
జిల్లా కోర్టుల్లో 5,950 పోస్టులు..
దేశంలో ఉన్న జిల్లా కోర్టులన్నింటిలో కలిపి 5,950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గొగోయ్ తెలిపారు. జడ్జీల పదవీ కాలం తక్కువ ఉండటం వల్ల ఎలాంటి సమస్య లేదని, చీఫ్ జస్టిస్‌లు మారుతుండటం వల్ల కేసుల ప్రాధాన్యత కూడా మారుతోందని వ్యాఖ్యానిం చారు. దీనికి సంబంధించి న్యాయవ్యవస్థలో ఒక స్థిరమైన విధానాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, సరైన పాలసీతో కేసులను పరిష్కరిస్తే ఇది పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా పదవీ విరమణ అనంతరం సీజేఐగా గొగోయ్ బుధవారం (3న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment