ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలకు సారథులేరీ!
ఏడు నెలలుగా హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీ
నెలన్నర క్రితం లోకాయుక్త చైర్మన్ పదవీకాలం పూర్తి
నియామకానికి చర్యలు చేపట్టని సర్కారు
90 రోజుల్లోనే నియమించాలన్న సుప్రీం మార్గదర్శకాలకూ తూట్లు
హెచ్‌ఆర్‌సీలో పేరుకుపోతున్న కేసులు
ఉచిత న్యాయసేవలు అందించే సంస్థలపై శీతకన్ను
మంచిది కాదంటున్న నిపుణులు
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జరపాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పేదలకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్)
ఏడు నెలలు గడిచినా చలనంలేదు..
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్ సభ్యుడిగా దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది.
అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు ఎన్‌జీఓల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్‌లో సీనియర్ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్ మూడేళ్లపాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.
లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..
ఇక లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్‌ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ ఎంపిక చేస్తారు. లోకాయుక్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని నియమిస్తారు.
మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చులేకుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పంపుతారు. లెటర్ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసినా వాది, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణలు జరుపుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు.
పేదలకు ఉచిత న్యాయ సేవలు..
హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తలను ఆశ్రయించి న్యాయం పొందుతారు. కానీ, ఇప్పుడివి లేకపోవడంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. – కృష్ణమూర్తి, బార్ అసిసోయేషన్ అధ్యక్షుడు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment