Free Legal Services
-
ఇది ‘న్యాయ’మేనా!
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జరపాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పేదలకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్)ఏడు నెలలు గడిచినా చలనంలేదు..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్ సభ్యుడిగా దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు ఎన్జీఓల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్లో సీనియర్ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్ మూడేళ్లపాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..ఇక లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్‌ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ ఎంపిక చేస్తారు. లోకాయుక్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని నియమిస్తారు. మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చులేకుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పంపుతారు. లెటర్ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసినా వాది, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణలు జరుపుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు.పేదలకు ఉచిత న్యాయ సేవలు..హెచ్ఆర్సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా హెచ్ఆర్సీ, లోకాయుక్తలను ఆశ్రయించి న్యాయం పొందుతారు. కానీ, ఇప్పుడివి లేకపోవడంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. – కృష్ణమూర్తి, బార్ అసిసోయేషన్ అధ్యక్షుడు, కర్నూలు -
ఉచిత న్యాయసేవ ప్రజల హక్కు
ఖలీల్‌వాడి(నిజామాబాద్): ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ఎల్లవేళలా అందిస్తామని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. న్యాయసహాయం అందేలా న్యాయసేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆదివారం రోటరీక్లబ్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో 263 మందికి కృత్రిమకాళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని సామాజిక మార్పు, అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్నికోర్టుల్లో 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టు పరిధిలోనే రెండున్నర లక్షల కేసులు పరిష్కారం కావాల్సి ఉందని చెప్పారు. లోక్‌అదాలత్‌ల ద్వారా వివాదాల పరిష్కారానికి ముందుకు వస్తే అనేక పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉందన్నారు. పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులు పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ తెలిపారు. నేటి సమాజంలో ప్రజలు యాంత్రిక జీవితం గడుపుతున్నారని, ఇది అనేక అనర్థాలకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. కుటుంబసభ్యులు పిల్లలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రయత్నించాలని, తాము ఎటువైపు వెళ్తున్నామనేదానిపై ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఇన్చార్జి సీపీ శ్రీనివాస్‌రెడ్డి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధనవంతులకేనా ఉచిత న్యాయ సేవలు!
► హైకోర్టు ఆక్షేపణ ► న్యాయ సేవాధికార సంస్థ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ► ఏపీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థలకు కోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సమాజంలో న్యాయ సహాయం పొందే స్తోమత లేని వారి కోసం ఉద్దేశించిన ‘ఉచిత న్యాయ సేవలను.. కోర్టు ఫీజు మినహాయింపులను’ కొందరు డబ్బున్న వ్యక్తులు ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేస్తుండ డంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కోర్టు ఫీజు మినహాయింపు కావాలని ఎవరైనా కోరినప్పుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఆ వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల గురించి లోతుగా విచారణ చేపట్టడం లేదని ఆక్షేపించింది. విచారణ జరపకుండానే.. కోర్టు ఫీజు మినహా యింపునకు అర్హులని తేలుస్తుండటాన్ని తప్పుç ³ట్టింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని తెలిపింది. కొందరు బడాబాబులు తమకు ఆర్థిక స్తోమత లేదంటూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, కోర్టు ఫీజు మినహాయింపులు పొందుతూ, మరోపక్క భారీ ఫీజులు ఇచ్చి ప్రైవేట్ న్యాయవాదుల సేవలను ఉపయోగించుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కోర్టు పేర్కొంది. ఆధారాలు లేకున్నా ఫీజు మినహాయింపా? విశాఖపట్నం చినవాల్తేరులోని ఓ ఆస్తి వివాదం జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చేరింది. తమకు కోర్టు ఫీజు చెల్లించేంత స్తోమత లేదని, అందువల్ల తమకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఇవ్వాలంటూ ఆ ఆస్తితో సంబంధం ఉన్న 20 మంది సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకు న్నారు. ఇందుకు వారు తహసీల్దార్ ఇచ్చిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేశారు. 20 మంది తమ వార్షిక ఆదాయం రూ.72 వేలుగా పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987 ప్రకారం వార్షిక ఆదాయం నామమాత్రంగా ఉన్న వారు కోర్టు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందవచ్చు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి రూ.18.59 లక్షల కోర్టు ఫీజు మినహాయింపునిస్తూ ఫిబ్రవరిలో సర్టిఫికేట్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆస్తి వివాదం ఎదుర్కొంటున్న నవ్య ఇన్ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఇరుపక్షాల వాదన విని ఇటీవల తీర్పు వెలువరించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆ 20 మంది ఆర్థిక స్థితిగతులను తెలుసుకోలేదని పేర్కొంది. వీరంతా ఒకే కుటుం బానికి చెందిన వారైనప్పటికీ, అందరూ ఆదా యాన్ని రూ.72 వేలుగా పేర్కొనడం, దానిపై అధికారులు వివరణ కోరకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇచ్చిన ఫీజు మినహాయింçపును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అప్రమత్తంగా ఉండాల్సిందే పేదలు, అవసరమైన వారి కోసం తీసుకొచ్చిన చట్ట నిబంధనలు అర్హత లేని వారికి, అనవసరంగా వివాదాలు సృష్టించే వ్యక్తులకు వరంగా మారుతున్నాయని హైకోర్టు తెలిపింది. ఇకనైనా కోర్టు ఫీజు మినహాయింపులు ఇచ్చేటప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987లో ఉన్న లోపాలను సరిదిద్ది, చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల న్యాయ సేవాధికార సంస్థలకు సూచించింది. కోర్టు ఫీజు మినహాయింపులు పొందిన వారు న్యాయ సేవాధికార సంస్థకు చెందిన ప్యానల్ న్యాయవాదుల సేవలనే వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేసే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.