హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్‌లను కర్నూలులోనే ఉంచుతున్నారా? లేక విజయవాడ తరలిస్తున్నారా?
ఏదో ఒక నిర్ణయం తీసుకుని మాకు చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలులో ఏర్పాటైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్‌లను అక్కడే కొనసాగించడమా? లేక విజయవాడకు తరలించడమా? అన్న విషయంపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
నిర్ణయమైతే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
కర్నూలులో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుపై పిల్..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా కర్నూలులో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
అలాగే, విజయవాడలోనే వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలన్న జీఓకు విరుద్ధంగా కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడాన్ని సవాలుచేస్తూ సామాజిక కార్యకర్త మహ్మద్ ఫరూఖ్ షుబ్లీ 2021లో పిల్ వేశారు. అంతేకాక.. హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుచేసినా కూడా ఫిర్యాదులు తీసుకునేలా యంత్రాంగాన్ని ఇవ్వలేదంటూ ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ 2021లో పిల్ దాఖలు చేసింది. ఈ మూడు వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
విజయవాడలోనే ఉండాలని జీఓ ఇచ్చారు..
వక్ఫ్ ట్రిబ్యునల్ రాజధాని ప్రాంతంలోనే ఉండాలంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఇచ్చిందని పిటిషర్ తరఫు న్యాయవాది సలీం పాషా తెలిపారు. ఆ జీఓ అమలులో ఉండగానే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం 2021లో మరో జీఓ జారీచేసిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ, వక్ఫ్‌బోర్డుల సంగతి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. ఆ మూడు సంస్థలు కర్నూలులో ఏర్పాటయ్యాయని, అక్కడే అవి పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వాటిని అక్కడే కొనసాగిస్తారా? లేక విజయవాడకు తరలిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రణతి చెప్పగా, ఏదో ఒక నిర్ణయం అయితే తప్పక తీసుకోవాల్సిందేనని ధర్మాసనం స్పష్టంచేసి ఆ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment