
ఎండల తీవ్రత వల్ల తగ్గిన కోళ్ల ఉత్పత్తి
మాంసం ప్రియులకు ధరాభారం
విజయనగరం గంటస్తంభం: ఉగాది, రంజాన్ పండగ నేపథ్యంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. విజయనగరం పట్టణంలో కిలో రూ.230 నుంచి రూ.280 వరకు విక్రయించారు. కొన్నిచోట్ల డిమాండ్ బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరిపారు. బర్డ్ ప్లూ భయంతో గతవారం వరకు చికెన్ అమ్మకాలు పడిపోగా ధరలు తగ్గాయి. మళ్లీ ఉగాది నుంచి కేజీపై రూ.30 నుంచి రూ.50 పెరిగాయి. విజయనగరం జిల్లాలో సుమారు 260 కోళ్ల ఫారాలు ఉన్నాయి. జిల్లాలో సాధారణ రోజుల్లో ప్రతి రోజు 1.18 లక్షల కోళ్లు అమ్మకాలు జరుగుతాయని వ్యాపార వర్గాల అంచనా. అదే ఆదివారం, మంగళవారం, ఇతర పండగ రోజుల్లో రూ.1.75 లక్షల వరకు అమ్ముడవుతాయని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు.
ఎండ ఎఫెక్ట్..
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగడం కూడా చికెన్ ధర పెరుగుదలకు కారణమని, ఎండ ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో కోడిపిల్ల కిలోన్నర బరువు పెరగడానికి సుమారు 40 రోజులు పడుతుందని, మార్చి నెల నుంచే ఎండలు మండిపోతుండడంతో పిల్ల దశ నుంచి కోడి దశకు ఎదగడానికి 50 నుంచి 60 రోజులు పడుతోందన్నారు. కోళ్ల ఫారాలలో కూలర్లు, ఏసీలు పెడితేగానీ కోడి పిల్లలు బతికే పరిస్థితి లేదంటున్నారు. విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి నుంచి కోళ్ల ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోందని, ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణమని పేర్కొంటున్నారు.