ఎన్టీఆర్: కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్‌లో కోడి మాంసం ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరగటంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరను చూసి జేబులు పట్టుకుంటున్నారు. సహజంగానే వేసవిలో కోడి మాంసం ధరలు అధికంగా ఉంటాయి. ఈ సీజన్‌లో కోళ్లకు సోకే వ్యాధులతో కోళ్లు మృతి చెందటం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది.
దీని వలన ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ దఫా అనూహ్యంగా పెరిగిన కోడి రేట్లతో నాన్ వెజిటేరియన్లు ఏమి కొంటాము.. ఏమి తింటామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కిలో బాయిలర్ రూ.200 నుంచి రూ.210 వరకు ధర పలికింది. ఫారమ్ కోడి రూ.150 నుంచి రూ.170 వరకు ధర ఉంది. అలాంటిది ఈ వారం బాయిలెర్ మాంసం కిలో ధర రూ.280 నుంచి రూ.285 పలుకుతుంది. ఫారం కోడి కిలో మాంసం రూ.200 దాటింది.
స్థానికంగా లభ్యత లేకనే...
ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకు కోళ్లు తక్కువగా పెంచుతారు. కోతకు సిద్ధం కాగానే విక్రయిస్తుంటారు. ప్రసుత్తం జిల్లా వ్యాప్తంగా కిలో నుంచి కిలోంపావు కోళ్లు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయని దుకాణ దారులు చెబుతున్నారు. వినియోగదారులు చిన్న కోళ్లు కొనటానికి ఆసక్తి చూపక పోవంటతో అధిక బరువు ఉన్న కోళ్లను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి, భీమవరం ప్రాంతాల నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చినట్లయింది.
గుడ్డుదీ అదే దారి...
కోడి మాంసంతో పాటు కోడి గుడ్డు ధర కూడా అదే రూట్‌లో పెరుగుతోంది. పది రోజుల క్రితం రూ.4 లోపు పలికిన గుడ్డు ధర ఈ వారం రూ.5 కు చేరింది. అట్ట కోడిగుడ్డు ధర రూ.120 పలకగా ధర ప్రస్తుతం రూ.150కు చేరింది. కోడి మాంసం, కోడి గుడ్లు ధరలు పెరగటంతో మాంసం ప్రియులు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment