
జస్టిస్ చలమేశ్వర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని శుక్రవారం పదవీవిరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ధర్మాసనాల కేటాయింపు సహా పలు అంశాలపై సీజేఐ తీరును తప్పుబడుతూ జనవరి 12న తనతో పాటు మరో ముగ్గురు జడ్జిలు కలిసి పెట్టిన ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు.
తన నిర్ణయాన్ని పలువురు మాజీ సీజేఐలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు సరైన దిశలో ఆలోచించే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో సమస్య ఉందని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో మరింత పారదర్శకత రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతిపై మరింత తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్ పెట్టిన రోజు తన ఇంటికి సీపీఐ నేత రాజా రావడంపై స్పందిస్తూ.. రాజా తనకు చాన్నాళ్ల నుంచి మిత్రుడని, తామిద్దరమూ మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులమేనని తెలిపారు. ఆ రోజు(ప్రెస్ మీట్ పెట్టిన రోజు) తన ఇంటి ముందు భారీగా మీడియా ఉండటంతో.. ఏం జరిగిందనే ఆందోళనతో ఆయన వచ్చారని వివరించారు. ‘అయితే, అప్పటికి మరికొన్ని వారాల్లో నేను రిటైర్ అవబోతున్నా. అప్పుడు నా ఇంటికి ఎవరొచ్చారనే విషయం కన్నా.. అధికారంలో ఉన్నవారితో ఎవరు(న్యాయమూర్తులు) సమావేశమవుతున్నారనేది మరింత కీలకమైన అంశం’ అని చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘న్యాయవ్యవస్థలో, న్యాయపరమైన అంశాల్లో సీనియర్ మోస్ట్ జడ్జి, అత్యంత జూనియర్ జడ్జి సమానమే. అయితే, ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐకి కొన్ని అదనపు పరిపాలనాపరమైన అధికారాలుంటాయి’ అని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా విచారణకు వచ్చిన ఒక కేసుకు సంబంధించి తాను ఏర్పాటు చేసిన ఐదుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
జస్టిస్ జోసెఫ్ సమర్ధుడు
ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సమర్ధుడైన న్యాయమూర్తి అయిన జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించేందుకు, ఆయన పేరును కొలీజియం మరోసారి సిఫారసు చేయాలన్నారు. జస్టిస్ జోసెఫ్ తన ప్రాంతంవాడో, తన భాషవాడో, తన మతం వాడో కాదని, అయినా ఆయన పదోన్నతి కోసం పోరాడానని వివరించారు.
కొలీజియంలోకి జస్టిస్ ఏకే సిక్రీ!
సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్‌తో సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ ఏకే సిక్రీ ఐదుగురు సభ్యుల బృందంలో చోటు దక్కించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment