KM joshef
-
సుప్రీంకు మళ్లీ జస్టిస్ జోసెఫ్ పేరు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జి పదవికి కొలీజియం మరోసారి సిఫార్సు చేసింది. ఆయన పదోన్నతిపై గతంలో కేంద్రం వెలిబుచ్చిన అభ్యంతరాలను పక్కనపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖల్లో జస్టిస్ జోసెఫ్ అర్హతను తక్కువచేసి చూపే విషయాలేవీ లేవని పేర్కొంది. జస్టిస్ జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ శరణ్‌ల పేర్లను సుప్రీంజడ్జీలుగా ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. సుప్రీంకోర్టు జడ్జి పదవికి జస్టిస్ జోసెఫ్ పేరుకు కొలీజియం తొలుత జనవరి 10నే పచ్చజెండా ఊపగా, ఏప్రిల్ 28న కేంద్రం తిరస్కరించింది. జస్టిస్ జోసెఫ్ సొంత రాష్ట్రం కేరళకు ఇది వరకే సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం ఉన్నందున, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కొలీజియంకు తిరిగి లేఖ రాసింది. మరోవైపు, కలకత్తా హైకోర్టు జడ్జి అనిరుద్ధ బోస్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కొలీజియం సిఫార్సును కేంద్రం తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. 2004లో జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్ బోస్‌కు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం లేదని పేర్కొంది. ఆయనకు బదులు మరో సీనియర్ జడ్జి పేరును ప్రతిపాదించాలని సూచించింది. నిర్మాణ కార్మికుల పథకంపై డెడ్‌లైన్ భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే పథకానికి సెప్టెంబర్ 30వ తేదీలోగా తుదిరూపు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి గడువు విధించింది. శుక్రవారం విచారణ సందర్భంగా బెంచ్ ఎదుట కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆందోళన గుంతలమయమైన రోడ్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలతో దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మరణాలు భయం పుట్టిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో రోడ్డు భద్రత అంశంపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ‘ఉగ్రవాద దాడుల్లో మరణిస్తున్నవారి కంటే కూడా రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువ’అని ధర్మాసనం మీడియా నివేదికలను ఊటంకించింది. -
జస్టిస్ జోసెఫ్‌కే సుప్రీం కొలీజియం మొగ్గు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం మరోసారి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రానికి పంపింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జోసెఫ్ పేరును గతంలో కొలీజియం కేంద్రానికి పంపగా సీనియారిటీ, ప్రాంతీయ సమీకరణాలతో ఆయన పేరును పున:పరిశీలించాలని ప్రభుత్వం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ జస్టిస్ జోసెఫ్ బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించినందుకే కేంద్రం ఆయన పేరును పక్కనపెట్టిందని విపక్షాలు విమర్శించాయి. తాజాగా జస్టిస్ జోసెఫ్ పేరునే సుప్రీం కొలీజియం మరోసారి కేంద్రానికి పంపడంతో దీన్ని ఆమోదించడం మినహా ప్రభుత్వానికి మరో అవకాశం లేదు. జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్ పేర్లను కూడా కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. మరోవైపు కలకతా హైకోర్టు జడ్జ్ అనిరుద్ధ బోస్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సును కేంద్రం తోసిపుచ్చుతూ ఆయన పేరును పున:పరిశీలించాలని కొలీజియంను కోరింది. -
జస్టిస్ గొగోయ్‌కి అన్ని అర్హతలున్నాయి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని శుక్రవారం పదవీవిరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ధర్మాసనాల కేటాయింపు సహా పలు అంశాలపై సీజేఐ తీరును తప్పుబడుతూ జనవరి 12న తనతో పాటు మరో ముగ్గురు జడ్జిలు కలిసి పెట్టిన ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని పలువురు మాజీ సీజేఐలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు సరైన దిశలో ఆలోచించే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో సమస్య ఉందని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో మరింత పారదర్శకత రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతిపై మరింత తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టిన రోజు తన ఇంటికి సీపీఐ నేత రాజా రావడంపై స్పందిస్తూ.. రాజా తనకు చాన్నాళ్ల నుంచి మిత్రుడని, తామిద్దరమూ మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులమేనని తెలిపారు. ఆ రోజు(ప్రెస్ మీట్ పెట్టిన రోజు) తన ఇంటి ముందు భారీగా మీడియా ఉండటంతో.. ఏం జరిగిందనే ఆందోళనతో ఆయన వచ్చారని వివరించారు. ‘అయితే, అప్పటికి మరికొన్ని వారాల్లో నేను రిటైర్ అవబోతున్నా. అప్పుడు నా ఇంటికి ఎవరొచ్చారనే విషయం కన్నా.. అధికారంలో ఉన్నవారితో ఎవరు(న్యాయమూర్తులు) సమావేశమవుతున్నారనేది మరింత కీలకమైన అంశం’ అని చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థలో, న్యాయపరమైన అంశాల్లో సీనియర్ మోస్ట్ జడ్జి, అత్యంత జూనియర్ జడ్జి సమానమే. అయితే, ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐకి కొన్ని అదనపు పరిపాలనాపరమైన అధికారాలుంటాయి’ అని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా విచారణకు వచ్చిన ఒక కేసుకు సంబంధించి తాను ఏర్పాటు చేసిన ఐదుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జస్టిస్ జోసెఫ్ సమర్ధుడు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సమర్ధుడైన న్యాయమూర్తి అయిన జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించేందుకు, ఆయన పేరును కొలీజియం మరోసారి సిఫారసు చేయాలన్నారు. జస్టిస్ జోసెఫ్ తన ప్రాంతంవాడో, తన భాషవాడో, తన మతం వాడో కాదని, అయినా ఆయన పదోన్నతి కోసం పోరాడానని వివరించారు. కొలీజియంలోకి జస్టిస్ ఏకే సిక్రీ! సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్తో సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ ఏకే సిక్రీ ఐదుగురు సభ్యుల బృందంలో చోటు దక్కించుకోనున్నారు. -
జస్టిస్ జోసెఫ్ పేరు మళ్లీ కేంద్రానికి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్ జోసెఫ్ పేరును కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది. ఇదీ నేపథ్యం.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. తర్వాత జస్టిస్ జోసెఫ్ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోసెఫ్ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్ చలమేశ్వర్ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే. -
నేడు కొలీజియం భేటీ!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరోసారి ప్రతిపాదించేందుకు నేడు సుప్రీం కొలీజియం సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై కొలీజియం సభ్యుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలో నేడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కొలీజియాన్ని సమావేశపర్చవచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు అత్యవసరంగా కొలీజియాన్ని సమావేశపర్చాలని కోరుతూ సీజేఐకు సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ జే.చలమేశ్వర్ బుధవారం లేఖ రాశారు. జస్టిస్ జోసెఫ్ పేరును పునఃపరిశీలించాలంటూ కొలీజియా నికి ప్రతిపాదనల్ని ఏప్రిల్ 26న కేంద్రం తిప్పిపంపిన సంగతి తెలిసిందే. గతంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలకు ప్రతిపాదనలు అనుగుణంగా లేదని, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇప్పటికే కేరళ నుంచి తగిన ప్రాధాన్యం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో జస్టిస్ జోసెఫ్ కంటే అనేక మంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జనవరి 10న జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కొలీజియానికి సిఫార్సు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఆయన పేరును సుప్రీం జడ్జీగా పునరుద్ఘాటిస్తున్నాను’ అని లేఖలో జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ జోసెఫ్‌కు పదోన్నతిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లేఖలో జస్టిస్ చలమేశ్వర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చలమేశ్వర్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొలీజియం బుధవారం సమావేశమవుతుందని భావించినప్పటికీ.. జస్టిస్ చలమేశ్వర్ సెలవులో ఉండటం వల్ల జరగలేదని తెలుస్తోంది. కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించేందుకు తాను అనుకూలంగా ఉన్నానని జస్టిస్ జోసెఫ్ కురియన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతిపై నిర్ణయం వాయిదా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు. -
రేపు సుప్రీం కొలీజయం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కొలీజియం మళ్లీ ప్రతిపాదనలు పంపినా కేంద్రం వాటిని ఆమోదించకపోవచ్చని సుప్రీం వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చని చెబుతున్నారు. -
కొలీజియం సిఫార్సులు తిరస్కరణ
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు, కేంద్రప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్(59)ను నియమించాలని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని సుప్రీంను కోరింది. కొలీజియం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు విధించిన పరిమితులకు లోబడి లేవని, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ప్రాతినిధ్యం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ జోసెఫ్ కన్నా అనేకమంది హైకోర్టు సీజేలు, సీనియర్ జడ్జీలు సీనియారిటీలో ముందున్నారని, కొలీజియం సిఫార్సులు సముచితం కాదని పేర్కొంది. సిఫార్సుల్ని తిప్పిపంపడానికి కారణాల్ని కొలీజియంకు తెలియచేస్తూ సీజేఐ జస్టిస్ మిశ్రాకు న్యాయ శాఖ నోట్ పంపింది. జస్టిస్ జోసెఫ్ పేరును పునః పరిశీలించాలన్న ప్రతిపాదనను రాష్ట్రపతి, ప్రధాని ఆమోదించారని పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కొలీజియం చీఫ్‌గా ఉన్న సీజేఐ జస్టిస్ మిశ్రా మద్దతు లభించింది. ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినప్పటికీ జోసెఫ్ పేరును తిరస్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థకు హక్కు ఉందన్నారు. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. జస్టిస్ జోసెఫ్ పేరును మరోసారి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు, సుప్రీం న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకాన్ని ఖరారు చేస్తూ గురువారం ఉదయం న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా, జస్టిస్ జోసెఫ్‌లను సుప్రీం న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ జోసెఫ్ పేరును ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. మరోసారి ఆయన పేరును కొలీజియం న్యాయ శాఖకు సిఫార్సు చేయవచ్చు. ప్రమాణాల మేరకే తిరస్కరించాం: కేంద్రం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో ఒకరికి మాత్రమే ఆమోద ముద్ర వేయడంపై కేంద్ర ప్రభుత్వం వివరణిస్తూ.. ‘సుప్రీం సిఫార్సుల్ని వేరు చేసి చూసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాల సమయంలోను, ఇతర కేసుల్లోను అలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియామకానికి చేసిన సిఫార్సులు సుప్రీం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి లేవు. న్యాయవ్యవస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లోనే జడ్జీల నియామకానికి నిబంధనలు, ఇతర ప్రమాణాల్ని ఏర్పాటు చేశారు. వాటిని మేం పరిగణనలోకి తీసుకున్నాం’ అని సీజేఐకు పంపిన ఆరు పేజీల లేఖలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కొలీజియం అనుమతి లేకుండా సిఫార్సుల్ని వేరు చేయకూడదని 2014లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోథా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ సమయంలో మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియంను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం చేసిన సిఫార్సుల్ని మోదీ ప్రభుత్వం తిరస్కరిస్తూ మిగతా పేర్లకు ఆమోదం తెలిపింది. సీనియారిటీది ప్రధాన పాత్ర.. సుప్రీం న్యాయమూర్తి పదవికి జస్టిస్ జోసెఫ్ కంటే అర్హులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తులు ఉన్నారని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీం న్యాయమూర్తుల నియామకంలో సీనియారిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందని, హైకోర్టు జడ్జీల నియామకంలోను సీనియారిటీని తప్పకుండా పాటిస్తున్నారని తెలిపింది. ‘దేశంలోని అన్ని హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే.. జస్టిస్ జోసెఫ్ 42వ స్థానంలో ఉన్నారు. జస్టిస్ జోసెఫ్ కంటే వివిధ హైకోర్టుల్లో 11 మంది ప్రధాన న్యాయమూర్తులు సీనియారిటీలో ముందున్నారు. జస్టిస్ జోసెఫ్ సొంత హైకోర్టు కేరళ. ఆ రాష్ట్రం నుంచి సుప్రీం కోర్టు, ఇతర హైకోర్టుల్లో తగిన ప్రాతినిధ్యం ఉంది. సుప్రీంలో కేరళ నుంచి కురియన్ జోసెఫ్ జడ్జీగా ఉన్నారు. కేరళకే చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా, ఆంటోనీ డొమినిక్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ సమయంలో కేరళ హైకోర్టు నుంచి వచ్చిన మరొకరిని సుప్రీం జడ్జిగా నియమించడం సమర్ధనీయం కాదు’ అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సుప్రీం చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలోనే ఒక మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకు ఎంపికవడం ఇదే మొదటిసారి. అలాగే స్వాతంత్య్రం అనంతరం సుప్రీంకోర్టులో పనిచేసిన ఏడో మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా.. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి ఒక్కరే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2007లో మల్హోత్రా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 1956, మార్చి 14న ఆమె బెంగళూరులో జన్మించారు. న్యాయ వ్యవస్థ ఏకంకావాలి: కాంగ్రెస్ కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలతో పాటు సీనియర్ న్యాయవాదులు, సుప్రీం బార్ అసోసియేషన్ తప్పుపట్టింది. ‘భారతదేశ న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది. తన స్వతంత్రతను కాపాడుకునేందుకు న్యాయ వ్యవస్థ ఏకం కాకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఎవరు పోరాడతారు. ఇంతవరకూ జరిగింది వదిలేసి న్యాయవ్యవస్థ ఒకే మాటపై నిలబడుతుందా?’ అని కాంగ్రెస్ నేత సిబల్ ప్రశ్నించారు.మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అతీతమా? అని మరో కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. ‘జస్టిస్ జోసెఫ్ నియామకం నిలుపుదల వెనుక కారణమేంటి.. ఆయన రాష్ట్రమా లేక మతమా లేక ఉత్తరాఖండ్ కేసులో తీర్పా?’ అని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. జస్టిస్ జోసెఫ్ నియామకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బార్ అసోíసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తప్పుపట్టారు. ‘కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ఈ రకమైన జోక్యం అనుచితం’ అని పేర్కొన్నారు. కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసినా.. ఉత్తరాఖండ్ కేసులో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినందుకే తిరస్కరించారని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుపట్టారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ..‘ఒకవైపు సీజేఐ బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన్ని నిరక్ష్యం చేస్తున్నామంటున్నారు. కాంగ్రెస్ పూర్తి నిరాశలో ఉంది’ అని విమర్శించారు. చాలా రాష్ట్రాలకు సుప్రీంలో ప్రాతినిధ్యం లేదు: కేంద్రం ‘దేశంలోని కలకత్తా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ నుంచి సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. చాలా కాలం నుంచి సుప్రీం కోర్టులో ఎస్సీ, ఎస్టీల నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం’ అని లేఖలో కేంద్రం తెలిపింది. జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఫిబ్రవరిలో కొలీజియం బహిర్గతం చేస్తూ.. ‘ఇతర హైకోర్టు సీజేలు, సీనియర్ జడ్జీల కంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి జస్టిస్ జోసెఫ్ అర్హుడు’ అని పేర్కొంది. 2016లో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జోసెఫ్ రద్దు చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేలా ఉత్తర్వులిచ్చారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా అందరూ భావించారు. న్యాయ వ్యవస్థతో అనుచితంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని న్యాయ మంత్రి రవిశంకర్ విమర్శించారు. ‘తమకు అనుకూలంగా లేని జడ్జీల్ని కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛను సమర్ధిస్తూ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తన అభిప్రాయం చెప్పినందుకు ఆయనను పక్కన పెట్టి జూనియర్‌ను సీజేఐగా నియమించారు’ అని పేర్కొన్నారు. -
ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్
- కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం - సంబంధిత ఫైల్‌పై ప్రధాని మోదీ సంతకం - రాష్ట్రపతికి చేరిన నియామక ఫైల్ - నేడో, రేపో ఉత్తర్వులు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ నియామకానికి మార్గం సుగమమైంది. ఆయన నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. అందుకు సంబంధించిన ఫైల్‌పై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి సంతకం చేశారు. దీంతో ఈ ఫైలు తుది ఆమోదం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరింది. నేడో, రేపో జస్టిస్ జోసెఫ్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నియామకపు ఉత్తర్వులు అందుకున్న తరువాత జస్టిస్ జోసెఫ్ ఉమ్మడి హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్వస్థలమైన కేరళకు వెళ్లి, ఉమ్మడి హైకోర్టుకు దసరా సెలవులు ముగిసిన తరువాత సీజేగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోసెఫ్‌ను ఉమ్మడి హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే పలు రాజకీయ కారణాలతో ఈ నియామకానికి కేంద్రం ఇంతకాలం ఆమోదముద్ర వేయలేదు. దీంతో ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ జోసెఫ్ వస్తారా?రారా? అన్న విషయంపై ఉభయ రాష్ట్రాల్లో తీవ్ర చర్చ మొదలైంది. అయితే ఉమ్మడి హైకోర్టుతో పాటు దేశంలోని పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గత నెల నుంచి న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా జస్టిస్ జోసెఫ్ నియామకపు ఫైల్‌పై మోడీ సంతకం చేయడంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైంది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుపడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయంటూ సంచలన తీర్పునిచ్చిన జస్టిస్ జోసెఫ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదీ నేపథ్యం... జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జన్మించారు. కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయం, తరువాత ఢిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత చెన్నై లయోలా కాలేజీలో చేరారు. ఎర్నాకుళంలోని ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. మొదట ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1983లో ప్రాక్టీస్‌ను కేరళకు మార్చారు. ప్రముఖ న్యాయవాది వర్గీస్ ఖల్లియత్ వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూలై 18న ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ జోసెఫ్ తండ్రి జస్టిస్ కె.కె.మాథ్యూ కూడా న్యాయమూర్తే. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. జస్టిస్ జోసెఫ్‌కు అత్యంత సౌమ్యుడిగా, ముక్కుసూటి మనిషిగా పేరుంది. -
ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్
- ఉత్తరాఖండ్ హైకోర్టు నుంచి బదిలీపై త్వరలో ఉమ్మడి హైకోర్టుకు - ఏసీజే జస్టిస్ బొసాలేకు మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి - సుప్రీంకోర్టుకు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ - సిఫార్సులు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుపడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయంటూ సంచలన తీర్పునిచ్చి వార్తల్లో నిలిచారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా రాష్ట్రపతికి సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.కె.మాథ్యూ కుమారుడైన జస్టిస్ జోసెఫ్‌కు వివాదరహితుడిగా పేరుంది. జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న కేరళలోని కొచ్చిలో జన్మించారు. కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయం, తరువాత ఢిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత చెన్నై లయో లా కాలేజీలో చేరారు. ఎర్నాకుళంలోని ప్రభుత్వ ‘లా’ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. మొదట ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1983లో ప్రాక్టీస్‌ను కేరళకు మార్చారు. ప్రముఖ న్యాయవాది వర్గీస్ ఖల్లియత్ వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూలై 18న ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు. జస్టిస్ బొసాలేకు పదోన్నతి.. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. మరోవైపు మధ్యప్రదేశ్, అలహాబాద్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్భూషణ్లకూ పదోన్నతి లభించింది. ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్‌లిద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. వాస్తవానికి ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బొసాలేకు ప్రధాన న్యాయమూర్తిగా కొంతకాలం క్రితమే పదోన్నతి రావాల్సి ఉంది. అయితే ఈయన కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడం, అప్పటికే మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లిద్దరూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొనసాగుతుండటంతో జస్టిస్ బొసాలే పదోన్నతి ఆలస్యమైంది. ఒకే రాష్ట్రానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించడం సంప్రదాయానికి విరుద్ధం కావడంతో ఇప్పటి వరకు జస్టిస్ బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతో ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు జస్టిస్ బొసాలేకు మార్గం సుగమమైంది.