- ఉత్తరాఖండ్ హైకోర్టు నుంచి బదిలీపై త్వరలో ఉమ్మడి హైకోర్టుకు
- ఏసీజే జస్టిస్ బొసాలేకు మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి
- సుప్రీంకోర్టుకు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్
- సిఫార్సులు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుపడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయంటూ సంచలన తీర్పునిచ్చి వార్తల్లో నిలిచారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా రాష్ట్రపతికి సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.కె.మాథ్యూ కుమారుడైన జస్టిస్ జోసెఫ్‌కు వివాదరహితుడిగా పేరుంది.
జస్టిస్ జోసెఫ్ 1958 జూన్ 17న కేరళలోని కొచ్చిలో జన్మించారు. కొచ్చిలోని కేంద్రీయ విద్యాలయం, తరువాత ఢిల్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తరువాత చెన్నై లయో లా కాలేజీలో చేరారు. ఎర్నాకుళంలోని ప్రభుత్వ ‘లా’ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. మొదట ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1983లో ప్రాక్టీస్‌ను కేరళకు మార్చారు. ప్రముఖ న్యాయవాది వర్గీస్ ఖల్లియత్ వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూలై 18న ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు.
జస్టిస్ బొసాలేకు పదోన్నతి..
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. మరోవైపు మధ్యప్రదేశ్, అలహాబాద్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్‌లకూ పదోన్నతి లభించింది. ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్‌లిద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. వాస్తవానికి ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బొసాలేకు ప్రధాన న్యాయమూర్తిగా కొంతకాలం క్రితమే పదోన్నతి రావాల్సి ఉంది.
అయితే ఈయన కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడం, అప్పటికే మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లిద్దరూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొనసాగుతుండటంతో జస్టిస్ బొసాలే పదోన్నతి ఆలస్యమైంది. ఒకే రాష్ట్రానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించడం సంప్రదాయానికి విరుద్ధం కావడంతో ఇప్పటి వరకు జస్టిస్ బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ అజయ్ ఖాన్విల్కర్, జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతో ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు జస్టిస్ బొసాలేకు మార్గం సుగమమైంది.
ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్
Published Wed, May 4 2016 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement
Advertisement