హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీపై కీలక తీర్పు | High Court Employee Housing Society has been judged | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీపై కీలక తీర్పు

Published Sat, Jan 12 2019 3:54 AM | Last Updated on Sat, Jan 12 2019 3:54 AM

High Court Employee Housing Society has been judged - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీలో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న పలు వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా ఉమ్మడి హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ సొసైటీ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ చల్లా కోదండరామ్, జస్టిస్‌ పి.కేశవరావులకు ఈ కమిటీలో స్థానం కల్పించింది. సొసైటీ అకౌంట్ల పరిశీలనకు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్‌.మమతలతో ఏర్పాటు చేసిన కమిటీ తన బాధ్యతలను పూర్తి చేసి, రెండు నెలల్లో తన నివేదికను జడ్జీల కమిటీకి అప్పగించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ కమిటీ నివేదికను బట్టి జడ్జీల కమిటీ తదుపరి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చునంది.

సొసైటీ మేనేజింగ్‌ కమిటీలోని సభ్యులు ఎవరైనా ఏ రకమైన దుర్వినియోగానికి పాల్పడి ఉంటే, వారిపై ఐపీసీ, సహకార చట్ట నిబంధనల మేరకు మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటినీ కూడా రిజిష్ట్రార్‌ జనరల్‌ చేత నియమితులయ్యే అధికారికి అప్పగించాలని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిని హైకోర్టు ఆదేశించింది. లేఔట్‌ అమలు విషయంలో జడ్జీల కమిటీ అనుమతితో సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవచ్చునంది. ప్లాట్ల కేటాయింపు విధానం, సభ్యులు చెల్లించిన లేఔట్‌ అభివృద్ధి చార్జీలు తదితర వివరాలను జడ్జీల కమిటీకి, సొసైటీ సభ్యులకు అందచేయాలని ప్రస్తుత హౌసింగ్‌ సొసైటీ పాలకవర్గాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ ముందుంచిన లేఔట్, భవన ప్లాన్‌లను జడ్జీల కమిటీ ముందు ఉంచి, వాటిని ఆ కమిటీ సలహా మేరకు అమలు చేయాలని స్పష్టం చేసింది. 

ఆర్‌జీ... ఉద్యోగులపైఓ కన్నేసి ఉంచండి.. 
ఏ వ్యక్తి నుంచి రూ.5వేలకు మించి నగదును తీసుకోవడానికి గానీ, చెల్లింపులు చేయడానికిగానీ వీల్లేదని కమిటీ పాలకవర్గానికి హైకోర్టు తేల్చి చెప్పింది. జడ్జీల కమిటీని సంప్రదించి ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను నియమించుకోవాలని ఆదేశించింది. చెల్లింపులు, స్వీకరణల ఖాతాలను సిద్ధం చేయాలంది, మూడు, ఆరు నెలలతో పాటు వార్షిక ఆడిట్‌ నివేదికలను సిద్ధం చేసి, వాటిని డిస్‌ప్లే బోర్డులో ఉంచాలంది. లేఔట్‌ అభివృద్ధి, తదితర పనులపై సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను వేర్వేరు ఏజెన్సీల నుంచి తెప్పించుకోవాలని, అంతిమంగా జడ్జీల కమిటీ ఆమోదించిన వారికి పనులు అప్పగించాలంది. సభ్యులకు కేటాయించిన ప్లాట్లలో నిర్మాణాలను హౌసింగ్‌ సొసైటీ చేపట్టడానికి వీల్లేదంది. కేటాయించిన ప్లాట్లను ఉపయోగించుకునే విషయంలో సభ్యులకు స్వేచ్ఛనివ్వాలంది. సొసైటీకి హైకోర్టు ప్రాంగణంలో కేటాయించిన కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని, కోర్టు పని గంటల్లో సొసైటీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. ఈ విషయంలో ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలని రిజిష్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)ను ఆదేశించింది.  

ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోండి... 
అర్హులైన పలువురికి సొసైటీలో సభ్యత్వం ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం కేటాయించిన స్థలం పక్కనే ఏదైనా స్థలం ఖాళీగా ఉంటే దానిని కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోవాలని సొసైటీకి స్పష్టం చేసింది. స్థలం కేటాయింపు విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చునంది. తాము ఆదేశించిన మేర ప్లాట్ల కేటాయింపులు, లేఔట్‌ అభివృద్ధి సంతృప్తికరంగా జరుగుతుంటే, జడ్జీల కమిటీ పక్కకు జరిగి, ఎన్నిౖకైన పాలకవర్గాలు స్వతంత్రంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ప్రత్యేక దృష్టి సారించిన సీజే రాధాకృష్ణన్‌...
హైకోర్టు ఉద్యోగులకు 2010లో ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగింది. అంతకు ముందే ఏపీ హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు జరిగింది. స్థలాల కేటాయింపు జరగడానికి ముందే సొసైటీ బైలాను సవరించడంపై 2007లో కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్థలం కేటాయింపు జరిగిన తరువాత వివాదాలు మరింత ముదిరాయి. ఆ తరువాత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. వీటన్నింటిపై పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉమ్మడి హైకోర్టు సీజేగా వచ్చిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఈ మొత్తం వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సొసైటీలో చోటు చేసుకున్న అన్ని పరిణామాలను పాలనాపరంగా తెలుసుకున్నారు. ఈ వివాదాలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల వాదనలు విని తీర్పు వెలువరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement