జస్టిస్ నాగార్జునరెడ్డికి బాసట
• అభిశంసన నోటీసు విషయంలో జోక్యం చేసుకోండి
• రామకృష్ణవి నిరాధార, తప్పుడు ఆరోపణలు
• రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, సీజేఐలకు న్యాయవాదుల వినతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు బాసటగా నిలిచారు. ఆయనపై 50 మందికి పైగా రాజ్యసభ సభ్యులు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు ఓ వినతిపత్రంపై సుమారు 1,050 మంది న్యాయవాదులు సంతకాలు చేసి దానిని రాష్ట్రపతి తదితరులకు పంపారు. ఈ సందర్భంగా వారు ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ ఏ మరణ వాంగ్మూలం గురించి ఆరోపణలు చేశారో ఆ వాంగ్మూలాన్ని, 13 ఫిబ్రవరి 2013న నాగార్జునరెడ్డి తనను ఆయన ఇంటిలో కొట్టారన్న ఆరోపణలకు సంబంధించి ఆ రోజు రామకృష్ణ సెలవులో ఉన్నట్లు రుజువు చేసే సెలవు పత్రాన్ని జత చేసి పంపారు. నిజాయితీతో నిర్భయంగా విధులు నిర్వర్తించే ఓ న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలను మొగ్గలోనే తుంచి వేయాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రతీ న్యాయమూర్తీ ఇలాగే వ్యక్తుల ప్రయోజనాలకు లక్ష్యాలుగా మారుతారని వివరించారు. 1050 న్యాయవాదులు తమ వినతిపత్రంలో తమ ఆరోపణలను పూర్తిగా వివరించారు.