justice nagarjuna reddy
-
మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులు వృత్తి మెళకువలు నేర్చుకుని పైకి రావాలంటే ఓ మంచి న్యాయవాదిని ఎంపిక చేసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేయాలని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. మంచి న్యాయవాది అంటే ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాదని, న్యాయశాస్త్రంలో అంశాల మీద మంచి పట్టున్న వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తి వద్ద చేరితే కేసులను వాదించే అవకాశం దక్కి, మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని, తద్వారా వృత్తిలో ముందుకెళ్లే అవకాశం దొరుకుతుందని చెప్పారు.వాదించే అవకాశం సులభంగా రాదని, బాగా కష్టపడాలని ఉద్బోధించారు. తాను కూడా అలా కష్టపడితేనే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు. యువ న్యాయవాదులకు రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్), కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతుల్లో రెండో రోజు శనివారం “ఆర్ట్ ఆఫ్ అడ్వొకసీ’ అనే అంశంపై జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడారు. కేవలం వాదనలు వినిపిస్తే సరిపోదని, వాదనలు ఎలా వినిపించాలో నేర్చుకోవాలని, అది ఓ కళ అని తెలిపారు. ఆ కళని ఒంటబట్టించుకుంటేనే విజయవంతమైన న్యాయవాది అవుతారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.అందరిలో ఒకరిలా ఉండిపోకండి‘న్యాయ పాలనలో న్యాయవాదులు, న్యాయమూర్తుల పాత్ర’ అన్న అంశంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడారు. న్యాయమూర్తిగాకంటే న్యాయవాదిగా తాను ఎక్కువ ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. మూడుసార్లు తాను న్యాయమూర్తి పోస్టును తిరస్కరించానని, చివరకు విధి లేని పరిస్థితుల్లో ఆ పోస్టును అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఆ మరుసటి రోజే తన అంగీకారన్ని ఉపసంహరించుకుంటానని అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కోరానని, అప్పటికే జాబితా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.తాను ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. ఎప్పుడూ పెద్ద కలలు కనాలని, అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికి చేరుకుంటారని, అసలు కలలు కనకుంటే ఏ స్థాయికీ రాలేరని తెలిపారు. అందరిలో ఒకరిలా ఉండపోకూడదని, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని చెప్పారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావును బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు.కక్షిదారుడు న్యాయవాదులకు దేవుడుమనకు కేసు అప్పగించే కక్షిదారుడిని ఎప్పుడూ దేవుడిలా చూడాలని జస్టిస్ నాగార్జునరెడ్డి చెప్పారు. కక్షిదారుడిని అవమానించడం, తక్కువ చేసి చూడటం, అతనితో కర్కశంగా మాట్లాడటం వంటివి చేయకూడదన్నారు. కక్షిదారుడు ఇచ్చే ఫీజుతో మన కుటుంబాలు నడుస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు. అలాగే కక్షిదారుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలో కూడా సహేతుకంగా ఉండాలని హితవు పలికారు. -
జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
-
ఏపీఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ప్రమాణ స్వీకరం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డికి గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ నాగుపల్లి శ్రీకాంత్, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీ ఈఆర్సీ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్సీ) చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 30 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. -
13 మంది సంతకాలు ఉపసంహరించుకున్నారు
- దీంతో జస్టిస్ నాగార్జున రెడ్డిపై ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించారు - రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అభిశంసన విషయంలో ఒక ఆంగ్ల దినపత్రికలో గురువారం ప్రచురితమైన వార్తా కథనం శుద్ధ అబ ద్ధమని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అభిశంసన నిమిత్తం 54 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసినప్పటికీ, జస్టిస్ నాగార్జునరెడ్డికి హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకున్న 13 మంది సభ్యులు తమ సంతకాలను ఉపసహరించుకున్నారని వివరించారు. దీంతో రాజ్యసభ చైర్మన్ సంబంధిత ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించారని తెలిపారు. ఈ వాస్తవాల గురించి ప్రస్తావించకుండా కేవ లం నాణేనికి ఒకవైపు ప్రచురించిన సదరు ఆంగ్ల పత్రిక... నీతి, నిజాయితీలకు మారుపేరైన జస్టిస్ నాగా ర్జునరెడ్డి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిందని విమర్శిం చారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆ పత్రిక ఈ విధం గా అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం సరికా దన్నారు. ఇదే విషయాన్ని తాను ఆ పత్రిక యాజమాన్యం దృష్టికి రాతపూర్వకంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ చేసిన అరోపణలన్నింటినీ కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత వాస్తవాలను తెలుసుకుని పలువురు సభ్యులు తమ సంతకాలను ఉపసంహరించుకుంటున్నట్లు రాజ్యసభ చైర్మన్‌కు తెలిపారని, అయితే ఈ పత్రిక ఈ విషయాన్ని ఎక్కడా కూడా తన కథనంలో పేర్కొనలేదని తెలిపారు. ఇది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పత్రిక వ్యవహరించాల్సిన తీరు ఎంత మాత్రం కాదని విమర్శించారు. నిరాధారంగా, పక్షపాతంతో, ఓ నిర్దిష్ట ఎజెండాతో ఈ కథనం ప్రచురించారన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ను సంప్రదించి ఉంటే వాస్తవాలు తెలిసి ఉండేవని ఆయన తెలిపారు. -
జస్టిస్ నాగార్జునరెడ్డిపై ఆరోపణలన్నీ అవాస్తవాలే..
⇒ హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ ⇒ రామకృష్ణ సమర్పించినవన్నీ తప్పుడు డాక్యుమెంట్లే ⇒ ఆయన పిటిషన్లో ఏమాత్రం పసలేదు ⇒ అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డిపై సస్పెండైన న్యాయాధికారి ఎస్.రామ కృష్ణ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉమ్మడి హైకోర్టు తేల్చింది. అవాస్తవ ఆరోపణ లు చేయడమే కాకుండా అవి నిజమైనవేనని నమ్మించేందుకు రామకృష్ణ తప్పుడు డాక్యు మెంట్లు సమర్పించాడని స్పష్టం చేసింది. రామకృష్ణ అబద్ధాలనే పునాదిపై అవాస్తవాలు.. అభూత కల్పనలు.. తప్పుడు డాక్యు మెంట్లు.. స్థిరత్వం లేని, పరస్పర విరుద్ధమైన వాదనలను ఇటుకలుగా పేర్చి ఈ కేసును నిర్మించారంటూ న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నిర్మాణానికి రకరకాల రంగులను అద్దారని దుయ్యబట్టింది. జస్టిస్ నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు, మరికొం దరు కిందికోర్టు ఉద్యోగులపై ఆరోపణలు చేస్తూ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్లో ఏమాత్రం పస లేదని పేర్కొంది. ఈ కేసులో జస్టిస్ నాగార్జునరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలం టూ రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసిం ది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమ ణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువ రించింది. రామకృష్ణ లేవనెత్తిన అంశాలకు, అతడు సమర్పించిన డాక్యుమెంట్లకు ఎటువంటి విశ్వసనీయత లేదని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో రామకృష్ణ తీరును, అతడి దురుద్దేశాలను ధర్మాసనం తన తీర్పులో ఎండగట్టింది. సస్పెన్షన్ ఎత్తివేత కోసం పిటిషన్ న్యాయాధికారిగా పనిచేస్తున్న సమయంలో పలు తీవ్రమైన ఆరోపణలు రావడంతో రామ కృష్ణను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వు లిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరు తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక తానిచ్చిన వినతి పత్రాల ఆధారంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు, కిందికోర్టు ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంలో ఆయన జస్టిస్ నాగార్జునరెడ్డిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చగా, ధర్మాసనం ఆయన పేరును తొలగించింది. తరువాత ఈ వ్యాజ్యంపై జస్టిస్ వి.రామసు బ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ జరుగు తుండగానే, జస్టిస్ నాగార్జునరెడ్డిని ప్రతివా దిగా చేర్చాలని రామకృష్ణ మరోసారి న్యాయ స్థానాన్ని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై విచారణ జరిపి, గత నెల 28న తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం గురు వారం ఉదయం తన తీర్పును వెలువరిం చింది. తీర్పు సారాంశం ఇది... జస్టిస్ నాగార్జునరెడ్డి రాయచోటిలోని తన ఇంటిలో 13.2.2013న తనను కిందికోర్టు సిబ్బందిపై పెట్టిన కేసుల ను ఉపసంహరిం చుకోవాలని ఒత్తిడి చేశారని రామకృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు తాను నిరాకరించడం తో నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు తనను కులం పేరుతో దూషించారని చెప్పారు. ఈ ఘటనను తాను 14.2.2013న హైకోర్టుకు వినతి పత్రం రూపంలో వివరించానన్నారు. వాస్తవానికి రామకృష్ణ మొదటిసారి 18.2. 2013న హైకోర్టుకు వినతిపత్రం పంపారు. 14.2.2013న వినతిపత్రం అసలు హైకోర్టుకే అందలేదు. అసలు రామకృష్ణ తమకు ఎలాం టి వినతిపత్రం పంపలేదంటూ హైకోర్టు రిజిస్ట్రీ దాఖలు చేసిన కౌంటరే ఇందుకు సాక్ష్యం. అంతేగాక రామకృష్ణ తన తరువాతి వినతి పత్రాల్లో పేర్కొన్న విషయాలన్నీ అతడు అల్లిన కట్టుకథలో భాగమే. మరణ వాంగ్మూలం.. రామకృష్ణ సృష్టే రామకృష్ణ గతంలో కోర్టుకు సమర్పించానని చెప్పిన వినతిపత్రాల్లో మరణ వాంగ్మూలం గురించి ప్రస్తావించలేదు. హఠాత్తుగా తాను దాఖలు చేసిన వ్యాజ్యం ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. 20.11.2012న 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశానని రామకృష్ణ చెబుతున్నారు. 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మరణ వాంగ్మూలం ఇచ్చేందుకు స్పృహలో ఉంటారా? డాక్టర్ సమక్షంలో మరణ వాంగ్మూలం నమోదు చేశానని రామకృష్ణ చెప్పారు. మరోచోట వాంగ్మూలం నమోదు మధ్యలోనే డాక్టర్ కేశవరాజు రూమ్ నుంచి వెళ్లిపోయారని, మళ్లీ తిరిగి రాలేదని రామకృష్ణ రాశారు. దీన్నిబట్టి ఆయన తాను నమోదు చేశానని చెబుతున్న ఈ మరణ వాంగ్మూలంలోని కథంతా అతను వండినదే. అప్పుడు గగ్గోలు.. తరువాత వక్రమార్గాలు ఓ వ్యక్తి తన చుట్టూ తాను సృష్టించుకున్న పరిస్థితుల నుంచి బయటకు రాలేనప్పుడు ఇలాంటి చర్యలకు దిగుతాడు. కాబట్టి రామ కృష్ణ ఇదంతా ఎందుకు చేశారన్నది సుస్పష్టం. ఆయన ఈ వ్యవహారంలో మరో న్యాయమూ ర్తి (అప్పటి విజిలెన్స్ రిజిస్ట్రార్)పై కూడా పిటి షన్ దాఖలు చేశారు. దానిని మేం ప్రాథమిక దశలోనే కొట్టేశాం. అసలు రామకృష్ణ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యమే చెల్లదన్నది మా నిర్ధిష్ట అభిప్రాయం. ఈ కేసును హైకోర్టు విచారించడం లేదంటూ అరచి గగ్గోలు పెట్టిన రామకృష్ణ, విచారణ ప్రారంభమైన తరువాత వక్రమార్గాలను అనుసరించారు. సెలవులో వ్యక్తి నాగార్జునరెడ్డి ఇంటికి ఎలా వెళ్లారు? రామకృష్ణ 2013 ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. 15వ తేదీ వరకు సెలవులో ఉన్న వ్యక్తి 13వ తేదీన జస్టిస్ నాగార్జునరెడ్డి ఇంటికి ఎలా వెళ్లినట్లు? రామకృష్ణ మొదటి వినతి పత్రం ఇచ్చింది 2013 ఫిబ్రవరి 18న. అందులో ఎక్కడా కూ డా నాగార్జునరెడ్డి తనను ఇంటికి పిలిపించి ప్రశ్నించారన్న ఆరోపణ చేయలేదు. దీన్ని గుర్తించిన రామకృష్ణ 2013 ఫిబ్రవరి 14న వినతి పత్రం సమర్పించినట్లు ఓ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఈ తప్పుడు డాక్యుమెంట్నే కోర్టుకు సమర్పించారు. -
జస్టిస్ నాగార్జునరెడ్డికి పితృవియోగం
సాక్షి, హైదరాబాద్/వీరబల్లి (రాజంపేట): ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తండ్రి సి.శ్రీరాములురెడ్డి (97) గురువారం రాత్రి మరణించారు. వయోభారం కారణంగా గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైఎస్సార్ జిల్లా కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన వీరబల్లి మండలం గడికోట గ్రామం యడబల్లికి తీసుకొచ్చారు. శ్రీరాములురెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి కాగా, చిన్న కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి రాయచోటిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిలు యడబల్లికి చేరుకుని శ్రీరాములురెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. నాగార్జునరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించారు.శనివారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. -
శ్రీవారి సేవలో జస్టిస్ నాగార్జునరెడ్డి
సాక్షి, తిరుమల / సూళ్లూరుపేట: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగా ర్జునరెడ్డి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించు కున్నారు. ఉదయం నైవేద్య విరామ సమ యంలో కుటుం బస భ్యులతో కలసి ఆయన ఆలయానికి వచ్చారు. ధ్వజ స్తంభానికి మొక్కుకుని, తర్వాత స్వామి వారిని, వకుళమాతను దర్శించి హుండీ లో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో జస్టిస్ కు వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ ఆధికారు లు లడ్డూ ప్రసాదా లు అందజేశారు. అనంతరం చెంగాళమ్మ ఆలయంలో అమ్మవారిని జస్టిస్ నాగార్జున రెడ్డి దర్శించుకున్నారు. -
‘మహాభియోగం’ తిరస్కరణ
నిజం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు - జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు ఉపసంహరించుకుంటున్నాం - రాజ్యసభ చైర్మన్‌కు పలువురు సభ్యుల లిఖితపూర్వక నివేదన - దీంతో నోటీసును తిరస్కరించిన చైర్మన్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ‘నిర్దోషిత్వం’ నిరూపణైంది. ఆయనపై 61 మంది రాజ్యసభ్య సభ్యులు మోపిన ‘మహాభియోగ’ నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ అవాస్తవాలు, అభూత కల్పనలు, తప్పుడు డాక్యుమెంట్లతో తమను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న పలువురు రాజ్యసభ్య సభ్యులు నాగార్జునరెడ్డిపై తామిచ్చిన అభిశంసన నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లిఖితపూర్వకంగా నివేదించారు. దీంతో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జస్టిస్ నాగార్జునరెడ్డికి సంబంధించిన అభిశంసన దస్త్రాన్ని మూసివేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అభిశంసన నోటీసు ఉపసంహరణ నేపథ్యంలో సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని జస్టిస్ నాగార్జునరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అత్యంత వివాదాస్పదుడిగా పేరుపడి సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి అవాస్తవాలు, తాను సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లతో పలువురు రాజ్యసభ సభ్యులను కలిశారు. రామకృష్ణ చెప్పిన వివరాలు, సమర్పించిన డాక్యుమెంట్లను మాత్రమే పరిశీలించిన రాజ్యసభ సభ్యులు నాణేనికి మరోవైపు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో జస్టిస్ నాగార్జునరెడ్డిపై అభిశంసన నోటీసు తయారైంది. దీనిపై 61 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసి చర్చ నిమిత్తం దానిని రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చారు. ఈ నోటీసు గురించి తెలుసుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి తన నిర్దోషిత్వం నిరూపణ అయ్యేంతవరకు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి తెలియచేశారు. నిజాయితీ, ముక్కుసూటితనానికి జస్టిస్ నాగార్జునరెడ్డి మారుపేరంటూ న్యాయవాదులు ఆయనకు బాసటగా నిలిచారు. అసలు వాస్తవాలను వివరిస్తూ వారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యులకు వినతిపత్రాలు పంపారు. రామకృష్ణ చెప్పినవన్నీ కట్టుకథలనీ, ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తప్పుడువని రుజువు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లన్నింటినీ జత చేసి పంపారు. ఏకంగా 1,050 మందికి పైగా న్యాయవాదులు ఆ వినతిపత్రంపై సంతకాలు చేశారు. దీంతో అభిశంసన నోటీసుపై సంతకాలు చేసిన రాజ్యసభ సభ్యులకు రామకృష్ణ నైజం బోధపడింది. ఈ నేపథ్యంలో వారు అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రామకృష్ణ క్రమశిక్షణారాహిత్యం, అతనిపై ఉన్న కేసులు, అప్పులు ఎగవేసిన చరిత్ర, న్యాయమూర్తులపై నిరాధారణ ఆరోపణలు చేయడం, తదితర విషయాలన్నీ ఆధారాలతో సహా అర్థం చేసుకున్నారు. దీంతో సంతకాలు చేసిన వారిలో పలువురు రాజ్యసభ సభ్యులు జస్టిస్ నాగార్జునరెడ్డిపై ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారు లిఖితపూర్వకంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తెలియచేశారు. దీంతో అభిశంసన నోటీసును తిరస్కరిస్తూ, అందుకు సంబంధించిన దస్త్రాన్ని మూసివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. -
జస్టిస్ నాగార్జునరెడ్డికి బాసట
• అభిశంసన నోటీసు విషయంలో జోక్యం చేసుకోండి • రామకృష్ణవి నిరాధార, తప్పుడు ఆరోపణలు • రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, సీజేఐలకు న్యాయవాదుల వినతి సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు బాసటగా నిలిచారు. ఆయనపై 50 మందికి పైగా రాజ్యసభ సభ్యులు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు ఓ వినతిపత్రంపై సుమారు 1,050 మంది న్యాయవాదులు సంతకాలు చేసి దానిని రాష్ట్రపతి తదితరులకు పంపారు. ఈ సందర్భంగా వారు ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ ఏ మరణ వాంగ్మూలం గురించి ఆరోపణలు చేశారో ఆ వాంగ్మూలాన్ని, 13 ఫిబ్రవరి 2013న నాగార్జునరెడ్డి తనను ఆయన ఇంటిలో కొట్టారన్న ఆరోపణలకు సంబంధించి ఆ రోజు రామకృష్ణ సెలవులో ఉన్నట్లు రుజువు చేసే సెలవు పత్రాన్ని జత చేసి పంపారు. నిజాయితీతో నిర్భయంగా విధులు నిర్వర్తించే ఓ న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలను మొగ్గలోనే తుంచి వేయాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రతీ న్యాయమూర్తీ ఇలాగే వ్యక్తుల ప్రయోజనాలకు లక్ష్యాలుగా మారుతారని వివరించారు. 1050 న్యాయవాదులు తమ వినతిపత్రంలో తమ ఆరోపణలను పూర్తిగా వివరించారు. -
జస్టిస్ నాగార్జునరెడ్డిపై విశ్వాసం ఉంది
• కొన్ని ప్రయోజనాలు ఆశించే ఆయనపై తప్పుడు ఆరోపణలు • ఏసీజేకు న్యాయవాదుల వినతి సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో 61 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలి పారు. న్యాయమూర్తిగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందంటూ దాదాపు 650 మందికి పైగా న్యాయవాదులు సంతకాలు చేశారు. నిర్ధోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలన్న ఆయన నిర్ణయాన్ని మార్చుకుని, విధులకు హాజరయ్యేలా చూడాలంటూ వారు శుక్రవారం ఏసీజే జస్టిస్ రమేశ్రంగనాథన్కు వినతిపత్రం ఇచ్చారు. సస్పెన్షన్‌లో ఉండటం తో పాటు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటు న్న ఓ న్యాయాధికారి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టించి దురుద్దేశాలతో జస్టిస్ నాగార్జునరెడ్డిపై నిందలు మోపారు. ఈ కేసులో ఆ న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించేందుకు సైతం నిరాకరించింది. కోర్టు బయట మీడియాలో న్యాయవ్యవస్థ ప్రతిష ్టను దిగజార్చేలా మాట్లాడినందుకు ఆ అధికారిపై కోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నిర్భయంగా, నిష్పాక్షికంగా విధులు నిర్విర్తిస్తున్న ఓ సిట్టింగ్ జడ్జి నైతిక స్థైర్యాన్ని దెబ్బతిసేందుకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్ని ప్రయోజనాలు ఆశించి మచ్చలేని, దేనికి జంకని జస్టిస్ నాగార్జునరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేశారు. ఈ యత్నాలను న్యాయవాదులందరం ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థకు, న్యాయవాద వృత్తికి ప్రమాదకరమైన ఇలాంటి చర్యలను మొగ్గలోనే తుంచేయాలి అని న్యాయవాదులు ఏసీజేను కోరారు. దీనిపై ఏసీజే సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదులు తెలిపారు. ఇదిలా ఉంటే, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా ఇదే అభ్యర్థనతో ప్రత్యేకంగా ఏసీజేను కలిశారు. ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదులుగా జస్టిస్ నాగార్జునరెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ వినతిపత్రాలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పం పాలని న్యాయవాదులు నిర్ణరుుంచారు. -
నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరం
- జస్టిస్ నాగార్జునరెడ్డి స్వచ్ఛంద నిర్ణయం! - సీజేఐ, ఏసీజే,రాష్ట్ర గవర్నర్‌కు లేఖ! - ఏసీజే నేతృత్వంలో ఫుల్ కోర్ట్ సమావేశం సాక్షి, హైదరాబాద్: తనపై రాజ్యసభలో 61 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి సి.వి.నాగార్జునరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వం నిరూపితమయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని స్వచ్ఛందంగా నిర్ణరుుంచుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి టి.ఎస్.ఠాకూర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, గవర్నర్ నరసింహన్‌లకు తెలియజేసినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ మేరకు ఆయన వారికి లేఖ రాసినట్లు హైకోర్టు వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఏసీజే నేతృత్వంలో న్యాయమూర్తులందరూ (ఫుల్ కోర్ట్) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అభిశంసన తీర్మానంలో తనపై చేసిన ఆరోపణలు తనను ఎంతగానో వేదనకు గురి చేశాయని జస్టిస్ నాగార్జునరెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తాను సంపాదించుకున్న ప్రతిష్టను కాలరాసేందుకు తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజల విశ్వాసం పైనే న్యాయవ్యవస్థ పనిచేస్తుంది. న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించేటప్పుడు నాపై ప్రజలకు విశ్వాసం ఉందనే భావిస్తూ ఉంటాను. నాపై మోపిన ఆరోపణలను చూసి ప్రజల్లో కొందరైనా నా నిబద్ధత, నిజారుుతీపై సందేహం లేవనెత్తే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి న్యాయవ్యవస్థకు క్షేమకరం కాదు. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. విధులకు హాజరు కాకూడదన్న నిర్ణయంలో భాగంగానే ఆయన మంగళవారం కోర్టుకు రాలేదు. -
ఇదేం నిబంధన..?
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనడానికి హిందూయేతరులు అనర్హులంటూ టెండర్ నిబంధన రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టెండర్ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. కుల, మత, జాతి, లింగ, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 15ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అవుతున్నా దేవాదాయశాఖ ఇప్పటికీ పౌరుల పట్ల మతేతర వ్యవహారాల్లో మతపరమైన వివక్ష చూపుతుండటం శోచనీయమంది. షాపుల వేలం ప్రక్రియలో హిందూయేతరులకు స్థానం లేకుండా చేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని దేవాదాయశాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2016, జనవరి 1 నుంచి 2018, డిసెంబర్ 31 వరకు శ్రీశైలం దేవస్థానం సమాచార కేంద్రం ఉన్న 1, 2 షాపుల లీజు హక్కుల నిమిత్తం దేవాదాయశాఖ వేలం నోటీసు జారీ చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనేందుకు అనర్హులని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. 1, 2 షాపులను గత 40 ఏళ్లుగా తాము నిర్వహిస్తున్నామని, ప్రతీ వేలంలో తాము అత్యధిక మొత్తాలకు షాపు లీజుల్ని దక్కించుకుంటున్నామని, ఈసారి షాపుల లీజులు పొందేందుకు హిందూయేతరులు అనర్హులంటూ జారీ చేసిన వేలం నోటీసును రద్దు చేయాలంటూ ఆయూబ్ అలీఖాన్, ఎ.ఎం.బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. ఈ ధోరణి అవాంఛనీయమైంది.. పిటిషనర్ల తరఫున ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందూయేతరులకు వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశమివ్వకుండా టెండర్ నిబంధనలను రూపొందించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ వ్యక్తమవని అభ్యంతరాలను ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూయేతరులు వేలం ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులనడంపై విస్మయం వెలిబుచ్చారు. దేవాదాయశాఖ అనుసరిస్తున్న ఈ ధోరణి అవాంఛనీయమైనదిగా తేల్చారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు దేవాదాయశాఖ పనితీరుపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జస్టిస్ నాగార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాథమిక ఆధారాలను బట్టి దేవాదాయశాఖ రూపొందించిన నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. శ్రీశైల దేవస్థాన పరిధిలోని షాపులను మతవిశ్వాసాల ఆధారంగా కేటాయిస్తున్నామని దేవాదాయశాఖ అధికారులే చెప్పట్లేదని, అలాంటప్పుడు హిందూయేతరులను వేలం ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధం విధించడం ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వివరణివ్వాలని దేవాదాయశాఖ అధికారుల్ని ఆదేశించారు. పిటిషనర్ల రెండుషాపుల్ని రూ.9,500, రూ.6,000కు వేలంలో ఇతరులు దక్కించుకున్నారని విద్యాసాగర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ మొత్తాల్ని పిటిషనర్లే చెల్లించి, తమ షాపుల్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చని, అయితే ఈ కొనసాగింపు కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
ఆయన జీవితం ఆదర్శం
కడప కల్చరల్:అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా బసిరెడ్డి జీవించారని.. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, జిల్లా రాజకీయ దురంధరుడు, దివంగత నేత పెంచికల బసిరెడ్డి 105వ జయంతి ఉత్సవాన్ని ఆదివారం కడప జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి మాట్లాడుతూ బసిరెడ్డి తన న్యాయవాద వృత్తిలోనూ,రాజకీయ, ప్రజా సేవా రంగాల్లోనూ నిజాయితీకి మారుపేరుగా నిలిచి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసిం చారు. బసిరెడ్డిలాంటి వారితోనే ప్రజాస్వామ్యంలో స్థిరత్వం ఏర్పడిందన్నారు. భావితరాలలో ఆయన స్ఫూర్తిని నిం పేందుకు ఈ ఉత్సవాలు వేదిక కావడం హర్షణీయమన్నారు. ట్రస్టు ఏర్పాటుకు సూచించిన జస్టిస్ నాగార్జునరెడ్డి అభినందనీయుడని, ట్రస్టుకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. బంధాన్ని గుర్తుచేసుకుంటూ... జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బసిరెడ్డి తో తమకు గల బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉండింటే నేడు రాష్ట్రానికి ఈ దుర్గతి దాపురించేది కాదని డాక్టర్ మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, ఇలాంటి సభల ద్వారా ఆయన పాటించిన విలువల పునరుద్ధరణకు కృషి చేద్దామని వరదరాజులరెడ్డి అన్నారు. డాక్టర్ శివరామకృష్ణయ్య, ఎమ్మెల్సీ చెంగల్రాయులు, జిల్లా ప్రముఖులు శంకర్‌రెడ్డి మాట్లాడారు. సభ ప్రారంభమైందిలా.. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి బసిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సభను ప్రారంభించగా, ఎస్ఎస్ నాగార్జునరెడ్డి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి సంచిక విశేషాలను తెలుపగా, కార్యక్రమ సమన్వయకర్త సీహెచ్ సిద్దారెడ్డి అతి థులను సభకు పరిచయం చేశారు. ఆళ్లూరి వెంకట య్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బసిరెడ్డి కుమారు డు, కుటుంబ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరిం చారు.ఎమ్మెల్సీనారాయణరెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజోలి వీరారెడ్డి, టీడీపీ నాయకులు సతీష్‌రెడ్డి, వాసు, వైవీయూ వీసీ శ్యాం సుందర్ పాల్గొన్నారు. మంచివైపు మళ్లిద్దాం.. బసిరెడ్డిలాంటి ఆదర్శ వ్యక్తుల స్ఫూర్తితో సమాజాన్ని మంచి వైపు మళ్లించేందుకు నిస్వార్థంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజంలోని మంచిని కాపాడుకోవాలంటే బసిరెడ్డిలాంటి వారిని స్మరించుకోవాలన్నారు. సునిశిత విమర్శలు: జస్టిస్ నాగార్జున రెడ్డి సమాజంలో ప్రస్తుత తీరుతెన్నుల పట్ల సునిశిత విమర్శలు సంధించారు. సమాజం భ్రష్టు పట్టడానికి లోపభూయిష్టమైన విద్యావిధానమే ముఖ్య కారణమన్నారు. నేటితరం తల్లిదండ్రులు బిడ్డలను ధనసంపాదనే ధ్యేయంగా పెంచుతున్నారని, సమాజానికి పనికొచ్చే వారిగా పెంచేవారు కరువయ్యారన్నారు. ఇటీవల స్కాములు ఎక్కువయ్యాయని, ఇవి పాముల కంటే ప్రమాదమైనవని దుయ్యబట్టారు. ట్రస్టుకు రూ. లక్ష విరాళం: బసిరెడ్డిలాంటి ఆదర్శ సేవకులను స్మరించుకునేందుకు ఆయన పేరిట సమాజ సేవ కార్యక్రమాలను నిర్వహించేందుకు వారి గురించి పుస్తకాలు ప్రచురించి భావితరాల్లో స్ఫూర్తినింపేందుకు జిల్లా స్థాయిలో బసిరెడ్డి పేరిట ట్రస్టు ఏర్పాటు చేయాలని జస్టిస్ నాగార్జునరెడ్డి సూచించారు. బస్టిస్ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ట్రస్టు ఏర్పాటు చేయాలని కోరుతూ తనవంతుగా చిరు మొత్తాన్ని స్వీకరించాలని లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ‘సీమ’ అభివృద్ధికి కృషి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన సీమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన బసిరెడ్డి పదవులకన్నా ప్రజాసేవనే గొప్పగా భావించారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తుల గురించి నేటితరానికి తెలిపేందుకు ఆయన కుమారుడు రఘునాథరెడ్డి ఈ వేడుక నిర్వహిస్తున్నారన్నారు. బసిరెడ్డికి ఘన నివాళి స్వాతంత్య్ర సమరయోధులు దివంగత నేత పెంచికల బసిరెడ్డి 105వ జయంతి సంద ర్భంగా రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి ఆయన విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు. ఆదివారం సంధ్య సర్కిల్లోని బసిరెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఆయన పూలమాలలు వేశారు. హైకోర్టు జస్టిస్ నాగార్జున రెడ్డి, హైకోర్టు విశ్రాంత జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, బసిరెడ్డి కుమారుడు రఘనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, ఎస్వీ సతీష్‌రెడ్డి కూడా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.